
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దాడుల నిరోధానికి, న్యాయసేవలపై అవగాహన కోసం ఇటీవల దిశా నిర్దేశం పేరుతో ‘సాక్షి’ ప్రచురించిన ఆదివారం ప్రత్యేక సంచికను తెలంగాణ పోలీసు శాఖ అభినందించింది. ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అకృత్యాలు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి? మహిళలకు అందుబాటులో ఏమేం చట్టాలు ఉన్నాయి? ఏ నేరానికి ఎంత శిక్ష పడుతుంది? గృహహింసకు గురవుతున్నవారు, ఎన్నారై భర్తల వల్ల బాధలు పడుతున్నవారికి ఎలాంటి న్యాయసేవలు అందుబాటులో ఉన్నాయి? ఎవరిని కలవాలి? తదితర సమగ్ర వివరాలను అందించిన తీరును ప్రశంసించింది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ పోలీస్ సోమవారం ట్విట్టర్‌లో ప్రకటన విడుదల చేసింది.