జిల్లాలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు
కలప అక్రమ రవాణా
అరికట్టేందుకు ఏర్పాటు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
వరంగల్ రూరల్ : జిల్లాలో కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీని కలెక్టర్ అధ్యక్షతన, సీపీ, జేసీ, ఐటీడీఏ పీఓ, వనసేన, ఎకో క్లబ్ సభ్యులతో ఏర్పాటుచేశారు. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కలప అక్రమ రవాణా అడ్డుకునేందుకు వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యాన చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తరచూ తనిఖీ చేయాలన్నారు. ఆ తర్వాత అటవీ చట్టం ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు ఎన్నిక కేసులు నమోదయ్యాయని ఆరా తీశారు.
అటవీ వన సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని, చెక్‌పోస్టుల సంఖ్య పెంచాలని డీఎఫ్‌ఓకు సూచించారు. ప్రతినెల జిల్లా స్దాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, సభ్యులు ఖచ్చితంగా హజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేసీ ముండ్రాతి హరిత, డీసీపీ ఇస్మాయిల్, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, వనసేవ అధ్యక్ష, కార్యదర్శులు పొట్లపల్లి వీరభద్రరావు, గంగోజుల నరేష్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి పాల్గొన్నారు.