క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు! | Telangana Launches Academic Verification Portal: Sabitha Indra Reddy | Sakshi
Sakshi News home page

క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!

Published Sat, Nov 19 2022 2:24 AM | Last Updated on Sat, Nov 19 2022 8:52 AM

Telangana Launches Academic Verification Portal: Sabitha Indra Reddy - Sakshi

వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తదితరులు.   

సాక్షి, హైదరాబాద్‌: బోగస్‌ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్‌ అకడమిక్‌ వెరిఫికేషన్‌ సర్వీస్‌ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.  27 భాషల్లో ఈ వెబ్‌సైట్‌ సేవలు పొందేలా డిజైన్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, వెబ్‌సైట్‌ రీ డిజైనర్‌ ప్రొఫెసర్‌ నవీన్‌కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు.

తక్షణ వెరిఫికేషన్‌ కూడా..
‘ఆధార్, ఈమెయిల్‌ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్‌ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్‌ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్‌ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్‌ సంతకంతో అందిస్తాం.

15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్‌ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్‌ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు.

ఈ సైట్‌నూ హాక్‌ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్‌రెడ్డి
ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి.

ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్‌ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్‌ టైమ్‌లో ఆన్‌లైన్‌ ద్వారా వెరిఫికేషన్‌ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్‌ ప్రవేశించే వీలుంది. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి.

తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత 
తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement