తెలంగాణకే నా సర్వీస్‌: ధాత్రిరెడ్డి | Civils 46th Ranker Dhatri Reddy Interview With Sakshi | Sakshi
Sakshi News home page

తెలంగాణకే నా సర్వీస్‌!

Published Thu, Aug 6 2020 5:04 AM | Last Updated on Thu, Aug 6 2020 8:19 AM

Civils 46th Ranker Dhatri Reddy Interview With Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి సేవలందించడమే తన తొలి ప్రాధాన్యమని, అందుకు అనుగుణంగానే నడుచుకుంటానని సివిల్స్‌ 46వ ర్యాంకర్‌ ధాత్రిరెడ్డి స్పష్టం చేశారు. 2018 సివిల్స్‌లో 233వ ర్యాంక్‌ సాధించి ఐపీఎస్‌ శిక్షణ తీసుకుంటున్న ఆమె త్వరలో ట్రైనీ ఏసీపీగా ఖమ్మంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. తాజాగా సివిల్స్‌–2019లో 46వ ర్యాంక్‌ సాధించి ఔరా అనిపించుకున్న యాదాద్రిభువనగిరి జిల్లా ముద్దుబిడ్డ ధాత్రిరెడ్డి.. ఐపీఎస్‌ అయినా, ఐఏఎస్‌ అయినా తెలంగాణకే సేవలందిస్తానని బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. 

ఈజీగానే ఇంటర్వ్యూ 
ఈ ఏడాది జూలై 10కి నేషనల్‌ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో ఫేజ్‌–వన్‌ ఐపీఎస్‌ శిక్షణ పూర్తయింది. తెలంగాణ స్టేట్‌ పోలీసు అకాడమీలో ఈ నెలాఖరుకు శిక్షణ పూర్తవుతుంది. అంతలోనే 2019 సివిల్స్‌కు ప్రిపేరై 46వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఎన్‌పీఏలో శిక్షణ సమయంలోనే 2019 సివిల్స్‌ ఇంటర్వ్యూకు ప్రిపేరయ్యా. కరెంట్‌ ఎఫైర్స్‌ కోసం రెగ్యులర్‌గా పత్రికలు ఫాలో అయ్యాను. ఇంటర్వ్యూలో పర్సనాలిటీ, హబీలు, ఇంట్రెస్ట్, ప్రీవియస్‌ వర్క్‌పై అడుగుతారని అందుకు తగ్గట్టు ప్రిపేరయ్యా. అయితే ఇంటర్వ్యూ ఈజీగానే అయిపోయింది. 

ఏదైనా ఇష్టమే.. లక్కీ ప్లేస్‌లో ఉన్నా 
సివిల్స్‌ రాయాలని ఎప్పుడైతే అనుకున్నానో.. ఐఏఎస్, ఐపీఎస్‌ ఏదొచ్చినా ఫర్వాలేదనుకున్నా. రెండు సర్వీసులూ ఇష్టమే. నిజానికి నేను చాలా లక్కీ ప్లేస్‌లో ఉన్నా. సాధారణంగా ఒకరికి ఒక్కటి రావడమే ఎక్కువ. నాకు చాయిస్‌ ఉంది. ఐపీఎస్‌ తెలంగాణ క్యాడర్‌ నాది. ఇక్కడే వర్క్‌ చేయాలని ఉంది. ఐఏఎస్‌లో కేటాయించే క్యాడర్‌ను బట్టి నిర్ణయం ఉంటుంది. ఏదేమైనా ప్రజాసేవకు మరింత చేరువవుతా. 

ఇంట్లోనే ప్రిపరేషన్‌ 
నాన్న పి.కృష్ణారెడ్డి, తల్లి పి.సుశీల, తమ్ముడు గ్రీష్మన్‌రెడ్డి ఫుల్‌ సపోర్ట్‌ ఇచ్చారు. ఫ్రెండ్స్‌ కూడా గైడ్‌ చేసేవారు. హైదరాబాద్‌లోనే ఇంట ర్‌ వరకు చదివా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశా. ముంబై, లండన్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్, డ్యూట్చి బ్యాంక్‌లో జాబ్‌ చేశా. ఆపై ఉద్యోగంలో సంతృప్తి లేకపోవడం తో చిన్నప్పటి కల సివిల్స్‌ వైపు అడుగులు వేశా. ఢిల్లీలో ఐఏఎస్‌ కోచింగ్‌కు కూడా వెళ్లా. నచ్చకపోవడంతో వదిలేసి హైదరాబాద్‌ వచ్చేశా. సరూర్‌నగర్‌లోని మా ఇంటి పక్కనే ఓ ప్రైవేట్‌ లైబ్రరీకి వెళ్లి చదువుకునేదాన్ని. ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకున్నది లేదు. 

సేవంటే మహా ఇష్టం 
2016లో ఫీడ్‌ ఇండియా ఎన్జీవో మొదలెట్టాం. హోటల్స్, క్యాంటీన్లలో ఆహారం మిగిలితే దాన్ని వృద్ధ, అనాథాశ్రమాల్లో పంచేవాళ్లం. ఇందుకోసం క్లింటన్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ ఇండియా నుంచి మా ఐడియా రిప్రజెంట్‌ చేయడానికి మియామి వెళ్లాను. స్కూలింగ్‌ నుంచే ఐపీఎస్‌ కావాలనేది నా కల. అది నెరవేరడం సంతోషంగా ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement