Integrated check posts
-
జిల్లాలో ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు
కలప అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పాటు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వరంగల్ రూరల్ : జిల్లాలో కలప అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీని కలెక్టర్ అధ్యక్షతన, సీపీ, జేసీ, ఐటీడీఏ పీఓ, వనసేన, ఎకో క్లబ్ సభ్యులతో ఏర్పాటుచేశారు. ఈ కమిటీ తొలి సమావేశం శనివారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ కలప అక్రమ రవాణా అడ్డుకునేందుకు వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యాన చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తరచూ తనిఖీ చేయాలన్నారు. ఆ తర్వాత అటవీ చట్టం ఉల్లంఘించిన వారిపై ఇప్పటి వరకు ఎన్నిక కేసులు నమోదయ్యాయని ఆరా తీశారు. అటవీ వన సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని, చెక్‌పోస్టుల సంఖ్య పెంచాలని డీఎఫ్‌ఓకు సూచించారు. ప్రతినెల జిల్లా స్దాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తామని, సభ్యులు ఖచ్చితంగా హజరు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జేసీ ముండ్రాతి హరిత, డీసీపీ ఇస్మాయిల్, డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి, వనసేవ అధ్యక్ష, కార్యదర్శులు పొట్లపల్లి వీరభద్రరావు, గంగోజుల నరేష్, బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శౌరిరెడ్డి పాల్గొన్నారు. -
రూ.100 కోట్లు అడిగితే 12 కోట్లిచ్చారు
ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు అంటూ అరకొర నిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 20 నెలలు దాటిన తరువాత ఏపీ సరిహద్దుల్లో చెక్‌పోస్టులు నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. రోడ్లపై చెట్ల నీడలో, దాబాలో కూర్చొని అంతర్రాష్ట్ర వాహనాలను ‘తనిఖీ’ చేస్తున్న తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు చెక్‌పోస్టుల కోసం నిధులు కేటాయించింది. అయితే, ఈ 7 ‘ఇంటిగ్రేటెడ్’ చెక్‌పోస్టుల కోసం కేవలం రూ.12కోట్లు మాత్రమే విడుదల చేసింది. చెక్‌పోస్టుల నిర్మా ణం, నిఘా ఏర్పాట్ల కోసం తొలివిడత రూ.100 కోట్ల వరకు అవసరమని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు నివేదికలు పంపినప్పటికీ, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై నిఘా వేసేందుకు 7 చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో కోదాడ, విష్ణుపురం, నాగార్జునసాగర్, ఖమ్మంలో పాల్వంచ, కల్లూరు, అశ్వారావుపేట, మహబూబ్‌నగర్ జిల్లాలో తుంగభద్ర నది బ్రిడ్జి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆయా సరిహద్దుల్లో ప్రభుత్వ స్థలాలేవీ లేనందున ప్రైవేటు భూములను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. భూసేకరణ చట్టం అమలు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కుల్లేకుండా భూములు కొనుగోలు చేయడమొక్కటే మార్గమని అధికారులు భావించారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద కనీసం నాలుగెకరాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ధర విషయంలో అధికారులకు, భూ యజమానులకు పొంతన కుదరకపోవడంతో... బీఓటీ (నిర్మాణం, నిర్వహణ, అప్పగింత) విధానంలో లీజు పద్ధతిలో తీసుకోవాలని భావించారు. ఈ విధానానికి కొన్ని జిల్లాల్లో భూ యజమానులు ఒప్పుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, చెక్‌పోస్టులు నిర్మించాల్సి ఉంది. ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ విధానంలోనే ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. ఈ లెక్కన చెక్‌పోస్టుల వద్ద అధునాతన కెమెరాలు, స్కానర్లు, వేయింగ్ మిషన్లు, గోడౌన్, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో సాధార ణ రీతిన కూడా చెక్‌పోస్టుల నిర్మాణం సాధ్యం కాదని అధికారులే పెదవి విరుస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏవీ? రాష్ట్రంలో వాణిజ్యపన్నుల శాఖకు ఏపీతో పా టు కర్ణాటక, మహారాష్ట్రల సరిహద్దులున్నాయి. కర్ణాటకతో చిరాగ్పల్లి, జహీరాబాద్ క్రాస్‌రోడ్స్‌లో చెక్‌పోస్టులు ఉండగా, మహారాష్ట్రతో బైంసా, వాంకిడి, మద్నూర్‌లలో ఉన్నాయి. ఇవికాకుండా ఆదిలాబాద్ జిల్లాలోని బొరాజ్, నిజామాబాద్ జిల్లాలోని సాలూర చెక్‌పోస్టులు ప్రాధాన్యత గలవి. వీటిని ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా మార్చాలని సమైక్య రాష్టంలోనే ప్రణాళికలు తయారు చేసినా.. ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు. -
అంతులేని అవినీతి!
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల్లో అవినీతికి అంతులేకుండా పోతోంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా గుడిపాల మండలంలోని నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో సొమ్ము పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. నరహరిపేట చెక్‌పోస్ట్‌లో శనివారం తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విధినిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద రశీదులు లేకుండా ఉన్న 1,02,690 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన దాడుల్లోనూ పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఉప వాణిజ్యపన్నుల శాఖాధికారి, సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించి ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు సహాయకులుగా కొందరు ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమ్యామ్యా వ్యవహారాలన్నీ ప్రయివేటు వ్యక్తులు చక్కబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరు పట్టుబడితే చర్యలు ఉండవనే భావన సిబ్బందిలో నెలకొంది. గతంలో కన్నా అధిక సొమ్ము నరహరిపేట చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు ఈ ఏడాది మార్చి 27న దాడులు చేశారు. మొత్తం 90,170 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం అంతకంటే ఎక్కువగా 1,02,690 రూపాయలు పట్టుబడింది. ఇటీవల పలమనేరు మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అవినీతి సొమ్ముకు సంబంధించి కొంత మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. అదే విధంగా తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం, రేణిగుంట రవాణా చెక్‌పోస్ట్‌లపై గతంలో దాడులు జరిగాయి. అధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. డిసెంబర్ హడావుడే.. డిసెంబర్ కదా ఇది మామూలుగా జరిగే వ్యవహారమే అంటూ ఏసీబీ దాడులపై కొందరు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. దాడులను వారు ఏ మాత్రమూ తీవ్రంగా పరిగణించినట్లు లేదు. ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తే తప్ప సిబ్బందికి అవినీతి జాడ్యం వదిలేటట్లు లేదు.