సాక్షి, హైదరాబాద్: డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆన్‌లైన్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు, మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, విద్యాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, విమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి రిత్విక, సైబర్‌సేఫ్టీ నిపుణులు రక్షితా టాండన్ హాజరయ్యారు.
డీజీపీ మాట్లాడుతూ, టీనేజీ విద్యార్థులు, మహిళలు సైబర్ వేధింపుల బారిన పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే అప్రమత్తంగా ఉండొచ్చన్నారు. సైబ్‌హర్–3లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతోంది. జూలై 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 10 నెలలపాటు నిర్వహించబోతున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయనున్నారు. కాగా, దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడొద్దన్నారు.
వర్టికల్స్ అమలుపై డీజీపీ అభినందన
వర్టికల్ ఫంక్షనల్ అమలులో 2020 –21లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్ల అధికారులకు డీజీపీ ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు. 17 ఫంక్షనల్ వెర్టికల్స్ అమలులో తాడూర్ పోలీస్ స్టేషన్‌కు మొదటి స్థానం, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌కు రెండవ, రామగుండం పోలీస్ స్టేషన్‌కి 3వ స్థానం, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు నాలుగవ స్థానం లభించాయి. ఈ సందర్భంగా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment