How 4 MLAs Caught For Cross Voting In AP MLA Quota MLC Elections - Sakshi
Sakshi News home page

తప్పటడుగు వేసి అడ్డంగా దొరికిపోయారు..

Published Sat, Mar 25 2023 1:50 PM | Last Updated on Sat, Mar 25 2023 7:07 PM

How 4 MLAs Caught For Cross Voting In AP MLA Quota MLC Elections - Sakshi

మార్చి 23, 2023. గురువారం రోజున ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు స్థానాలకు గాను ఆరు ఎమ్మెల్సీలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఒక స్థానాన్ని తెలుగుదేశం గెలిచింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. బలం లేకున్నా తెలుగుదేశం గెలవడం. ఓటుకు కోట్లు గుమ్మరించడంలో బహుశా దేశ రాజకీయాల్లోనే అత్యంత నిష్ణాతుడయిన చంద్రబాబు.. గతానుభవాలతో పాటు తగు జాగ్రత్తలు తీసుకుని నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేసినట్టు స్పష్టమయింది. 

ఓటుకు కోట్ల వెనక 40 ఇయర్స్‌
చంద్రబాబు చేసింది సిగ్గు మాలిన పని అని తెలిసినా ఎల్లో మీడియా మాత్రం భలేగా డప్పు కొట్టింది. మా బాబుకు తెలిసిన విద్యలు మరెవరికి తెలియదని, ఫార్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ కాబట్టే బలం లేకున్నా తమ అభ్యర్థిని గెలిపించుకున్నాడని ఘనకీర్తిని అందుకున్నాయి ఎల్లోమీడియా. ఇక్కడ ఒక అడుగు ముందుకేసి కప్పదాటు వేసిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపునా సానుభూతి రాగం వినిపించింది ఎల్లో మీడియా. కనీసం సంజాయిషీ అడగకుండా వేటు ఎలా వేస్తారంటూ తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. 

క్రాస్ ఓటింగ్ ఎలా కనిపెట్టవచ్చు?
నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ఎన్నికలు కొత్తేమీ కాదు. గతంలోనూ జరిగాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు లాంటి రాజకీయ బేహారులు వచ్చిన తర్వాత ఎన్నికలేవైనా ఓటుకు కోట్లు దెబ్బకు భ్రష్టు పడుతున్నాయి కాబట్టి పార్టీలు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందుకే వైఎస్సార్‌సిపి కూడా పూర్తి అవగాహనతో వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలున్నారు. అందరూ ఓటేశారు.

వైఎస్సార్‌సిపికి 151 మంది ఉన్నారు. ఎన్నిక జరిగింది 7 సీట్లకు కాగా.. పోటీలో ఉన్నది 8 మంది. కాబట్టి.. తన దగ్గర ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను 7 టీంలుగా విభజించింది. అంటే ప్రతీ ఎమ్మెల్యే తన తొలి ప్రాధాన్యతగా ఎవరిని ఎంచుకోవాలో ముందే స్పష్టంగా సూచించారు. ఉదాహారణకు వైఎస్సార్‌సిపి ఎమ్మెల్సీ అభ్యర్థులు A, B, C, D, E, F & G అనుకుందాం. ప్రతి ఎమ్మెల్యేకు కింద ఇచ్చినట్టుగా ఓటు వేయమని చెబుతారు.

అలాగే రెండో, మూడో ప్రాధాన్యతకు సంబంధించిన ఆప్షన్లు కూడా ఇస్తారు. అంటే ప్రతీ ఒక్కరికి ఒక యూనిక్‌ కాంబినేషన్‌ ఉంటుంది. ఏ ఒక్కరిది కూడా మరొకరితో కలవదు. రెండో, మూడో ప్రాధాన్యత చూడగానే కాంబినేషన్‌లో ఎక్కడ తేడా వచ్చిందో అర్థమవుతుంది. దీన్ని బట్టి క్రాస్‌ ఓటింగ్‌ చేసిన ఎమ్మెల్యేను క్షణాల్లో గుర్తించేస్తారు. ముందుగానే యునిక్‌ సీక్వెన్స్ ఇవ్వడంతో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల గుట్టు రట్టయింది. విషయం బయటపడడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ సీపీ అధిష్టానం వెంటనే సస్పెండ్ చేసింది. నమ్మక ద్రోహులను ఉపేక్షించేదిలేదని ఓ స్పష్టమైన సందేశాన్ని పంపింది. 

ఎల్లో మీడియా కక్కుర్తి రాతలు
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మొత్తం సీట్లు 58. ప్రస్తుతం అధికార పక్షం వైఎస్సార్‌సిపికి సభలో 44 మంది సభ్యులున్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం 10 స్థానాలకు పరిమితమయింది. ఇద్దరు స్వతంత్రులు కాగా, మరో ఇద్దరు పీడీఎఫ్‌. సభలో ఏ రకంగా చూసినా వైఎస్సార్‌సిపిదే శక్తిమంతమైన పార్టీ. పైగా ఎమ్మెల్సీ పదవుల కోసం వైఎస్సార్‌సిపి ఎప్పుడూ ఆరాటపడలేదు.
చదవండి: బాబు బ్రోకర్లకు టైం వచ్చింది..! బీజేపీలోని పచ్చ నేతల ప్లాన్ ఏంటి? 

తమకున్న బలానికి ఎన్ని పదవులు వస్తాయో.. అంత వరకే ఆశించారు. నియోజకవర్గాల్లో పని తీరు సరిగాలేని ఉండవల్లి శ్రీదేవి ,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలకు కూడా పార్టీ అధిష్టానం స్పష్టంగా తమ ఉద్దేశాన్ని ముందే చెప్పేసింది. మళ్లీ టికెట్‌ ఇస్తామని కూడా తప్పుడు హామీ ఇవ్వలేదు. ఇవన్నీ తెలిసినా.. నిజాలు దాచిపెట్టిన ఎల్లో మీడియా.. మా బాబు మహా గొప్పోడు, చాణక్యుడి కంటే సమర్థుడంటూ డప్పేసుకుంటోంది. 
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి డిజిటల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement