సాక్షి, హైదరాబాద్ : రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెల రోజుల్లో రెండింతలు ఇస్తామని చెప్పి అసలుకే ఎసరు పెట్టి మొహం చాటేశారు. డబ్బులు ఇస్తామని నమ్మించి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చంపేస్తామని బెదిరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రవీందర్ తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా నడికుడ మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆర్.రంగమ్మ కాచిగూడలోని సాయికృష్ణ న్యూరో హస్పిటల్‌లో టెక్నీషియన్‌గా పని చేసేది. హస్పిటల్‌కు వచ్చే నర్సింహ్మరావు పరిచయం అయ్యాడు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇస్తారని చెప్పి జంగిపురం వనపర్తి జిల్లాకు చెందిన ఆవుల రాజేష్‌ను పరిచయం చేశారు. పెట్టుబడి పెడితే నెలలో రెండింతలు ఇవ్వడంతో పాటు ష్యూరిటీ కింద వనపర్తిలో 7 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మబలికారు.
2019 మార్చి ఏప్రిల్, మే నెలలో రాజేష్‌కు రూ.55 లక్షలు, అతని స్నేహితుడైన సింహచలంకు రూ.15 లక్షలు రాయదుర్గంలోని టింబర్‌లేక్ కాలనీలో గల వైట్ వాటర్ అపార్ట్‌మెంట్‌లో ఇచ్చింది. నెలలు గడుస్తున్నా డబ్బు ఇవ్వకపోవడంతో వనపర్తికి వెళ్లి నిలదీయడంతో గత ఫిబ్రవరిలో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి రూ.35 లక్షల చెక్, మధ్యవర్తిగా ఉన్న ఎన్‌ఎంవీ రావు రూ.35 లక్షల చెక్‌లు ఇచ్చారు. రాజేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆగస్టు 23న రంగమ్మ, ఆమె భర్త రామరావు వనపర్తిలో రాజేష్ ఇంటికి వెళ్లారు. డబ్బు ఇచ్చేంత వరకు అక్కడి నుంచి కదిలేది లేదని ఇంటి ముందు కూర్చున్నారు. బాకీ తీసుకున్న డబ్బులు ఇవ్వట్లేదని వనపర్తి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మాట్లాడుకుందామని చెప్పి కారులో శంషాబాద్‌లోని ఓ లాడ్జ్ తీసుకెళ్లగా అక్కడే రెండు రోజుల పాటు అక్కడే ఉన్నట్లు బాదితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
డబ్బులు ఇవ్వకపోగా రాజేష్‌తో పాటు సింహచలం వరప్రసాద్, జలవడి సోమశేఖర్, నక్కల రవిందర్‌యాదవ్, ఎం.వీ.రాజు, పవన్‌రెడ్డి, ప్రమోద్ లు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి చంపేస్తామని బెదిరించినట్లు రంగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆగస్టు 29న రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 420, 506,504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. డబ్బులు రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇచ్చానని బాధితురాలు చెప్పడంతో కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. విచారణ చేపట్టిన అనంతరం లీగల్ ఒపినీయన్, ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment