చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలోని చెక్‌పోస్ట్‌ల్లో అవినీతికి అంతులేకుండా పోతోంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. తాజాగా గుడిపాల మండలంలోని నరహరిపేట ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్‌లో సొమ్ము పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. నరహరిపేట చెక్‌పోస్ట్‌లో శనివారం తెల్లవారుజామున 1.50 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విధినిర్వహణలో ఉన్న ఏసీటీవోలు సురేష్, గోపాల్, పళణి, సివిల్ సప్లయిస్ డెప్యూటీ తహశీల్దార్ రహీముద్దీన్‌ఖాన్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద రశీదులు లేకుండా ఉన్న 1,02,690 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.
గతంలో జరిగిన దాడుల్లోనూ పెద్దమొత్తంలో నగదు పట్టుబడింది. ఈ ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులో ఉప వాణిజ్యపన్నుల శాఖాధికారి, సహాయ వాణిజ్యపన్నుల శాఖాధికారి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, సహాయ మోటారు వాహనాల తనిఖీ అధికారి, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించి ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, అటవీశాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు. వీరు సహాయకులుగా కొందరు ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమ్యామ్యా వ్యవహారాలన్నీ ప్రయివేటు వ్యక్తులు చక్కబెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీరు పట్టుబడితే చర్యలు ఉండవనే భావన సిబ్బందిలో నెలకొంది.
గతంలో కన్నా అధిక సొమ్ము
నరహరిపేట చెక్‌పోస్ట్‌పై ఏసీబీ అధికారులు ఈ ఏడాది మార్చి 27న దాడులు చేశారు. మొత్తం 90,170 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం అంతకంటే ఎక్కువగా 1,02,690 రూపాయలు పట్టుబడింది. ఇటీవల పలమనేరు మోటారు వాహనాల తనిఖీ అధికారి కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అవినీతి సొమ్ముకు సంబంధించి కొంత మంది సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. అదే విధంగా తిరుపతి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయం, రేణిగుంట రవాణా చెక్‌పోస్ట్‌లపై గతంలో దాడులు జరిగాయి. అధిక మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. విధుల్లో ఉన్న సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
డిసెంబర్ హడావుడే..
డిసెంబర్ కదా ఇది మామూలుగా జరిగే వ్యవహారమే అంటూ ఏసీబీ దాడులపై కొందరు సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. దాడులను వారు ఏ మాత్రమూ తీవ్రంగా పరిగణించినట్లు లేదు. ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తే తప్ప సిబ్బందికి అవినీతి జాడ్యం వదిలేటట్లు లేదు.
అంతులేని అవినీతి!
Published Sun, Dec 22 2013 2:53 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement