సాక్షి, హైదరాబాద్: రండి.. రండి.. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా?. ఇదిగోండి కాగితం.. పెన్ను.. అంటూ ఫిర్యాదు స్వీకరిస్తారు. అంతేనా.. అధికారులు, సందర్శకులు, మీడియా వేర్వేరుగా పార్కింగ్... విభాగాల వారీగా ప్రత్యేక గదులు... మహిళా సిబ్బంది కోసం రెస్ట్ రూమ్... అటాచ్డ్ బాత్‌రూమ్స్.. సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు.. భోజనం చేయడానికి వసతులు.. ఇలా ఎన్నో.. ఇదీ రాయదుర్గం పోలీసుస్టేషన్ ప్రత్యేకత. ఠాణాల ఆకస్మిక తనిఖీలో భాగంగా డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఈ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి హంగులు, పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూసి మంత్రముగ్ధులెన ఆయన ఠాణాకు రూ.లక్ష రివార్డు ప్రకటించారు. రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్ల అధికారులకు ఆ పోలీసుస్టేషన్ ఓ రోల్‌మోడల్‌గా ప్రకటించారు. అంతా అక్కడ వచ్చి, చూసి, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ కితాబిచ్చారు.
ఏంటీ ప్రత్యేకత...
నానక్‌రామ్‌గూడ చౌరస్తాకు సమీపంలో జీ+వన్ గా నిర్మితమైన ఠాణాలో అడుగుపెడుతూనే ఆహ్లాదకర వాతావరణం. ఇన్ స్పెక్టర్, సబ్–ఇన్ స్పెక్టర్ల చాంబర్స్‌తో సహా పోలీసుస్టేషన్ పరిపాలన విభాగం మొత్తం కింది అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో టెక్ టీమ్, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, వారంట్ స్టాఫ్, సమ¯Œ స్టాఫ్, క్రైమ్ రైటర్, కేస్ ప్రాపర్టీలకు ప్రత్యేకించి రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్‌రూమ్స్, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు, భోజనం చేయడానికి వసతులు ఈ ఠాణా ప్రత్యేకతలు. అక్కడ, ఇస్పెక్టర్ చాంబర్‌కు సమీపంలో ప్రతి ఒక్క అధికారికీ ప్రత్యేకంగా కూర్చునే స్థలం, పరిపాలన పరమైన ఫైళ్ల కోసం భద్రమైన ఏర్పాట్లు ఉన్నాయి. సిబ్బంది కోసం మినీ వర్క్ స్టేషన్, మహిళల కోసం వేరుగా వెయిటింగ్ రూమ్, ఇంటర్వ్యూ రూమ్, సబ్–ఇన్స్పెక్టర్లకు విశ్రాంతి గదులు ఈ పోలీసుస్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి. రాయదుర్గం పోలీసుస్టేషన్ టెర్రస్ పైన అధికారులు, సిబ్బంది కోసం ఉద్దేశించిన జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటితో పాటు రిలాక్స్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది.
ఈ స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు వెనుక సమిష్టి కృషి ఉంది. ప్రజా మిత్ర పోలీసింగ్ విధానాలు అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మన్ననలు పొందేలా, వాళ్లు చట్టాలను తప్పనిసరిగా పాటించేలా చేయడంలో సఫలీకృతం కావాలి. ఇది జరగాలంటే ఠాణాలోని అన్ని స్థాయి పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి.
– ఎస్.రవీందర్, ఇన్న్స్పెక్టర్
రండి.. రండి..
సాయం కోరుతూ వచ్చిన వారిని అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ‘హావ్ ఏ పేపర్’విధానం అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి బాధితుడికీ వారే అడిగి మరీ కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలోనూ అవసరమైన పూర్తి సహకారం అందిస్తారు. అలాగే ఠాణా మొదటి అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన బ్యారెక్స్, డైనింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడే ఈ ఠాణాకు సంబంధించిన క్లోజ్డ్ ఫైల్స్ రూమ్ ఏర్పాటు చేశారు. కోర్టులు కోరినప్పుడు, ఉన్నతాధికారులు అడిగినప్పుడు వీటిని పక్కాగా తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏ కేసుకు సంబంధించిన ఫైల్ అయినా కేవలం 30 సెకండ్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను సైతం అందుబాటులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment