మరికాసేపట్లో మీడియా ముందుకు సుధాకర్‌ | Top Maoist Leader Sudhakar Will Come In Front Of Media | Sakshi
Sakshi News home page

మరికాసేపట్లో మీడియా ముందుకు సుధాకర్‌

Published Wed, Feb 13 2019 1:16 PM | Last Updated on Wed, Feb 13 2019 3:20 PM

Top Maoist Leader Sudhakar Will Come In Front Of Media - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సట్వాజీ అలియాస్‌ సుధాకర్‌ను డీజీపీ మహేందర్‌ రెడ్డి బుధవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. జార్ఖండ్ మావోయిస్టు కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న సుధాకర్‌ భార్యతో సహా రాంచీ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరికాసేపటల్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు. (చదవండి : లొంగు‘బాట’లో..)

కాగా నిర్మల్‌లోని సారంగాపూర్‌ మండలానికి చెందిన సుధాకర్‌ ఇంటర్‌లోనే రాడికల్‌ స్టూడెంట్స్‌ నాయకుల ప్రభావంతో మావోయిస్టు కొరియర్‌గా చేరారు. పలు హింసాత్మక ఘటనల్లో కీలక పాత్ర పోషించి కీలక నేతగా ఎదిగారు. 2013 నుంచి మావోయిస్టు కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ, సెంట్రల్‌ మిలటరీ సభ్యుడిగా, బిహార్‌- జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా వ్యవహరించిన సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు(జార్ఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది) కూడా ఉంది. దళంలోనే పరిచయమైన నీలిమ అలియాస్‌ మాధవిని ఆయన పెళ్లిచేసుకున్నారు. కాగా తన తమ్ముడు నారాయణ రాంచీలో పోలీసులకు పట్టుబడటం, నిర్మల్‌ జిల్లా పోలీసులు తన తల్లి ద్వారా ఒత్తిడి పెంచడం, మావోయిస్టు పార్టీలో అంతర్గత సంక్షోభం కారణంగా భార్యతో సహా ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.

ఇంటర్‌లోనే ఆకర్షితుడై..
సారంగపూర్‌ మండల కేంద్రానికి చెందిన దేవుబాయి, కాశీరాం దంపతుల పెద్ద కుమారుడు ఒగ్గు సట్వాజీ పదోతరగతి వరకు స్థానిక పాఠశాలలో చదివారు. 1981–83 మధ్య ఇంటర్మీడియెట్‌ నిర్మల్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పూర్తి చేశారు. ఇంటర్‌ చదువుతున్న రోజుల్లోనే రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌(ఆర్‌ఎస్‌యూ) నాయకులతో సంబంధాలు కొనసాగించారు. వారి మాటలు, పాటలతో పాటు విప్లవ సాహిత్యానికి ఆకర్షితుడయ్యారు. అప్పటి నుంచే ఆర్‌ఎస్‌యూ(అండర్‌గ్రౌండ్‌) కొరియర్‌గా, రాడికల్స్‌ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు. 1984లో పూర్తిస్థాయిలో అడవి బాట పట్టి పీపుల్స్‌వార్‌లో చేరి నక్సలైటుగా మారారు.

జనంలోకి వచ్చి..మళ్లీ దళంలోకి..
పీపుల్స్‌వార్‌లో చేరిన రెండేళ్లకే కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 1986లో కర్ణాటకలోని గుల్బర్గాలో సట్వాజీ పోలీసులకు చిక్కారు. 1989 చివరి వరకు జైలులోనే ఉన్నారు. మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పీపుల్స్‌వార్‌పై నిషేధం ఎత్తివేయడంతో బయటకు వచ్చారు. అప్పుడు ఇంటి వద్దే ఉంటూ నిర్మల్‌లో భారీ స్తూపం నిర్మింపజేశారు. మళ్లీ ప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధం విధించడంతో 1991నుంచి తిరిగి దళంలోకి వెళ్లారు. ఇక అప్పటి నుంచి ఆయన జనంలోకి రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని వివిధ దళాల కమాండర్‌గా, జిల్లా కమాండర్‌గా కొనసాగారు. 2001 నుంచి రాష్ట్ర కమిటీలో చేరి దండకారణ్య మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా, ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అక్కడి నుంచి కేంద్ర కమిటీకి, జార్ఖండ్‌ రాష్ట్ర ఇన్‌చార్జి బాధ్యతలకు వెళ్లారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు సింగరేణిలో జరిగిన దాదాపు అన్ని హింసాత్మక ఘటనల్లో సట్వాజీ అలియాస్‌ సుధాకర్‌ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు చెబుతుంటారు. చెన్నూరు, జైపూర్, నీల్వాయి, కోటపల్లి తదితర పోలీసు స్టేషన్‌ల పరిధిలో ఈయనపై కేసు లు ఉన్నాయి.

దళంలోనే మూడున్నర దశాబ్దాలు
సట్వాజీ దాదాపు మూడున్నర దశాబ్దాల తన జీవితాన్ని అజ్ఞాతంలోనే గడిపారు. 1998లోనే తండ్రి కాశీరాం చనిపోయినా ఇంటికి రాలేదు. తమ్ముళ్లు నారాయణ, రామన్నలు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు చెల్లెళ్లు కాల్వ పోసవ్వ, దాసరి పోసవ్వలకు పెళ్లిళ్లయ్యాయి. తల్లి దేవుబాయి ఒక్కరే సారంగపూర్‌లో ఉంటున్నారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ఆమెను నిర్మల్‌ ఎస్పీ శశిధర్‌రాజు, ఏఎస్పీ దక్షిణామూర్తి స్వయంగా ఆమె వద్దకు వెళ్లి పలకరించారు. తన అన్నను కలసి వస్తుండగా సట్వాజీ తమ్ముడు నారాయణ మరో వ్యక్తితో కలసి 2017 ఆగస్టులో రాంచీ రైల్వేస్టేషన్‌లో పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పటి నుంచి కుటుంబంపై పోలీసుల ఒత్తిడి పెరగడం, పార్టీలో అంతర్గత సంక్షోభాల కారణంగా సుధాకర్‌ రాంచీలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.

కేంద్ర కమిటీ దాకా ఎదిగి..
పీపుల్స్‌వార్‌ (మావోయిస్టు పార్టీ)లో తెలంగాణ నుంచి ఎదిగిన కీలక నేతల్లో సట్వాజీ అలియాస్‌ సుధాకర్‌ కూడా ఉన్నారు. రాష్ట్ర కమిటీ కొరియర్‌గా పని ప్రారంభించిన సట్వాజీ అంచెలంచెలుగా కేంద్ర కమిటీ సభ్యుడి దాకా ఎదిగారు. ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా, అనంతరం జిల్లా కమాండర్‌ (కార్యదర్శి)గా వ్యవహరించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జోనల్‌ కమిటీ సభ్యుడయ్యారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉంటూ దండకారణ్యంలో మిలటరీ కమిషన్‌ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ప్రస్తుతం 2013 నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కీలకంగా వ్యవహరిస్తూనే సెంట్రల్‌ మిలటరీ సభ్యుడిగా, బిహార్‌–జార్ఖండ్‌ స్పెషల్‌ ఏరియా కమిటీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement