Online crime
-
ఇద్దరు సైబర్ నేరస్తుల అరెస్ట్
సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వ్యక్తులకు ఆన్లైన్లో మొదట అమ్మాయిల ఫొటోలు షేర్ చేసి పరిచయం చేసుకుంటారు. అనంతరం అశ్లీల ఫొటోలు పంపించి బాధితులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ ఏసీపీ రమేశ్‌తో కలిసి సీపీ శ్వేత వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణం కీళ్లగడ్డలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆరేపల్లి అభిషేక్ (24), కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపాయపల్లి గ్రామానికి చెందిన భాషవేన అభినాష్ (21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరిరువురు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో షేర్ చాట్‌లో అమ్మాయిల ఫ్రొపైల్ ఫొటోలతో (డీపీ) ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు. తర్వాత స్పందించిన వ్యక్తుల వాట్సప్ నెంబర్‌కు న్యూడ్ వీడియోలు, అశ్లీల చిత్రాలు, ఫొటోలు పంపిస్తూ సైబర్ నేరస్థులు వారితో చాట్ చేసేవారు. అనంతరం వీరు చేసిన చాట్‌ను, అశ్లీల చిత్రాలను స్క్రీన్ షాట్ తీసి మొబైల్లో భద్రపర్చుకుంటారు. వీరు చాట్ చేసిన స్క్రీన్ షాట్లను వేరే నెంబర్ నుంచి బాధితుల వాట్సప్ నెంబర్లకు పంపిస్తూ మేము గచ్చిబౌలి నుంచి సైబర్ క్రైం ఎస్ఐని మాట్లాడుతున్నానని చెబుతూ మీ అశ్లీల చిత్రాలు, చాట్ చేసిన స్క్రీన్ షాట్స్, ఇతర వివరాలు తమ వద్ద వచ్చాయని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని బాధితులను బెదిరిస్తూ వారి నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు పంపించుకునేవారు. ఈ క్రమంలో కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్లో కొద్ది రోజుల క్రితం నమోదైన సైబర్ నేరంపై పరిశోధనలో భాగంగా సీపీ శ్వేత ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో తొగుట సీఐ కమలాకర్, బేగంపేట ఎస్ఐ అరుణ్, కానిస్టేబుళ్లు రాజు, అనిల్, రామచంద్రారెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా బాధితుడి వద్ద నుంచి ఇద్దరు వ్యక్తులు కుకునూర్‌పల్లి బస్టాండ్ వద్ద డబ్బులు తీసుకున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తొగుట సీఐ కమలాకర్, ఎస్ఐ అరుణ్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ధైర్యంగా పోలీసులకు లేదా 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. -
ఆన్లైన్ మోసాలకు ఇలా అడ్డుకట్ట వేయండి
సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మొదటి ప్లేస్‌లో ఫేస్బుక్ నిలుస్తోంది. ఫేస్‌బుక్‌ను అడ్డం పెట్టుకుని చేసే నేరాలలో అకౌంట్లను హ్యాక్ చేయడం, డబ్బును డిమాండ్ చేయడం, వివరాలను దొంగిలించడం, భావోద్వేగాలతో ఆడుకోవడం, షాపింగ్ మోసం, ఫేక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు.. వంటివెన్నో ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్. ఫొటోలు, వీడియోలు అనేక ఇతర ఇంటరాక్టివ్ అంశాలు, వ్యాపారం, సేవలను ప్రోత్సహించడానికి మాధ్యమంగా ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు. నెట్వర్క్ ద్వారా భారీ సంఖ్యలో వ్యక్తులు కనెక్ట్ అయి ఉండటంతో, స్కామర్లకు ఇది ఒక మాధ్యమంగా మారింది. దీంతో మోసగాళ్లు సోషల్ మీడియా హ్యాండిల్ నుండి లింక్‌లు, కనెక్షన్లతో స్కామ్‌లకు తెరలేపుతున్నారు. స్కామ్‌లు... ఫేస్బుక్ హ్యాకింగ్, నకిలీ ప్రొఫైల్ వంటి ఈ మోసాల జాబితాలో మొదట బాధితుడి ప్రొఫైల్‌ను హైజాక్ చేసి, ఆపై వివిధ కారణాలతో వేర్వేరు వ్యక్తులను సంప్రదించి, డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ప్రొఫైల్ యజమాని ఈ విషయాన్ని తెలుసుకొని, ఈ వార్తను అందరికీ తెలియజేసే వరకు అతని ప్రొఫైల్ హైజాక్ అయ్యిందని తెలియదు. దీంతో ఫేస్బుక్ ఖాతాకు చెందిన తమ స్నేహితుడి నుండి రిక్వెస్ట్ వచ్చిందని మిగతావారు నమ్ముతారు. ఇది ఫేస్బుక్ చీటింగ్ స్కామ్‌కు సంబంధించిన కేసు అని ఆలస్యంగా తెలుసుకుంటారు. యాక్సెస్ సులువు... సైబర్ నేరగాళ్లు బాధితురాలి/బాధితుడి ఫేస్బుక్ ఖాతాను హ్యాక్ చేసి వారి వ్యక్తిగత వివరాలన్నింటికి యాక్సెస్ పొందుతారు. స్కామర్ బాధితుడి ఫేస్బుక్ ఖాతాను లక్ష్యంగా చేసుకుని హ్యాక్ చేస్తాడు. తర్వాత స్నేహితుల జాబితాలోని వారిని సంప్రదిస్తాడు. స్కామర్ సాధారణంగా డబ్బు అడగడానికి ప్రయత్నిస్తాడు ∙నిధుల బదిలీ, యాక్సెస్ కోడ్, వ్యక్తిగత మొబైల్ నంబర్లు, ఇతర వివరాల కోసం ఒక స్కామర్ ద్వారా ఫేస్బుక్ ప్రొఫైల్ యజమాని స్నేహితులు సంప్రదించినట్లు అనేక కేసులు ఇప్పటికే సైబర్‌క్రైమ్‌లో ఫైల్ అయి ఉన్నాయి. వీటిలో... శృంగారపరమైన మోసాలు... అంత్యంత పెద్ద స్కామ్‌లలో ఇది ఒకటి. ఫేస్బుక్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రేమికులుగా నటిస్తారు. స్కామర్లు వారి బాధాకరమైన జీవనం గురించి, భాగస్వామి నుంచి విడిపోయినట్లు నటిస్తారు లేదా మిమ్మల్ని ఆకర్షించడానికి ముఖస్తుతిని ఉపయోగిస్తారు. ఒక శృంగారపరమైన వీడియో సంభాషణ మీ భావోద్వేగాలతో ఆడుకోవడానికి, మీ నమ్మకాన్ని పొందేందుకు రూపొందించి ఉంటుంది. వారాలు, నెలల వ్యవధిలో మెసెంజర్చాట్లను పెంచుతూ ఉంటారు. చివరికి ఏదో సమస్య చెప్పి డబ్బు పంపమని అడుగుతారు. ఆన్లైన్లో క్యాట్‌ఫిషింగ్ కోసం ఇది అత్యంత ప్రజాదరణ పొందిన అంశాలలో ఒకటి. షాపింగ్ మోసాలు... ఫేస్బుక్ ద్వారా స్కామర్లు నకిలీ వస్తువులను అంటగట్టడానికి నకిలీ బ్రాండ్ ఖాతాలను సృష్టిస్తారు. రకరకాల ఆఫర్లతో ఎన్నడూ వినని షాప్ పేర్లను సృష్టిస్తారు. ప్రకటనలను పుష్ చేస్తారు. చౌక ధరలకు వస్తువులను అందిస్తామంటారు కానీ దేనినీ పంపరు. బదులుగా, మీ డబ్బు తీసుకొని అదృశ్యమవుతారు. నకిలీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు... ఫేస్బుక్లో ఉన్న ఎవరైనా ఈ స్కామ్‌ను ఎదుర్కొనే ఉంటారు. ఒక వ్యక్తిని ఫాలో అవడానికి మొత్తం ఫేస్బుక్ ఖాతాలను చేరుకోవడానికి స్కామర్లకు ఇది ఇష్టమైన వ్యూహం. మీరు ఒక ఫేక్ అభ్యర్థనను అంగీకరించినప్పుడు, మీరు మీ అకౌంట్ లాక్ చేసినా మీరు స్కామర్‌కి అంతర్గత యాక్సెస్‌ను అందించినట్టే. మీ డిజిటిల్ డివైజ్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసే మోసపూరితమైన లింక్ వంటి ఇతర స్కామ్‌ల బారినపడేలా మీ నమ్మకాన్ని ఉపయోగించుకుంటారు. నకిలీ ఛారిటీ స్కామ్‌లు... విపత్తు సంభవించినప్పుడు, సహాయం చేయాలనుకోవడం మానవ స్వభావం. చాలా మందికి, దీని అర్థం డబ్బును విరాళంగా ఇవ్వడం. మోసగాళ్లకు ఇది తెలుసు. వెంటనే డబ్బు చెల్లించేలా సంక్షోభాలను ఉపయోగిస్తారు. నకిలీ ఛారిటీ పేజీలు, వెబ్సైట్లు, గో ఫండ్ మి వంటి ప్రసిద్ధ సైట్లలో ఖాతాలను కూడా సృష్టించి, ఆపై మీ ఫేస్బుక్ ఫీడ్‌లో వారి ‘ధార్మిక సంస్థలను’ ప్రచారం చేస్తారు. ఫోన్ యాప్‌ల ద్వారా డబ్బు చెల్లించమని అడుగుతారు. మీరు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఇచ్చే ముందు రీసెర్చ్ చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఛారిటీ నావిగేటర్, గైడ్‌స్టార్, ఛారిటీ వాచ్‌తో సహా ఈ ప్రయోజనం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన సైట్లను చెక్ చేయండి. హ్యాక్ అయిన సమాచారాన్ని రిపోర్ట్ చేయాలంటే.. https://www.facebook.com/hacked నకిలీ సమాచారం గురించి రిపోర్ట్‌కు... https://www.facebook.com/help/572838089565953 helpref=search&sr=2&query=reporting%20false%20claims&search_session_id=f886d969d0ffdf65b717d0567986859f మోసానికి సంబంధించిన సమాచారాన్ని .. httpr://www.facebook.com/he p/174210519303259?rdrhc రిపోర్ట్ చేయడం మంచిది. ఫేస్బుక్ మోసాలకు అడ్డుకట్ట మీ భద్రతను కాపాడుకోవడానికి ఫేస్బుక్లో మీరు చేయగలిగేవి... మీ ఫేస్బుక్ గోప్యతా సెట్టింగ్‌లను లాక్ చేయండి రెండుకారకాల ఫోన్‌నెంబర్ ప్రమాణీకరణను ప్రారంభించండి మీకు తెలియని వారి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను తిరస్కరించండి వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు కోసం అడిగే సందేశాలను పట్టించుకోవద్దు మీకు పంపిన అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు మీ లాగిన్ చరిత్రను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి ∙ బలమైన పాస్‌వర్డ్‌ని ఉపయోగించండి ధ్రువీకరించబడిన బ్రాండ్ ఖాతాల నుండి మాత్రమే షాపింగ్ చేయండి మీ పేరు మీద ఉన్న ఖాతాల కోసం క్రమం తప్పకుండా శోధించండి మీ ఫేస్బుక్ పేజ్ బయట... మీ పరికరం ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్డేట్ చేయండి అన్ని అనుమానాస్పద ఇ–మెయిల్లను తొలగించండి మీ అన్ని డిజిటల్ పరికరాల్లో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేయండి ఎరుకతో వ్యవహరించండి. మీరు ఫేస్బుక్ స్కామ్‌కు గురైనట్లయితే ... స్కామ్ గురించి ఫేస్‌బుక్‌కి నివేదించండి పాస్వర్డ్ మార్చుకోండి మీ బ్యాంక్ అకౌంట్లను ఎప్పుడూ తనిఖీ చేస్తూ ఉండండి మీ ఆన్లైన్ చెల్లింపులను ఆపేయండి మీ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఎవరైనా దొంగతనం చేశారా గమనించండి ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
అవగాహనతోనే ఆన్లైన్ వేధింపులకు చెక్: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: డేటా వినియోగం పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ నేరాల బారిన పడకుండా విద్యార్థులు, మహిళలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైబర్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిషనర్ దేవసేన, విద్యాశాఖ కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, విమెన్ సేఫ్టీ వింగ్ ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి, యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి రిత్విక, సైబర్‌సేఫ్టీ నిపుణులు రక్షితా టాండన్ హాజరయ్యారు. డీజీపీ మాట్లాడుతూ, టీనేజీ విద్యార్థులు, మహిళలు సైబర్ వేధింపుల బారిన పడే ప్రమాదాలు అధికంగా ఉన్నాయని, ఇలాంటి వాటిపై అవగాహన ఉంటే అప్రమత్తంగా ఉండొచ్చన్నారు. సైబ్హర్–3లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతోంది. జూలై 1 నుంచి ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా 10 నెలలపాటు నిర్వహించబోతున్నారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేయనున్నారు. కాగా, దేశంలో తెలంగాణ పోలీసులకు ఉన్న గౌరవం, కీర్తి మరింత పెంచే విధంగా పోలీస్ అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. మంగళవారం పోలీస్ ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడొద్దన్నారు. వర్టికల్స్ అమలుపై డీజీపీ అభినందన వర్టికల్ ఫంక్షనల్ అమలులో 2020 –21లో ఉత్తమ ఫలితాలు సాధించిన 223 పోలీస్ స్టేషన్ల అధికారులకు డీజీపీ ప్రత్యేక పురస్కారాలు ప్రకటించారు. 17 ఫంక్షనల్ వెర్టికల్స్ అమలులో తాడూర్ పోలీస్ స్టేషన్‌కు మొదటి స్థానం, కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌కు రెండవ, రామగుండం పోలీస్ స్టేషన్‌కి 3వ స్థానం, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు నాలుగవ స్థానం లభించాయి. ఈ సందర్భంగా సంబంధిత ఎస్హెచ్ఓలకు సర్టిఫికెట్ల ప్రదానం చేశారు. అనంతరం ఇన్వెస్టిగేషన్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ 2.0 అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఆన్లైన్ మోసం.. నైజీరియన్ అరెస్ట్
అనంతపురం సెంట్రల్: ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న డెస్మండ్ ఓఈబో అనే నైజీరియా దేశస్తుడిని రాప్తాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రా ప్తాడు మండల పరిధిలోని రేణుకా గేటెడ్ కమ్యూనిటీ టౌన్ షిప్లో కవిత, మారుతి దంపతులు నివసిస్తున్నారు. భర్త మారుతి అనంతపురంలో చికెన్ వ్యాపారం చేస్తుండగా భార్య కవిత ఇంట్లోనే చీరల వ్యాపారం చేస్తోంది. ఇద్దరికీ వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. అప్పుల నుంచి గట్టెక్కాలని వారు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ క్రమంలో ఆన్లైన్లో కిడ్నీ ఇస్తే రూ.కోటి ఇస్తామని నమ్మబలుకుతూ డాక్టర్ అమర్ పేరున ఒక ప్రకటన కనిపించింది. దీంతో వారు అందులో ఇచ్చిన 80507 73651 నెంబర్‌కు ఫోన్ చేశారు. ఆ వ్యక్తి సూచన మేరకు రూ.11 వేలు చెల్లించి రిజష్టర్ చేసుకున్నారు. కిడ్నీ మార్పిడి చేయాలంటే కొన్ని నిబంధనలు, షరతులు ఉంటాయ ని, రకరకాల సర్టిఫికెట్లు అవసరమవు తాయని ఆ వ్యక్తి చెప్పి నమ్మించడంతో వారు దశలవారీగా రూ.37, 62,900 ఆన్లైన్లోనే చెల్లించారు. చివరకు అనుమానం వచ్చి అతడిని గట్టిగా అడగడంతో కిడ్నీ ఇవ్వకనే రూ.కోటి ఓ వ్యక్తి ద్వారా పంపుతామని చెప్పారు. ఆ మేరకు ఇటీవల ఒకతను కవిత ఇంటికి వచ్చి తాను డెస్మండ్ ఓఈబోనని, తన వద్దనున్న సూట్‌కేసులో కోటి రూపాయల మేర రూ.2వేల నల్లనోట్లు ఉన్నాయని చెప్పి ఇచ్చాడు. కెమికల్ వాడితే ఆ నల్లనోట్లు అసలైన రూ.2వేల నోట్లుగా మారతాయని చెప్పి తన జిమ్మిక్కుతో ఓ మూడు నోట్లను అలా మార్చి నట్లు చూపి నమ్మించాడు. ఈ కెమికల్ బాటిల్ కావాలంటే రూ.15.50 లక్షలు అవుతుందన్నాడు. దీంతో వారు బెంగళూరుకెళ్లి అతని చేతికి రూ.11.50 లక్షలు అందజేసి ఆ బాటిల్ తెచ్చుకున్నారు. ఇంటికొచ్చే లోపు అది పగిలిపోయింది. మరో కెమికల్ బాటిల్ కావాలంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని అతను డిమాండ్ చేశాడు. వీళ్లు అంగీకరించడంతో సెప్టెంబర్ 23న తానే స్వయంగా కెమికల్ బాటిల్ తీసుకొస్తానని నమ్మించాడు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ నల్లనోట్లను బాగా పరిశీలించి అవి కేవలం నల్ల కాగి తాలేనని, తాము మోసపోయామని తెలు సుకున్నారు. ఈనెల 17న రాప్తాడు పోలీ సులను ఆశ్రయించారు. చెప్పినట్లే వచ్చిన నైజీరియన్వాసిని ఇటుకలపల్లి ఇన్చార్జ్ సీఐ కృష్ణమోహన్, ఎస్ఐ ధరణీబాబు తదితరులు రేణుకా గేటెడ్ టౌన్షిప్ వద్ద అరెస్ట్ చేశారు. విచారించగా డాక్టర్ అమర్పేరున ఇచ్చిన ప్రకటన తనదేనని అంగీకరించాడు. నైజీరియాకు చెందిన తాను 2014 నవంబర్ 11న స్టూడెంట్ వీసా కింద ఏడాది అనుమతితో బెంగుళూరుకు వచ్చానని చెప్పాడు. అయితే వీసా గడువు ముగిసినా అనధికారికంగా బెంగూళురులోనే ఉంటూ ఆన్లైన్ మోసాలకు పాల్పడాలని పథకం రచించినట్లు అంగీకరించాడు. అందులో భాగంగా కవిత, మారుతిలను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
సైబర్ క్రైమ్‌తో జర భద్రం..
అహ్మదాబాద్: భారత్‌లో ఆన్లైన్ క్రైమ్ పెరిగిపోతోంది. గతేడాది భారత్‌లో 11.3 కోట్ల మంది సైబర్ క్రైమ్ బారినపడగా, వారు సగటున రూ.16,558లను కోల్పోయారు. గ్లోబల్ యావరేజ్ రూ.23,878గా ఉంది. నోర్టాన్ బై సిమంటెక్ సైబర్ సెక్యూరిటీ నివేదిక ప్రకారం.. 54 శాతం మంది భారతీయులు వారి వాలెట్ల ద్వారా కన్నా ఆన్లైన్లో క్రెడిట్ కార్డుల సమాచారాన్ని దొంగలించడం ద్వారానే సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని భావిస్తున్నారు. ప్రతి ముగ్గురులో ఇద్దరు (66 శాతం మంది) వినియోగదారులు పబ్లిక్ రెస్ట్రూమ్ను ఉపయోగించడం కన్నా పబ్లిక్ వై-ఫైను ఉపయోగించడం ప్రమాదకరమని భావిస్తున్నారు. కారును ఒక రోజు ఇతరులకు ఇవ్వడం కన్నా స్నేహితులతో ఈ-మెయిల్ పాస్‌వర్డ్‌ను షేరు చేసుకోవడం చాలా ప్రమాదకరమని 80 శాతం మంది విశ్వసిస్తున్నారు. క్రెడిట్ కార్డు, బ్యాంకింగ్ సమాచారాన్ని క్లౌడ్‌లో స్టోర్ చేసుకోవడం.. కారులో సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం కన్నా ప్రమాదమని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. గతేడాది భారతీయ ఆన్లైన్ యూజర్లలో 48 శాతం మంది (11.3 కోట్ల మంది) సైబర్ క్రైమ్‌ను ఎదుర్కొన్నారు. -
ఫోను వచ్చిందా... సొత్తు గోవిందా!
బొబ్బిలి రూరల్: ‘బ్యాంక్ సే బాత్ కర్ రహాహూ... ఆప్కా ఆధార్ లింక్ బ్యాంకు ఖాతాసే యహాతక్ నహీ కియా.... ఆధార్ నంబర్ బతాయియే..’ అంటూ కాల్ వచ్చిందా మీ సొత్తుకు ఎవరో టెండర్ పెడుతున్నట్టేనని పోలీసులు చెబుతున్నారు. ‘ఆప్కా ఏటీఎంకా సోలహ్ ఆంక్ బతాయియే..’(మీ ఏటీఎంపై ఉన్న 16అంకెలు చెప్పండి..) అంటూ తరువాత పిన్ నంబర్ మారుతుంది. మీకు మూడు మెసేజ్‌లు వస్తాయని ఫోన్లో చెబితే అది కచ్చితంగా మోసమేనని, అలాంటి ఫోన్సకాల్స్కు వీలైనంత దూరంగా ఉండాలని, అవగాహనతో మెలగాలని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఆన్లైన్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి ఒక్కరి వద్దా ఏటీఎం ఉండడంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏటీఎం నంబర్లు తెలుసుకుని దుండగులు ఖాతాదారులకు టోకరా వేస్తున్నారు. ఇటీవల ఓ ఇద్దరు ఇలా మోసపోయారు కూడా. వారి ఏటీఎంల నుంచి 5వేల రూపాయలు, ఒకరి ఏటీఎం నుంచి కొద్దిమొత్తం పోయినట్లు సమాచారం. సైబర్ నేరగాళ్లు బ్యాంకు ఏటీఎంల నుంచి మన ఏటీఎం నంబర్, పిన్ నంబర్ మనతోనే చెప్పించి మోసం చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్‌తో మన ఏటీఎం ఖాతాలో డబ్బులు కొట్టేస్తున్నారు. మన ఏటీఎం కార్డు, పిన్‌నెంబర్ ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బందితో పాటు పోలీసులు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైనా ఆధార్, ఏటీఎం నెంబర్లు అడిగితే ఒకటికి పదిమార్లు కన్ఫర్మ్ చేసుకుని వివరాలు వెల్లడిస్తే మోసపోకుండా ఉండవచ్చని చెబుతున్నారు.