సాక్షి, హైదరాబాద్: ప్రజలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, అదే విధంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం వల్ల మరింత పటిష్టంగా భద్రతా చర్యలు చేపట్టడానికి వీలవుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉబెర్ యాప్ సంస్థతో కలసి లైవ్ లింక్ షేర్ టూల్‌ను ఆయన పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడం వల్ల రియల్ టైమ్ లొకేషన్‌తో పాటు యూజర్ వివరాలు త్వరితగతిన తెలుస్తాయని, దీని వల్ల ప్రమాదాల్లో ఉన్న వారిని రక్షించడం సులభమవుతుందన్నారు.
భద్రత కోసమే: ఉబెర్ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు తాము సేఫ్టీ టూల్ కిట్ ద్వారా లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరేలా ప్రత్యేక వ్యవస్థ రూపొందించామని ఉబెర్ సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ శైలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తమ యాప్‌లో అనేక భద్రతా అంశాలున్నాయని పేర్కొన్నారు. ఈ లైవ్ లింక్ టూల్ కిట్ సోమవారం నుంచి పోలీస్ శాఖకు లింకు అవుతుందని తెలిపారు. మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న స్వాతిలక్రా తదితరులు
సేఫ్టీ టూల్ కిట్ పని ఇలా..
డ్రైవర్ భద్రతతో పాటు ప్రయాణికుల సేఫ్టీకి ఉబెర్ సంస్థ యాప్ లైవ్ లొకేషన్, పోలీస్ కంట్రోల్ సెంటర్, డయల్ 100కి చేరిపోయేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉబెర్ యాప్‌లోని సేఫ్టీ టూల్ కిట్‌లో బ్లూ షీల్డ్ క్లిక్ చేయగానే వాహనం నంబర్, డ్రైవర్ పేరుతో పాటు ప్రతీ నాలుగు సెకండ్లకు ఒకసారి వాహనం లైవ్ లొకేషన్ పోలీస్ విభాగానికి చేరిపోతుంది.
ప్రయాణికులు సైతం ఈ లింక్‌తో షేర్ ఆప్షన్ క్లిక్ చేయవచ్చు. ఒకవేళ షేర్ వద్దనుకుంటే ఉబెర్ యాప్‌లోని ఎస్‌ఓఎస్ ఉపయోగించుకోవచ్చు. ప్రమాద సమయంలో ఎస్‌ఓఎస్ వల్ల పోలీస్ కంట్రోల్ రూమ్‌కు క్షణాల్లో కాల్ వెళ్తుంది. దీని వల్ల అటు ప్రయాణికులు, ఇటు వాహన డ్రైవర్లకు ఎలాంటి ప్రమాదం ఉన్నా దగ్గరలోని పెట్రోలింగ్ వాహనం సంఘటన స్థలికి చేరుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment