Telangana State Police
-
నేరాలు పెరిగి.. ప్రమాదాలు తగ్గి
రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదులో 8.97 శాతం పెరిగినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదిక 2023 వెల్లడించింది. 2022లో మొత్తం 1,95,582 కేసులు నమోదు కాగా.. 2023లో 2,13,121 కేసులు నమోదైనట్టు నివేదికలో పేర్కొన్నారు. 2022లో 938 జీరో ఎఫ్ఐఆర్లు నమోదుకాగా 2023లో అది 18 శాతం పెరుగుదలతో 1,108కి చేరింది. మహిళలపై నేరాలకు సంబంధించి 2022లో 18,075 కేసులు నమోదు కాగా, 2023లో 5.19 శాతం పెరుగుదలతో 19,013 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల కేసులు 4.27శాతం పెరిగాయి. ప్రధాన నేరాల నమోదు, పలు రకాల నేరాల సరళి, తదితర అంశాలపై నివేదికలో పేర్కొన్న కీలక అంశాలు ఇలా ఉన్నాయి. – సాక్షి, హైదరాబాద్ 2023లో శిక్షల ఖరారులో 2 శాతం తగ్గుదల ♦ 2023లో మొత్తం అన్ని రకాల కేసులలో కన్విక్షన్ రేట్ 41 శాతం, 2022లో ఇది 43 శాతంగా ఉంది. ♦ 73 రేప్ కేసులలో 84 మంది నిందితులకు యావజ్జీవ ఖైదు. ♦ పోక్సో చట్టం కింద నమోదైన 87 కేసులలో 104 మంది నిందితులకు శిక్ష పడింది. వీరిలో 41 మందికి జీవిత ఖైదు, నలుగురికి 25 ఏళ్ల జైలు, 58 మందికి 20 ఏళ్ల జైలు, ఒకరికి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. ♦ మహబూబాబాద్ పట్టణంలో దీక్షిత్‌రెడ్డి అనే 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్‌చేసి అనంతరం హత్య చేసిన కేసులో నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష పడింది. అత్యాచారం కేసులు కారణాల వారీగా..: ♦ మొత్తం కేసులు: 2,284 ♦ పెళ్లి పేరుతో మోసం చేసినవి: 1,580 (69.18 శాతం) ♦ పరిచయస్తులు పాల్పడినవి: 307 (13.44 శాతం) ♦ కుటుంబీకులు, బంధువులు చేసినవి: 147 (6.44 శాతం) ♦ గుర్తుతెలియని వ్యక్తులు చేసినవి: 6 (0.26 శాతం) ♦ మిగిలిన కేసులు ఇతర సాంకేతిక అంశాలతో అత్యాచారం కేసుగా నమోదైనవి హత్యలు కారణాల వారీగా...: మొత్తం హత్యలు: 789 కుటుంబ కలహాలతో : 176 (22.31 శాతం) వివాహేతర సంబంధాలతో : 136 (17.24 శాతం) భూ/ఆస్తి వివాదాల కారణంగా: 89 (11.28 శాతం) ప్రేమ వ్యవహారాలతో : 18 (2.28 శాతం) సుపారీ హత్యలు: 8 (1.01 శాతం) పరువు హత్యలు: 2 (0.25 శాతం) మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి, ఇప్పటికీ హతులు, హంతకులు గుర్తించనివి ఉన్నాయి. కిడ్నాప్‌లు కారణాల వారీగా ఇలా.. మొత్తం కిడ్నాప్‌లు : 1,362 ప్రేమ, వివాహేతర సంబంధాలవి : 646 (47.43 శాతం) మైనర్ల మిస్సింగ్వి : 329 (21.15 శాతం) ఆర్థిక వివాదాల వల్ల : 111 (8.14 శాతం) అక్రమ నిర్బంధం : 35 (2.56 శాతం) ప్రతీకారేచ్ఛతో : 26 (1.9 శాతం) డబ్బు కోసం : 09 (0.66 శాతం) మిగిలినవి ఇతర కారణాల వల్ల జరిగినవి. సైబర్ నేరాలపై ఇలా..: ♦ టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందిన మొత్తం ఫిర్యాదులు – 85,030 ♦ నమోదు చేసిన మొత్తం ఎఫ్ఐఆర్లు – 12,317 ♦ సైబర్ నేరగాళ్లు కొట్టేసిన సొమ్మురూ.707,25,75,547 ♦ పోలీసులు స్తంభింపజేసిన మొత్తం రూ.1,14,72,13,218 ♦ బాధితులకు తిరిగి ఇప్పించిన మొత్తం రూ.7,29,32,546 ♦ అరెస్టుల సంఖ్య 149 మహిళలపై ప్రధాన నేరాలు నమోదు ఇలా ..: అత్యాచారం కేసులు 2,284 వరకట్నం హత్యలు 33 వరకట్న వేధింపులతో మృతులు 132 వరకట్న వేధింపులు 9,458 హత్యలు 213 -
టీఎస్‌పీఐసీసీసీ చైర్మన్‌గా డీజీపీ మహేందర్‌రెడ్డి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు విభాగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఓ ‘సూపర్ పోస్టు’ను సృష్టిస్తున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవలే ప్రారంభించిన ‘తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీఎస్‌పీఐసీసీసీ)’కు ప్రభుత్వం చైర్మన్‌ను నియమించనుంది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. తర్వాత ఆయననే ఈ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర పోలీసు విభాగం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైతం ఐసీసీసీ చైర్మన్ ఆధీనంలోనే ఉండనున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు చరిత్రలో ఇలాంటి పోస్టు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇప్పటివరకు సలహాదారులే.. రాష్ట్ర పోలీసు విభాగంలో డీజీపీతోపాటు వివిధ హోదాల్లో పనిచేసి రిటైరైన వారి సేవలను వినియోగించుకోవడం కొన్నాళ్లుగా జరుగుతోంది. అయితే వారిని శాంతిభద్రతల విభాగం సలహాదారులుగానో, చట్ట సవరణ, పోలీసు మ్యాన్యువల్‌లలో మార్పుచేర్పులకు సంబంధించిన కమిటీలకు ఇన్చార్జులుగానో నియమింవారు. మాజీ డీజీపీలు ఏకే మహంతి, అనురాగ్శర్మలతోపాటు రిటైర్డ్ ఐజీ గంగాధర్‌ల నియామకాలు ఈ కోవలోకే వస్తాయి. మరికొందరు పదవీ విరమణ చేసిన డీఎస్పీలు, అదనపు ఎస్పీల సేవలనూ వివిధ రకాలుగా వినియోగించుకుంటున్నారు. కొందరైతే ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా కూడా పనిచేస్తున్నారు. వారంతా గవర్నర్, హోంమంత్రి, డీజీపీ లేదా ఆయా యూనిట్లకు నేతృత్వం వహించే పోలీసు ఉన్నతాధికారి ఆధీనంలో పని చేస్తుంటారు. దీనికి భిన్నంగా ఎం.మహేందర్‌రెడ్డిని ఐసీసీసీ చైర్మన్‌గా కేబినెట్ హోదాలో నియమించడానికి సన్నాహాలు జరుగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పునర్వ్యవస్థీకరణతో కలిపి.. హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మూడింటిలో జోన్లు, డివిజన్లతోపాటు పోలీస్స్టేషన్ల సంఖ్య పెంపునకు ప్రతిపాదనలు పంపాల్సిందిగా ఆదేశించింది. దీనిపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేసి పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు రూపొందించింది. హైదరాబాద్‌కు 1,252, సైబరాబాద్‌కు 750, రాచకొండకు 763 మంది అదనపు సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు. అయితే ప్రభుత్వం ఐసీసీసీ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని నియమించాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆయన ఆధీనంలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో మార్పులు జరిగాయి. కేబినెట్ మూడు కమిషనరేట్ల ప్రతిపాదనలకు అదనంగా ఐసీసీసీ కోసం 400, సైబర్ సెక్యూరిటీ వింగ్ కోసం 500 పోస్టులను కూడా జోడించి ఆమోదముద్ర వేసింది. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో కలిపి మొత్తంగా 3,965 పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పోలీసు విభాగం వినియోగిస్తున్న టెక్నాలజీల నిర్వహణతోపాటు ఐసీసీసీ మొత్తం దాని చైర్మన్ ఆ«ధీనంలోకి వెళుతుంది. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కొనసాగుతున్న ఐసీసీసీకి సంబంధించిన కమాండ్ కంట్రోల్ సెంటర్లోని ఏడో అంతస్తులో చైర్మన్ కార్యాలయం ఉండనుంది. ఇటీవల ఐసీసీసీకి వెళ్లిన మహేందర్‌రెడ్డి ఆ చాంబర్‌ను పరిశీలించారని.. ఈ వారాంతంలో లేదా వచ్చే నెల మొదటివారంలో ఐసీసీసీ చైర్మన్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
4 జిల్లాలకు పోలీసు బాస్‌లు లేరు..
సాక్షి, హైదరాబాద్: పలు జిల్లాలకు, కమిషనరేట్లకు పూర్తిస్థాయి పోలీసు బాస్‌లు లేరు. కొందరికి పదోన్నతులు లభించినా పాతస్థానాల్లో కొనసాగుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎస్ అధికారులకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగపోవడం గమనార్హం. ఐదేళ్ల క్రితం ఒకేసారి ఏర్పడిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లలో ఖమ్మం, సిద్ధిపేటలకు కమిషనర్లు మారినా రామగుండం సీపీ సత్యనారాయణ, నిజామాబాద్‌లో కార్తికేయ కమిషనర్లుగా అక్కడే ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లా లకు పూర్తిస్థాయి ఎస్పీలను నియ మించలేదు. నల్ల గొండ ఎస్పీగా ఉంటూ డీఐజీగా ప్రమోషన్ పొం దిన రంగనాథ్ కూడా 2018 నుంచి అక్కడే ఎస్పీగా కొనసాగుతున్నారు. 2019 ఏప్రిల్‌లో 23 మంది ఐపీఎస్ అధికారులకు పదో న్నతులు ఇచ్చినా పాత స్థానాల్లోనే 90 శాతం మంది కొనసాగుతున్నారు. వీరికి అదనపు బాధ్యతలు.. ఏడీజీ వీవీ శ్రీనివాసరావు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పదవితోపాటు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంజయ్‌జైన్– ఏడీజీ (పీ అండ్ ఎల్), పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ బాధ్యతలు చూస్తున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు విజిలెన్స్ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎస్పీ రమణకుమార్ బదిలీతో ఏసీబీలో జాయింట్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయింది. త్వరలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు రిటైర్ కానున్నారు. దీంతో ఏసీబీలో కీలకమైన రెండు పోస్టులు ఖాళీ అవనున్నాయి. ఎస్పీలుగా పదోన్నతులుగా లభించినా... మార్చి ఆఖరివారంలో ప్రభుత్వం 32 మంది అడిషనల్ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో మెజారిటీ అధికారులకు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పదవీవిరమణ వయసును 58 నుంచి 61కి పెంచడంతో వీరికి పోస్టింగులు ఇవ్వడం సవాలుగా మారిందని సమాచారం. ఇన్‌చార్జీలతోనే... కీలకమైన నాలుగు జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేరు. నిర్మల్ జిల్లాకు అడిషనల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆదిలాబాద్‌కు అడిషనల్ ఎస్పీ రాజేశ్ చంద్ర ఇన్చార్జి ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు కూడా పోలీసుబాసులు లేరు. ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలు రామగుండం సీపీకి, ములుగు జిల్లా బాధ్యతలను జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్‌కి అప్పగించారు. ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఖమ్మం సీపీగా విష్ణువారియర్‌ను నియమించగా, ఖమ్మం సీపీగా ఉన్న ఇక్బాల్ బదిలీ మీద ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా, తన స్థాయి కంటే తక్కువ పోస్టులో విధులు నిర్వహించడం ఇష్టంలేక మిన్నకుండిపోయారని సమాచారం. -
తెలంగాణకే నా సర్వీస్: ధాత్రిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సేవలందించడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని సివిల్స్ 46వ ర్యాంకర్ ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. 2018 సివిల్స్‌లో 233వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ శిక్షణ తీసుకుంటున్న ఆమె త్వరలో ట్రైనీ ఏసీపీగా ఖమ్మంలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. తాజాగా సివిల్స్–2019లో 46వ ర్యాంక్ సాధించి ఔరా అనిపించుకున్న యాదాద్రిభువనగిరి జిల్లా ముద్దుబిడ్డ ధాత్రిరెడ్డి.. ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా తెలంగాణకే సేవలందిస్తానని బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. ఈజీగానే ఇంటర్వ్యూ ఈ ఏడాది జూలై 10కి నేషనల్ పోలీసు అకాడమీ (ఎన్పీఏ)లో ఫేజ్–వన్ ఐపీఎస్ శిక్షణ పూర్తయింది. తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో ఈ నెలాఖరుకు శిక్షణ పూర్తవుతుంది. అంతలోనే 2019 సివిల్స్‌కు ప్రిపేరై 46వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఎన్పీఏలో శిక్షణ సమయంలోనే 2019 సివిల్స్ ఇంటర్వ్యూకు ప్రిపేరయ్యా. కరెంట్ ఎఫైర్స్ కోసం రెగ్యులర్‌గా పత్రికలు ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ, హబీలు, ఇంట్రెస్ట్, ప్రీవియస్ వర్క్‌పై అడుగుతారని అందుకు తగ్గట్టు ప్రిపేరయ్యా. అయితే ఇంటర్వ్యూ ఈజీగానే అయిపోయింది. ఏదైనా ఇష్టమే.. లక్కీ ప్లేస్‌లో ఉన్నా సివిల్స్ రాయాలని ఎప్పుడైతే అనుకున్నానో.. ఐఏఎస్, ఐపీఎస్ ఏదొచ్చినా ఫర్వాలేదనుకున్నా. రెండు సర్వీసులూ ఇష్టమే. నిజానికి నేను చాలా లక్కీ ప్లేస్‌లో ఉన్నా. సాధారణంగా ఒకరికి ఒక్కటి రావడమే ఎక్కువ. నాకు చాయిస్ ఉంది. ఐపీఎస్ తెలంగాణ క్యాడర్ నాది. ఇక్కడే వర్క్ చేయాలని ఉంది. ఐఏఎస్‌లో కేటాయించే క్యాడర్‌ను బట్టి నిర్ణయం ఉంటుంది. ఏదేమైనా ప్రజాసేవకు మరింత చేరువవుతా. ఇంట్లోనే ప్రిపరేషన్ నాన్న పి.కృష్ణారెడ్డి, తల్లి పి.సుశీల, తమ్ముడు గ్రీష్మన్‌రెడ్డి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ కూడా గైడ్ చేసేవారు. హైదరాబాద్‌లోనే ఇంట ర్ వరకు చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశా. ముంబై, లండన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, డ్యూట్చి బ్యాంక్‌లో జాబ్ చేశా. ఆపై ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం తో చిన్నప్పటి కల సివిల్స్ వైపు అడుగులు వేశా. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్‌కు కూడా వెళ్లా. నచ్చకపోవడంతో వదిలేసి హైదరాబాద్ వచ్చేశా. సరూర్‌నగర్‌లోని మా ఇంటి పక్కనే ఓ ప్రైవేట్ లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నది లేదు. సేవంటే మహా ఇష్టం 2016లో ఫీడ్ ఇండియా ఎన్జీవో మొదలెట్టాం. హోటల్స్, క్యాంటీన్లలో ఆహారం మిగిలితే దాన్ని వృద్ధ, అనాథాశ్రమాల్లో పంచేవాళ్లం. ఇందుకోసం క్లింటన్ గ్లోబల్ ఫౌండేషన్ ఇండియా నుంచి మా ఐడియా రిప్రజెంట్ చేయడానికి మియామి వెళ్లాను. స్కూలింగ్ నుంచే ఐపీఎస్ కావాలనేది నా కల. అది నెరవేరడం సంతోషంగా ఉంది. -
‘దిశా నిర్దేశం’.. భేష్
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడుల నిరోధానికి, న్యాయసేవలపై అవగాహన కోసం ఇటీవల దిశా నిర్దేశం పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన ఆదివారం ప్రత్యేక సంచికను తెలంగాణ పోలీసు శాఖ అభినందించింది. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అకృత్యాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి? మహిళలకు అందుబాటులో ఏమేం చట్టాలు ఉన్నాయి? ఏ నేరానికి ఎంత శిక్ష పడుతుంది? గృహహింసకు గురవుతున్నవారు, ఎన్నారై భర్తల వల్ల బాధలు పడుతున్నవారికి ఎలాంటి న్యాయసేవలు అందుబాటులో ఉన్నాయి? ఎవరిని కలవాలి? తదితర సమగ్ర వివరాలను అందించిన తీరును ప్రశంసించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ సోమవారం ట్విట్టర్లో ప్రకటన విడుదల చేసింది. -
టీఎస్ పోలీస్ వెల్ఫేర్ ఇన్చార్జిగా సంతోష్‌మెహ్రా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ వెల్ఫేర్ విభాగం ఇన్‌ఛార్జి ఏడీజీగా 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏడీజీ వెల్ఫేర్‌గా ఉన్న 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సౌమ్యా మిశ్రాకు ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్లో భాగంగా సొంత రాష్ట్రం ఒడిశాకు వెళ్లేందుకు కేంద్రం (డీఓపీటీ ) ఇటీవల గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారు. దీంతో తాత్కాలికంగా వెల్ఫేర్ విభాగం బాధ్యతలను సంతోష్ మెహ్రాకు అప్పగించారు. గతంలో ఆయన తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరించారు. -
రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణ వ్యాప్తంగా 966 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రాథమిక పరీక్ష జరగనుంది. పరీక్షా సమయాల్లో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ను అమలు చేశారు. పలుచోట్ల కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 17,156 ఉద్యోగాలకు 4.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. బయోమెట్రిక్‌తో అభ్యర్థుల వేటిముద్రలు, ఫోట్రోగ్రాఫ్లు తీసుకుంటున్నారు. ముందే ప్రకటించిన విధంగా పరీక్షా కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరాణలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పలు చోట్ల అభ్యర్థులు సమయానికి రాకపోవడంతో వారి అనుమతికి అధికారులు నిరాకరించారు.