Rayadurgam police station
-
ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ బాషాపై కేసు నమోదు
-
ప్రాణం తీసిన వీడియో కాల్
సాక్షి, హైదరాబాద్: సెల్ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ రెండో అంతస్తు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలోని మణికొండలో చోటుచేసుకుంది. మణికొండలో నివసించే తాళ్లూరి శ్యామ్యూల్ సుజిత్ (32) ప్రైవేటు ఉద్యోగి. శనివారం ఉదయం తన సోదరుడితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. రెండో అంతస్తులోని బాల్కనీలో మాట్లాడుతూ ప్రమాదవశాత్తు సుజిత్ జారిపడ్డాడు. వెంటనే స్పందించిన పక్కింటివారు సుజిత్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన సుజిత్‌ను కుటుంబసభ్యులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు సుశీల్ బాగ్యరాజ్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
బాధితురాలుతో అసభ్య ప్రవర్తన, బెదిరింపులు
సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెట్టి మొహం చాటేశారు. డబ్బులు ఇస్తామని నమ్మించి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా నడికుడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆర్.రంగమ్మ కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో హస్పిటల్లో టెక్నీషియన్‌గా పని చేసేది. హస్పిటల్‌కు వచ్చే నర్సింహ్మరావు పరిచయం అయ్యాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇస్తారని చెప్పి జంగిపురం వనపర్తి జిల్లాకు చెందిన ఆవుల రాజేష్‌ను పరిచయం చేశారు. పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇవ్వడంతో పాటు ష్యూరిటీ కింద వనపర్తిలో 7 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికారు. 2019 మార్చి ఏప్రిల్, మే నెలలో రాజేష్‌కు రూ.55 లక్షలు, అతని స్నేహితుడైన సింహచలంకు రూ.15 లక్షలు రాయదుర్గంలోని టింబర్లేక్ కాలనీలో గల వైట్ వాటర్ అపార్ట్మెంట్లో ఇచ్చింది. నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వకపోవడంతో వనపర్తికి వెళ్లి నిలదీయడంతో గత ఫిబ్రవరిలో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి రూ.35 లక్షల చెక్, మధ్యవర్తిగా ఉన్న ఎన్ఎంవీ రావు రూ.35 లక్షల చెక్‌లు ఇచ్చారు. రాజేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆగస్టు 23న రంగమ్మ, ఆమె భర్త రామరావు వనపర్తిలో రాజేష్ ఇంటికి వెళ్లారు. డబ్బు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఇంటి ముందు కూర్చున్నారు. బాకీ తీసుకున్న డబ్బులు ఇవ్వట్లేదని వనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మాట్లాడుకుందామని చెప్పి కారులో శంషాబాద్‌లోని ఓ లాడ్జ్ తీసుకెళ్లగా అక్కడే రెండు రోజుల పాటు అక్కడే ఉన్నట్లు బాదితురాలు ఫిర్యాదులో పేర్కొంది. డబ్బులు ఇవ్వకపోగా రాజేష్‌తో పాటు సింహచలం వరప్రసాద్, జలవడి సోమశేఖర్, నక్కల రవిందర్‌యాదవ్, ఎం.వీ.రాజు, పవన్‌రెడ్డి, ప్రమోద్ లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి చంపేస్తామని బెదిరించినట్లు రంగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 29న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 420, 506,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. డబ్బులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇచ్చానని బాధితురాలు చెప్పడంతో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం లీగల్ ఒపినీయన్, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు. -
హెల్మెట్ ఉంటే ప్రాణం దక్కేది!
సాక్షి, గచ్చిబౌలి: హెల్మెట్ విలువ ఓ ప్రాణంతో సమానం. అది ధరించకుండా బండి నడిపి ప్రమాదానికి గురైతే నిండు ప్రాణాలు గాలిలో కలుస్తానేందుకు ఈ దుర్ఘటనే ఉదాహరణ. అందుకే హెల్మెట్ ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరముందని తేల్లతెల్లం చేస్తోందీ ఘటన. ఆగి ఉన్న స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడమే అతడి పాలిట శాపంలా పరిణమించింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు శిబ్పూర్నకు చెందిన ప్రతీక్ మోహన్ రాతి (30) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. భార్య మేఘన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐలో ఉద్యోగం చేస్తున్నారు. నానక్‌రాంగూడలో వీరు నివాసం ఉంటున్నారు. కాగా.. ప్రతీక్ మోహన్ సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు యాంకరింగ్ సైతం చేస్తుంటాడు. శుక్రవారం మాదాపూర్‌లోని ఓ పాఠశాల వార్షిక దినోత్సవంలో యాంకరింగ్ చేసి ద్విచక్ర వాహనంపై నానక్‌రాంగూడకు బయలుదేరాడు. సాయంత్రం 6.30 గంటలకు ఓఆర్ఆర్పై నానక్‌రాంగూడ జంక్షన్‌కు ముందు ఆగి ఉన్న యాంగ్లిస్ట్ హైస్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రతీక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ వెనకాలే బైక్‌పై వస్తున్న మరో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రఫీక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. ప్రతీక్ మోహన్ తల వెనక భాగంలో బలమైన గాయమైందని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల క్రితమే మ్యారేజ్ డే సంబరాలు.. ప్రతీక్ మోహన్, మేఘనలకు గత ఏడాది జనవరిలో వివాహమైంది. నాలుగు రోజుల క్రితమే పెళ్లి రోజు జరుపుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందడంతో మేఘన రోదనలు మిన్నంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు ప్రతీక్ మృతదేహన్ని అప్పగించారు. -
లిఫ్ట్ కిందపడి బాలుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్ నెంబర్ 10, టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ ధనుష్ అనే ఓ బాలుడు ఆడుకుంటూ లిఫ్ట్ కిందపడి చనిపోయాడు. ఈ సంఘటన బాలుడి కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. కాగా ధనుష్ కుటుంబం రెండు నెలల క్రితమే ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. -
సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది
గచ్చిబౌలి: కొత్తగా ప్రారంభించిన ఫ్లైఓవర్‌పై సెల్ఫీ తీసుకోవాలన్న సరదా కోరిక ఆ యువకులిద్దరి నిండు ప్రాణాల్ని బలిగొంది. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెల్ఫీ దిగుతోన్న యువకులిద్దరినీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. రాయదుర్గం పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సరూర్‌నగర్ భగత్‌సింగ్‌నగర్‌లో నివాసం ఉంటూ వొడాఫోన్ సిమ్ కార్డుల సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోన్న వరంగల్ జిల్లా చేర్యాల్‌కు చెందిన పి.సాయి వంశీ రాజు(22), సరూర్నగర్లోనే సోదరుని వద్ద నివాసం ఉంటూ పెళ్లిళ్లకు ఫొటో ఈవెంట్లు చేస్తోన్న నారాయణ్ పేట్ జిల్లా కిష్టాపూర్‌కు చెందిన ఎన్.ప్రవీణ్(22) స్నేహితులు. వీరిద్దరూ శనివారం సాయంత్రం గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాం తాలను చూసేందుకు యాక్టివాపై సరూర్‌నగర్ నుంచి బయల్దేరి వెళా ్లరు. బయోడైవర్సిటీ జంక్షన్లో ఇటీవలే ప్రారంభమైన ఫ్లైఓవర్ పైకి ఎక్కి రాయదుర్గం వైపు వెళ్లారు. జంక్షన్లో ఫ్లైఓవర్‌పై ఉన్న మూల మలుపు వద్ద స్కూటీని పార్క్ చేసి సెల్ఫీ దిగుతున్నారు. అదేసమయంలో కూకట్పల్లి వైపు వెళ్తున్న ఐ20 కారు(టీఎస్08 ఎఫ్వై1069) వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో ఫ్లైఓవర్‌పై నుంచి ఎగిరి కింది రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కాగ్నిజెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసే కూకట్‌పల్లినివాసి అభిలాష్ డ్రైవింగ్ చేస్తుండగా... కారులో అతని స్నేహితులు అనిల్, చంద్రకాంత్, సూర్య ఉన్నారు. వీరందరూ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి ముందే ఫ్లైఓవర్‌పై టైరు పంక్చర్ కావడంతో ఓ ద్విచక్రవాహనాన్ని తోసుకుంటూ వెళ్తోన్న పాడాల మురళి కృష్ణ(30), గిరిధర్ సుభాష్(26)లను, తర్వాత హీరోహోండాపై వెళ్తోన్న చుంచు సాయి కృష్ణ(21), చుంచు పవన్ కుమార్(19)లను ఢీకొట్టగా వీరంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్‌పై ఉన్న మూలమలుపు ఎక్కువగా ఉండటం, మద్యం మత్తులో కారు నడపడం ప్రమాదానికి కారణాలుగా తెలుస్తోంది. అభిలాష్‌ను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరి గిన వెంటనే కారులో ఉన్న అభిలాష్ స్నేహితులు అనిల్,చంద్రకాంత్, సూర్య ఘటనా స్థలి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. -
ఐటీ జోన్ లో మేటి ఠాణా
సాక్షి, హైదరాబాద్: రండి.. రండి.. ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చారా?. ఇదిగోండి కాగితం.. పెన్ను.. అంటూ ఫిర్యాదు స్వీకరిస్తారు. అంతేనా.. అధికారులు, సందర్శకులు, మీడియా వేర్వేరుగా పార్కింగ్... విభాగాల వారీగా ప్రత్యేక గదులు... మహిళా సిబ్బంది కోసం రెస్ట్ రూమ్... అటాచ్డ్ బాత్రూమ్స్.. సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు.. భోజనం చేయడానికి వసతులు.. ఇలా ఎన్నో.. ఇదీ రాయదుర్గం పోలీసుస్టేషన్ ప్రత్యేకత. ఠాణాల ఆకస్మిక తనిఖీలో భాగంగా డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి శుక్రవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని ఈ స్టేషన్ ను సందర్శించారు. అక్కడి హంగులు, పోలీసులు నిర్వర్తిస్తున్న విధులు చూసి మంత్రముగ్ధులెన ఆయన ఠాణాకు రూ.లక్ష రివార్డు ప్రకటించారు. రాజధానిలో ఉన్న మూడు కమిషనరేట్ల అధికారులకు ఆ పోలీసుస్టేషన్ ఓ రోల్‌మోడల్‌గా ప్రకటించారు. అంతా అక్కడ వచ్చి, చూసి, నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయంటూ కితాబిచ్చారు. ఏంటీ ప్రత్యేకత... నానక్‌రామ్‌గూడ చౌరస్తాకు సమీపంలో జీ+వన్ గా నిర్మితమైన ఠాణాలో అడుగుపెడుతూనే ఆహ్లాదకర వాతావరణం. ఇన్ స్పెక్టర్, సబ్–ఇన్ స్పెక్టర్ల చాంబర్స్‌తో సహా పోలీసుస్టేషన్ పరిపాలన విభాగం మొత్తం కింది అంతస్తులో ఉంటుంది. మొదటి అంతస్తులో టెక్ టీమ్, కోర్టు విధులు నిర్వర్తించే సిబ్బంది, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, వారంట్ స్టాఫ్, సమ¯Œ స్టాఫ్, క్రైమ్ రైటర్, కేస్ ప్రాపర్టీలకు ప్రత్యేకించి రూమ్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడే మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెస్ట్ రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్స్, సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి పడకలు, భోజనం చేయడానికి వసతులు ఈ ఠాణా ప్రత్యేకతలు. అక్కడ, ఇస్పెక్టర్ చాంబర్‌కు సమీపంలో ప్రతి ఒక్క అధికారికీ ప్రత్యేకంగా కూర్చునే స్థలం, పరిపాలన పరమైన ఫైళ్ల కోసం భద్రమైన ఏర్పాట్లు ఉన్నాయి. సిబ్బంది కోసం మినీ వర్క్ స్టేషన్, మహిళల కోసం వేరుగా వెయిటింగ్ రూమ్, ఇంటర్వ్యూ రూమ్, సబ్–ఇన్స్పెక్టర్లకు విశ్రాంతి గదులు ఈ పోలీసుస్టేషన్ లో అందుబాటులో ఉన్నాయి. రాయదుర్గం పోలీసుస్టేషన్ టెర్రస్ పైన అధికారులు, సిబ్బంది కోసం ఉద్దేశించిన జిమ్, యోగా ఏరియాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వీటితో పాటు రిలాక్స్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. ఈ స్టేషన్ కు ప్రత్యేక గుర్తింపు వెనుక సమిష్టి కృషి ఉంది. ప్రజా మిత్ర పోలీసింగ్ విధానాలు అమలు చేయడంలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల మన్ననలు పొందేలా, వాళ్లు చట్టాలను తప్పనిసరిగా పాటించేలా చేయడంలో సఫలీకృతం కావాలి. ఇది జరగాలంటే ఠాణాలోని అన్ని స్థాయి పోలీసులు తమ విధులు సక్రమంగా నిర్వహించాలి. – ఎస్.రవీందర్, ఇన్‌న్‌స్పెక్టర్ రండి.. రండి.. సాయం కోరుతూ వచ్చిన వారిని అక్కడి సిబ్బంది సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక్కడ ‘హావ్ ఏ పేపర్’విధానం అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ప్రతి బాధితుడికీ వారే అడిగి మరీ కాగితం, పెన్ను అందించడంతో పాటు ఫిర్యాదు రాయడంలోనూ అవసరమైన పూర్తి సహకారం అందిస్తారు. అలాగే ఠాణా మొదటి అంతస్తులో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన బ్యారెక్స్, డైనింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడే ఈ ఠాణాకు సంబంధించిన క్లోజ్డ్ ఫైల్స్ రూమ్ ఏర్పాటు చేశారు. కోర్టులు కోరినప్పుడు, ఉన్నతాధికారులు అడిగినప్పుడు వీటిని పక్కాగా తీసుకువెళ్లి సమర్పించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి ఏ కేసుకు సంబంధించిన ఫైల్ అయినా కేవలం 30 సెకండ్లలోనే బయటకు తీసేందుకు ఆస్కారం ఏర్పడింది. వీటికితోడు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పోలీసుస్టేషన్ లో ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను సైతం అందుబాటులో ఉంచారు. -
‘జయరాం కేసు’లో విచారణకు హాజరైన టీడీపీ నేత
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాసాంధ్రుడు చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డితో సన్నిహిత సంబం ధాలున్నాయన్న వాటిపై ఆరా తీసేందు కు, ఇద్దరి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయన్నదాన్ని తెలుసుకునేందుకు నగర టీడీపీ సీనియర్ నేత, తెలంగాణ టీడీపీ టీఎన్టీయూసీ అధ్యక్షుడు బీఎన్.రెడ్డిని ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్.రెడ్డిని విచారించిన పోలీసులు రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేంటి అన్న మూడు అంశాలపైనే విచారణ చేశారు. ఇరవై రోజుల కిందట బీఎన్.రెడ్డి తన స్నేహితుడు రాకేశ్‌రెడ్డిని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీఐ రాంబాబుతో గంటపాటు మంతనాలు జరిపారు. రాంబాబు తనకు బాగా తెలుసునని ఏ పనై నా చేసిపెడతాడంటూ బీఎన్.రెడ్డి నమ్మించడం తో రాకేశ్‌రెడ్డి తన కారులోనే రాయదుర్గం పీఎస్‌కు అతనితో వెళ్లాడు. జయరాం సెటిల్మెంట్లో తనకు సహకరించాలని రాకేశ్‌రెడ్డి సీఐ రాంబాబుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇటీవలి విచారణ లో రాంబాబు ఇదే విషయాన్ని వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్‌కు తెలియజేశారు. దీంతో బీఎన్.రెడ్డిని విచారణకు హాజరుకావాలని శుక్రవా రం రాత్రి ఫోన్ చేయగా ఆయన ఆదివారం విచారణకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తాను ఖైరతాబాద్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా అప్పుడు రాకేశ్‌రెడ్డి పరిచయం అయ్యాడని ఆయన కూడా టీడీపీ నేత కావడంతో పలుమార్లు మాట్లాడినట్లు, అంతకుమించి తమ మధ్య ఏమీలేదని బీఎన్.రెడ్డి పోలీసులకు తెలిపారు. మొత్తానికి ఈ కేసులో పలువురు టీడీపీ నేతలు కూడా ఉన్నారని తెలుస్తోంది. -
కల్లు కాంపౌండ్‌లో ఎస్ఐ మృతి
హైదరాబాద్: కల్లు కాంపౌండ్‌లో ఎస్ఐ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రాయదుర్గం సీఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండీడ్ మండలం బొట్లగడ్డ తండాకు చెందిన వి.రాములు(53) సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఎస్ఐగా పనిచేస్తున్నాడు.రాజేంద్రనగర్ బుద్వేల్లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న రాములు మంగళవారం ఉదయం కార్యాలయానికి వెళ్లి.. 10 గంటలకు అనుమతి తీసుకొని బయటకు వచ్చాడు. మధ్యాహ్నం రాయదుర్గం కల్లు కాంపౌండ్ ముందు ఓ వ్యక్తి చనిపోయాడని స్థానికులు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతిచెందిన వ్యక్తి ఎస్ఐ రాములుగా గుర్తించారు. అధికారులకు సమాచారం అందించి.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. రాములుకు భార్య, కుమార్తె ఉన్నారు. అయితే కల్లు కాంపౌండ్ బయట రాములు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తుండగా.. స్థానికులు మాత్రం రాములు కాంపౌండ్లోనే చనిపోయాడని అంటున్నారు. కల్లు తాగుతూ నేలకొరిగాడని.. అది గమనించిన కాంపౌండ్ సిబ్బంది రాములును బయట వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. -
హరీశ్‌రావుపై కేసు నమోదు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కానిస్టేబుల్‌ను దూషించిన కేసుకు సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుపై శుక్రవారమిక్కడ రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 8వ తేదీన రాయదుర్గంలో గేమింగ్ యానిమేషన్ పార్క్‌కు సీఎం శంకుస్థాపన కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా వాహనం ఎక్కించే సమయంలో తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఎన్.రమేష్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు దుర్భాషలాడినట్లు కేసు నమోదైంది. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశామని సీఐ బాలకోటి విలేకరులకు తెలిపారు. -
పోలీస్‌ను దూషించినందుకు.. హరీష్ రావుపై కేసు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు దాఖలైంది. కానిస్టేబుల్ విధులకు ఆయన ఆటంకం కలిగించారనే అభియోగంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గేమింగ్ సిటీ శంకుస్థాపనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు హరీష్ రావు అక్కడకు వచ్చారు. అయితే వారిని పోలీసులు అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ఓ పోలీసుపై హరీష్ రావు ......నువ్వు ఆంధ్రోడివా... తెలంగాణ వాడివా..? అంటూ ప్రశ్నించారు. కాగా ఆ పోలీసు మాత్రం తాను ఖమ్మం జిల్లాకు చెందినవాడినని సమాధానం ఇచ్చాడు. ఇంతలో తనను మీడియా గమనిస్తున్నట్లు తెలుసుకున్న హరీష్ రావు నోటికి తాళం వేశారు. పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపై పోలీసు వర్గాల్లో విమర్శలు చెలరేగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ హరీష్ రావు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ...చివరకూ ఆయన క్షమాపణ చెప్పాలంటూ పోలీసు సంఘం ఆందోళనలు చేసేవరకూ వెళ్లాయి. యూజ్ లెస్ ఫెలో, ఓరేయ్ డీసీపీ అంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు పోలీసు సంఘం భగ్గుమంది. అంతకు ముందు ఏపీ భవన్ ఓఎస్డీ చందర్రావుపై ఆయన చేయి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా విధుల్లో ఉన్న పోలీసులపై రాజకీయ నేతల ప్రవర్తన దురుసుగా మారుతోందని ఆరోపణలు ఉన్నాయి. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే సహనం కోల్పోయి....దురుసుగా ప్రవర్తించటం విమర్శలకు దారి తీస్తోంది. -
సల్మాన్ ఫొటోతో ఓటుకు దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు
హైదరాబాద్: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ ఫొటోతో ఓటు నమోదుకు యత్నించిన ఓ వ్యక్తిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదయ్యింది. ఇన్స్పెక్టర్ బాలకోటి సమాచారం మేరకు... గచ్చిబౌలి ఇందిరానగర్‌కు చెందిన అస్లాం అనే వ్యక్తి సల్మన్‌ఖాన్ ఫొటో పెట్టి ఓటరు నమోదు ఫామ్-6ను సమర్పించాడు. ఇది గమనించిన సిబ్బంది ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మనోహర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన నియోజక వర్గ ఓటరు నమోదు కార్యక్రమ ప్రత్యేక అధికారి రవీందర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన అదేశాల మేరకు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు వ్యక్తిపై ఐపీసీ 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో దరఖాస్తులో ఉన్న చిరునామా తప్పుగా ఉందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.