సాక్షి, గచ్చిబౌలి: హెల్మెట్ విలువ ఓ ప్రాణంతో సమానం. అది ధరించకుండా బండి నడిపి ప్రమాదానికి గురైతే నిండు ప్రాణాలు గాలిలో కలుస్తానేందుకు ఈ దుర్ఘటనే ఉదాహరణ. అందుకే హెల్మెట్ ప్రాధాన్యం గుర్తించాల్సిన అవసరముందని తేల్లతెల్లం చేస్తోందీ ఘటన. ఆగి ఉన్న స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. హెల్మెట్ పెట్టుకోకపోవడమే అతడి పాలిట శాపంలా పరిణమించింది. ఈ ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
సీఐ ఎస్.రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు శిబ్‌పూర్‌నకు చెందిన ప్రతీక్ మోహన్ రాతి (30) గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార్య మేఘన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఐసీఐసీఐలో ఉద్యోగం చేస్తున్నారు. నానక్‌రాంగూడలో వీరు నివాసం ఉంటున్నారు. కాగా.. ప్రతీక్ మోహన్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో పాటు యాంకరింగ్ సైతం చేస్తుంటాడు. శుక్రవారం మాదాపూర్‌లోని ఓ పాఠశాల వార్షిక దినోత్సవంలో యాంకరింగ్ చేసి ద్విచక్ర వాహనంపై నానక్‌రాంగూడకు బయలుదేరాడు.
సాయంత్రం 6.30 గంటలకు ఓఆర్‌ఆర్‌పై నానక్‌రాంగూడ జంక్షన్‌కు ముందు ఆగి ఉన్న యాంగ్లిస్ట్ హైస్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108లో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ప్రతీక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రతీక్ వెనకాలే బైక్‌పై వస్తున్న మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రఫీక్ అదుపు తప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. ప్రతీక్ మోహన్ తల వెనక భాగంలో బలమైన గాయమైందని, హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలు దక్కేవని పోలీసులు పేర్కొంటున్నారు.
నాలుగు రోజుల క్రితమే మ్యారేజ్ డే సంబరాలు..
ప్రతీక్ మోహన్, మేఘనలకు గత ఏడాది జనవరిలో వివాహమైంది. నాలుగు రోజుల క్రితమే పెళ్లి రోజు జరుపుకొన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రతీక్ మృతి చెందడంతో ఆయన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందడంతో మేఘన రోదనలు మిన్నంటాయి. ఉస్మానియా ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు ప్రతీక్ మృతదేహన్ని అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment