సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్‌ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు.
తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
ఇప్పటివరకు సలహాదారులే..
రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్‌లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్‌చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్‌శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్‌ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి.
మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్‌రెడ్డిని ఐసీసీసీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
పునర్వ్యవస్థీకరణతో కలిపి..
హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్‌స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్‌కు 1,252, సైబరాబాద్‌కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు.
అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఆ చాంబర్‌ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment