దేశంలోనే పోలీస్‌ రంగంలో ఇదే మొదటిసారి: డీజీపీ | Cyber Warriors In All Police Stations For Cyber Crime Prevention: DGP | Sakshi
Sakshi News home page

అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు: డీజీపీ

Published Mon, Feb 22 2021 6:46 PM | Last Updated on Mon, Feb 22 2021 7:02 PM

Cyber Warriors In All Police Stations For Cyber Crime Prevention: DGP - Sakshi

సాక్షి, హైదరాబాద్ : రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను పోలీస్ శాఖ నియమించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో ఇద్దరు, సెమి అర్బన్ పోలీస్ స్టేషన్లలో ముగ్గురు, అన్ని కమిషనరేట్ పోలీస్ స్టేషన్లలో అయిదుగురు చొప్పున పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. దాదాపు 1988 పోలీసు అధికారులను ఎంపిక చేసి నేటి నుంచి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణాకార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలోని అన్ని పోలిస్ స్టేషన్లలో సైబర్ వారియర్లను నియమించడం దేశంలోనే పోలీసు రంగంలో ఇదే మొదటిసారని తెలిపారు. మారుమూల గ్రామాలకు కూడా 4జీ మొబైల్ సేవలు విస్తరించిన ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని ఏ ప్రాంతం నుంచి అయినా రిమోట్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. అధికంగా పెరుగుతున్న ఈ సైబర్ నేరాలను ముందుగానే గుర్తించి వాటిని నిరోధించడం, సైబర్ నేరాలను సమర్థవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ సైబర్ వారియర్లు కీలకపాత్ర వహిస్తారని అన్నారు.

రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసు అధికారులకు రోజువారి విధి నిర్వహణలో ఇప్పటికే 17 మార్గదర్శకాలను రూపొందించి అమలు చేయడం జరుగుతుందని, ఇక నుండి సైబర్ నేరాలను నిరోధించడం 18వ నిబంధనగా ఉంటుందని డీజీపీ అన్నారు. సాంప్రదాయ నేరాల కన్నా సైబర్ నేరాలు భిన్నంగా ఉంటాయని, వీటిని ఎదుర్కోవడానికే సైబర్ ఆధారిత నేరాలు, వాటిని ముందస్తుగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పర్చడం తదితర అంశాల్లో ప్రత్యేక శిక్షణ  ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగే ప్రతి నేర సంఘటనలోను సైబర్ నేర సంబంధిత కాంపోనెంట్ ఉంటుందని అన్నారు. సాధారణ నేరాలను దర్యాప్తుచేసే అధికారులకు ఈ సైబర్ వారియర్లు తోడ్పాటునందిస్తే నేరాల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని అన్నారు.

రోజురోజుకు సైబర్ నేరస్తులు ఆధునిక పద్దతుల్లో నేరాలకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాల్సిన అవసరముందని అన్నారు. ప్రస్తుత 2021 సంవత్సరాన్ని సైబర్ సేఫ్టి సంవత్సరంగా జనవరి 1వ తేదీన ప్రకటించడం జరిగిందని, దీనిలో భాగంగానే ఐజి రాజేష్ కుమార్ ను ఈ విభాగానికి ప్రత్యేక అధికారిగా నియమించడం జరిగిందని డి.జి.పి మహేందర్ రెడ్డి తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విభాగాలు, వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులతో ఐజి రాజేష్ కుమార్ సమన్వయ అధికారిగా ఉంటారని పేర్కొన్నారు. అడిషనల్ డి.జి గోవింద్ సింగ్, ఐ.జి రాజేష్ కుమార్ లు కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సైబర్ వారియర్స్ అనే పుస్తకాన్ని డి.జి.పి మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు.
చదవండి: పాస్‌పోర్టు కేసులో పోలీసులు, విదేశీయుల అరెస్ట్‌
కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement