మాట్లాడుతున్న సీపీ శ్వేత, ఏసీపీ రమేశ్, తొగుట సీఐ కమలాకర్, ఎస్‌ఐ అరుణ్
సిద్దిపేటకమాన్: గుర్తు తెలియని వ్యక్తులకు ఆన్‌లైన్‌లో మొదట అమ్మాయిల ఫొటోలు షేర్ చేసి పరిచయం చేసుకుంటారు. అనంతరం అశ్లీల ఫొటోలు పంపించి బాధితులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గజ్వేల్ ఏసీపీ రమేశ్‌తో కలిసి సీపీ శ్వేత వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణం కీళ్లగడ్డలో నివాసం ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆరేపల్లి అభిషేక్ (24), కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపాయపల్లి గ్రామానికి చెందిన భాషవేన అభినాష్ (21) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
వీరిరువురు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో షేర్ చాట్‌లో అమ్మాయిల ఫ్రొపైల్ ఫొటోలతో (డీపీ) ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకునేవారు. తర్వాత స్పందించిన వ్యక్తుల వాట్సప్ నెంబర్‌కు న్యూడ్ వీడియోలు, అశ్లీల చిత్రాలు, ఫొటోలు పంపిస్తూ సైబర్ నేరస్థులు వారితో చాట్ చేసేవారు. అనంతరం వీరు చేసిన చాట్‌ను, అశ్లీల చిత్రాలను స్క్రీన్ షాట్ తీసి మొబైల్‌లో భద్రపర్చుకుంటారు. వీరు చాట్ చేసిన స్క్రీన్ షాట్లను వేరే నెంబర్ నుంచి బాధితుల వాట్సప్ నెంబర్లకు పంపిస్తూ మేము గచ్చిబౌలి నుంచి సైబర్ క్రైం ఎస్‌ఐని మాట్లాడుతున్నానని చెబుతూ మీ అశ్లీల చిత్రాలు, చాట్ చేసిన స్క్రీన్ షాట్స్, ఇతర వివరాలు తమ వద్ద వచ్చాయని, దీనిపై తమకు ఫిర్యాదు అందిందని బాధితులను బెదిరిస్తూ వారి నుంచి రూ.10వేల నుంచి రూ.20వేల వరకు వారు సూచించిన బ్యాంకు ఖాతాకు పంపించుకునేవారు.
ఈ క్రమంలో కమిషనరేట్ పరిధిలోని బేగంపేట పోలీస్ స్టేషన్‌లో కొద్ది రోజుల క్రితం నమోదైన సైబర్ నేరంపై పరిశోధనలో భాగంగా సీపీ శ్వేత ఆదేశానుసారం గజ్వేల్ ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో తొగుట సీఐ కమలాకర్, బేగంపేట ఎస్‌ఐ అరుణ్, కానిస్టేబుళ్లు రాజు, అనిల్, రామచంద్రారెడ్డిలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. విచారణలో భాగంగా బాధితుడి వద్ద నుంచి ఇద్దరు వ్యక్తులు కుకునూర్‌పల్లి బస్టాండ్ వద్ద డబ్బులు తీసుకున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు తొగుట సీఐ కమలాకర్, ఎస్‌ఐ అరుణ్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో వారు చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే ధైర్యంగా పోలీసులకు లేదా 1930కు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment