Bogus certificates
-
రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే..
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర వ్యాపారాల్లో పన్ను ఎగవేస్తున్న వ్యాపారులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా జీఎస్టీ నంబర్లకు సంబంధించిన వ్యాపారులు పన్ను సరిగా కట్టకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. క్షేత్రస్థాయిలో గట్టిగా తనిఖీలు చేసి వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ దిశగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాణిజ్య పన్నులశాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు ప్రారంభించాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు, రిజిస్ట్రేషన్లను తొలగించేందుకు చేపట్టిన డ్రైవ్‌లో కేంద్రం రూ.44వేల కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ఎగవేతకు పాల్పడిన 29వేల సంస్థలను పట్టుకుంది. మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడి రూ.4,646 కోట్లు ఆదా చేసింది. మొత్తం ఏడున్నర నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో 29వేల నకిలీ సంస్థలను, రూ.44వేల కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉనికిలో లేని, బోగస్ రిజిస్ట్రేషన్లను గుర్తించే ప్రత్యేక డ్రైవ్ ఫలితాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వస్తువులు, సేవల సరఫరా లేకుండా చాలా బోగస్ కంపెనీలు ఇన్వాయిస్లను తయారు చేశాయని చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జీఎస్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇదీ చదవండి: పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్ తెలంగాణలో 117 బోగస్ సంస్థల ద్వారా రూ.536 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇందులో రూ.235 కోట్ల మొత్తాన్ని బ్లాక్/ రికవరీ చేయడంతోపాటు ఒకరిని అరెస్టు చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 23 నకిలీ సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 19 బోగస్ సంస్థలు రూ.765 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించింది. ఇందులో రూ.11 కోట్ల మొత్తాన్ని బ్లాక్/రికవరీ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 5 నకిలీవి ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేయడానికి ఆధార్ ధ్రువీకరణ విధానాన్ని గుజరాత్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు. -
క్షణాల్లో నకిలీని పట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: బోగస్ సర్టిఫికెట్ల నియంత్రణకు మరో అడుగు పడింది. ఈ దిశగా స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. 27 భాషల్లో ఈ వెబ్సైట్ సేవలు పొందేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, డీజీపీ మహేందర్‌రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వెబ్సైట్ రీ డిజైనర్ ప్రొఫెసర్ నవీన్‌కుమార్, పలు యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు. తెలంగాణ విద్యాసంస్థల విశ్వసనీయతను విశ్వవ్యాప్తంగా చాటడానికే ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు వక్తలు చెప్పారు. తక్షణ వెరిఫికేషన్ కూడా.. ‘ఆధార్, ఈమెయిల్ వంటి వివరాలతో ఎవరైనా ఈ వెబ్‌సైట్‌కు లింక్ అవ్వొచ్చు. తక్షణ వెరిఫికేషన్ కోరే వారికి కొన్ని నిమిషాల్లోనే పరిమిత సమాచారం ఇస్తాం. సమగ్ర సమాచారం కోరే వారికి కొంత వ్యవధితో వెరిఫికేషన్ పూర్తి చేసి సమాచారం పంపుతాం. దీనికి రూ.1,500 వరకూ రుసుము ఉంటుంది. మార్కులు, ఎక్కడ చదివింది, అన్ని వివరాలను డిజిటల్ సంతకంతో అందిస్తాం. 15 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థుల సమాచారం 2010 నుంచి అందుబాటులో ఉంది. ఏ దేశం నుంచైనా, ఏ సంస్థ అయినా అనుమానం ఉన్న సర్టిఫికెట్ అసలైనదా లేదా నకిలీదా అనేది కేవలం కొన్ని నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు’ అని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి చెప్పారు. కొత్త టెక్నాలజీ పరిధిలోకి ఇంటర్, టెన్త్ బోర్డులను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ చెప్పారు. ఈ సైట్నూ హాక్ చేసే ఘనులున్నారు: డీజీపీ మహేందర్‌రెడ్డి ఇప్పటివరకూ ఉద్యోగాలకు వెళ్లే యువత సరిఫికెట్లు అసలో, నకిలీవో తెలుసుకోవాలంటే తీవ్ర జాప్యం జరిగేది. దీనివల్ల యువకుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నకిలీ ధ్రువపత్రాలు తయారు చేసే ఒక ముఠాను పట్టుకుంటే, మరికొన్ని ముఠాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్లు దేశ విదేశాల్లో ఉన్నారు. కన్సల్టెన్సీలూ ఫేక్ సర్టిఫికెట్లు ప్రోత్సహిస్తున్నాయి. రియల్ టైమ్‌లో ఆన్లైన్ ద్వారా వెరిఫికేషన్ చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. రాబోయేకాలంలో ఇందులోనూ హ్యాకర్స్ ప్రవేశించే వీలుంది. బ్లాక్‌చైన్ టెక్నాలజీతో మరింత పటిష్టం చేయాలి. తెలంగాణ చరిత్రలో మైలురాయి: సబిత తెలంగాణ విద్య చరిత్రలో ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారి మన రాష్ట్రంలోనే దీన్ని తెచ్చాం. నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టాలన్న ఆలోచనకు అనుగుణంగా అన్నిస్థాయిల అధికారులు చొరవ తీసుకున్నారు. టెక్నాలజీని వాడుకుని జరిగే మోసాలకు ఇది అడ్డుకట్ట వేస్తుంది. దీన్ని ఆషామాషీగా ప్రారంభించి వదిలేయకుండా మరింత పకడ్బందీగా ముందుకెళ్లాలి. మన రాష్ట్రంలో జారీ చేసే సర్టిఫికెట్లు నకిలీలు చేయలేరనేది నిరూపించాలి. -
డీఎస్సీలో బోగస్ బాగోతం !
సాక్షి, అనంతపురం : వక్రమార్గంలో ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకోవాలని చూశారు. లేని వైకల్యాన్ని ఉన్నట్లు చూపించి అధికారులను బురిడీ కొట్టించారు. అయితే వారి భాగోతం మెడికల్ బోర్డులో బయటపడింది. ఈ అక్రమ వ్యవహారం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లతో బధిరుల కోటాలో ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులకు చెక్ పడింది. వివరాల్లోకి వెళ్తే...డీఎస్సీ–18లో స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టులో కె.అనసూయ, కె.చంద్రమౌళి, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్.మాధవిలత, పి.విజిత, సోషల్ సబ్జెక్టులో టి.నారాయణస్వామి బధిరుల (హెచ్ఐ) కేటగిరీలో ఉద్యోగాలు పొందారు. జిల్లాస్థాయిలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తయింది. పి. విజిత మాత్రం అనారోగ్య కారణంగా మెడికల్ బోర్డుకు ఇంకా వెళ్లలేదు. తక్కిన నలుగురు గత నెల(సెప్టెంబరు) 19 నుంచి 23 దాకా మెడికల్ బోర్డు వైజాగ్ ఈఎన్టీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు కంప్యూటర్ ద్వారా బేరా పరీక్షలు నిర్వహించడంతో వీరి బండారం బయటపడింది. టి.నారాయణస్వామి మినహా తక్కిన ముగ్గురు అభ్యర్థుల వినికిడి లోపం బోగస్ అని తేలింది. విశాఖ నుంచి దిమ్మతిరిగే రిపోర్ట్ జిల్లాకు రావడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు. ‘0’ శాతం కూడా వైకల్యం లేదు గణితం సబ్జెక్టులో ఎంపికైన కె.అనసూయకు విశాఖపట్నం మెడికల్‌బోర్డు నిర్వహించిన బేరా టెస్ట్‌లో ‘0’ శాతం ఉన్నట్లు తేలింది. అంటే సాధారణ వ్యక్తుల్లాగా ఉన్నట్లే. ఈమె 51–55 (రెండు చెవులు) శాతం వినికిడిలోపం ఉన్నట్లు డీఎస్సీకు దరఖాస్తు చేసుకుంది. 50 శాతం పైగా వినికిడి లోపం ఉన్నట్లు ఎస్వీఆర్ఆర్ జీజీ ఆస్పత్రి తిరుపతి వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్ పొందుపరిచింది. మరో అభ్యర్థి కె.చంద్రమౌళికి ‘5’ శాతం వినికిడి లోపం ఉన్నట్లు బేరా టెస్ట్‌లో తేలింది. ఈయన కూడా 51–55 (రెండు చెవులు) శాతం వినికిడి లోపం ఉన్నట్లు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నాడు. 53 శాతం చెవుడు ఉన్నట్లు అనంతపురం మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జత చేశాడు. ఫిజికల్ సైన్స్‌లో మాధవీలతకు ‘0’ శాతం ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్.మాధవీలతకు ‘0’ శాతం వినికిడి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డులో తేలింది. ఈమె తనకు ఏకంగా 70 శాతం పైబడి వినికిడి లోపం ఉన్నట్లు డీఎస్సీకి దరఖాస్తు చేసుకుంది. 76 శాతం వినికిడి లోపం ఉన్నట్లు కడప రిమ్స్ ఆస్పత్రి వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్ పొందుపరిచింది. సోషల్ సబ్జెక్టులో దరఖాస్తు చేసుకున్న టి.నారాయణస్వామి అనే అభ్యర్థి 70 శాతం వినికిడి లోపం ఉన్నట్లు విశాఖ మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. అనారోగ్య కారణంగా హాజరుకాలేకపోయిన ఫిజికల్సైన్స్ సబ్జెక్టు అభ్యర్థిని పి.విజిత పరీక్షలకు బోర్డుకు వెళ్లాల్సి ఉంది. కాగా బోగస్ సర్టిఫికెట్లు జతచేసి ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. దీనిపై స్పష్టత కోసం కమిషనర్‌కు రాసి అక్కడి నుంచి రాగానే చర్యలు తీసుకోనున్నారు. భయం లేకనే దరఖాస్తు వికలాంగ కేటగిరిల్లో బోగస్ సర్టిఫికెట్లు జత చేసి సులువుగా ఉద్యోగాలు పొందవచ్చనే భావనలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ‘దొరికితే దొంగ, దొరక్కపోతే దొర’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. స్థానిక ఉన్న వైద్యులకు డబ్బు ఎర చూపించి లేని వైకల్యం ఉన్నట్లు బోగస్ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. మెడికల్ బోర్డులో కూడా తమ ‘ప్రత్యేక రూటు’లో పని చేయించుకోవచ్చని ధీమాతో దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో పలువురు అభ్యర్థులు ఇదే తరహాలో ఉద్యోగాలు పొందారు. భోగస్ అని తేలిన తర్వాత కూడా కఠిన చర్యలు లేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డుపడడం లేదు. భోగస్ అభ్యర్థుల కారణంగా నిజంగా అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. -
బోగస్ పట్టాల కుంభకోణం
పలమనేరు పట్టణంలో ఖాళీ జాగాలకు రెక్కలు వచ్చాయి. కబ్జాదారులు ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వాటికి బోగస్ పట్టాలు సృష్టించి, సదరు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. సాక్షి, పలమనేరు(చిత్తూరు) : పలమనేరు పట్టణంలో బోగస్ ఇంటి పట్టాలు కలకలం రేపుతున్నాయి. 400 వరకు బోగస్ ఇంటి పట్టాలు (ఇంటి నివేశ పట్టాలు, అనుభవ ధ్రువపత్రాలు) చెలామణిలో ఉన్నాయని సమాచారం. ఈ పట్టాలతో పలువురు ఇందిరమ్మ కాలనీలు, పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో పక్కా ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. ఇప్పటికీ బోగస్ పట్టాలు అంగట్లో సరుకుల్లా దొరుకుతున్నాయని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిజమేనని గతంలో రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఫైలును ఎవరు తొక్కిపెడుతున్నారు.. ఎందుకు తొక్కిపెడుతున్నారన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇప్పటివరకు బోగస్ పట్టాలతో ప్రభుత్వానికి చెందిన రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. పక్కాగా బోగస్ పట్టాలు తయారు చేశారు ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలు పొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదులో ఆగిన వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల స్కెచ్లను రెవెన్యూ సర్వేయర్ల నుంచి బోగస్ పట్టాల ముఠా పొందింది. ఆ మేరకు లే అవుట్లో ఖాళీ ఉన్న బ్లాక్‌లను గుర్తించి, అక్కడ ఏ, బీ అనే సబ్ డివిజన్ నంబర్ల ద్వారా ఒరిజినల్ హద్దులనే పెట్టి పట్టాలు తయారు చేశారు. నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మడంతో ప్లాట్లు స్థలాన్ని స్వాధీనం చేయించడం, ఇంటి నిర్మాణం దాకా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఈ ముఠానే దగ్గరుండి చూసుకుంటుందనే ఆరోపణలున్నాయి. ఇదెలా సాగుతోందంటే.. గతంలో పలమనేరు తహసీల్దార్లుగా పనిచేసిన నాగమణి, మునాఫ్, రవిచంద్రన్ హయాంలో అప్పటి సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్వోల ద్వారా తహసీల్దార్ కార్యాలయం, తహసీల్దార్ల సీళ్లను కొందరు సంపాదించినట్లు తెలిసింది. కార్యాలయంలోని ఖాళీ ఇంటి అనుభవ నివేశపత్రాలు, పట్టాలను భారీగా జిరాక్స్ చేయిం చుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐదేళ్లుగా రెవెన్యూ కార్యాలయంలోని కాలనీ స్కెచ్‌ల ఆధారంగానే బోగస్ పట్టాల తయారీ జోరుగా సాగినట్టు తెలుస్తోంది. ఈ ముఠాలోని కొందరు సభ్యులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంటి పట్టాగాని, అనుభవ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తే కార్యాలయంలోని వీహెచ్ఎస్(విలేజ్ హౌస్‌సైట్ రిజిస్టర్)లో నమోదు కావాలి. కానీ ఇక్కడ అవేమీలేనట్లు సమాచారం. ఇందులో రెండు ప్రధాన ముఠాలు ఈ కుంభకోణంలో ఓ రిటైర్డ్ కరణం, ఓ వీఆర్వో, సర్వేయర్ వద్ద పనిచేసిన వెలుగు సర్వేయర్, ఓ ఆర్ఐ, నలుగురు బదిలీ అయిన వీఆర్వోలు, నలుగురు మాజీ కౌన్సిలర్లు, పదిమంది రెవెన్యూ బ్రోకర్లు కీలకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం రెండు సెంట్లు కనిపిస్తే వీళ్లు రంగంలోకి దిగి.. దానికి నకిలీ పట్టా తయారు చేయడం జరిగిపోతోంది. సర్వే సైతం వాళ్లే చేసి, హద్దులు చూపి, కొన్న వారికి ఇంటి స్థలాన్ని మూడు రోజుల్లో చేతికిచ్చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో స్థలాలపై అనుభవం కలిగి పట్టాలు లేని వారికి సైతం దొంగపట్టాలను తయారు చేసినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఎఫ్ఎంబీ బుక్కులే ఈ ముఠా చేతుల్లో ఉన్నాయంటే వీరు ప్రత్యామ్నాయంగా ఓ తహసీల్దార్ కార్యాలయాన్నే నడుపుతున్నట్లు ఉంది వ్యవహారం. అధికారుల విచారణలో బయటపడినా.. ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడింది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ నివేదిక విషయం మాత్రం బయటకు రాలేదు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందిం చాలని స్థానికులు కోరుతున్నారు. -
బోగస్ సర్టిఫికెట్లకు ఆన్లైన్ చెక్!
అందుబాటులో విద్యార్థుల ఐదేళ్ల డేటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల సమగ్ర వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. బోగస్ సర్టిఫికెట్లను నిరోధించేందుకు ఈ చర్యలు చేపడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి దీనికి సంబంధించిన చర్యలపై అధికారులతో ఇప్పటికే చర్చించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వెబ్సైట్ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనిని సిద్ధం చేశారు.tsche.ac.in పేరుతో రూపొందించిన వెబ్సైట్లో గడిచిన ఐదేళ్లలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పీజీ, పీహెచ్డీ తదితర కోర్సులను పూర్తి చేసిన విద్యార్థుల హాల్ టికెట్ నంబరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, ఆ డిగ్రీలో విద్యార్థి సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కుల వివరాలు అన్నింటినీ అందుబాటులో ఉంచనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడి యెట్ వివరాలనూ వెబ్సైట్లో ఉంచే ఆలోచన చేస్తున్నారు. హాల్ టికెట్ నంబర్‌తో పూర్తి సమాచారం విద్యార్థి హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేస్తే చాలు.. ఆ విద్యార్థికి సంబంధించిన ఆ వివరాలన్నింటినీ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది లేకుండా ఏ నియామక సంస్థ అయినా, విద్యా సంస్థ అయినా ఆ విద్యార్థికి సంబంధించిన సర్టిఫికెట్, అందులోని వివరాలు సరైనవేనా? కావా? అన్నది సరిచూసుకోవచ్చు. విద్యార్థి ఇచ్చిన సర్టిఫికెట్‌లోని వివరాలను హాల్‌టికెట్ నంబరు సహాయంతో పొందే వీలు ఏర్పడుతుంది. వచ్చే 15 రోజుల్లోగా వెబ్సైట్లో ఈ వివరాలను అందుబాటులోకి తేనుంది. వీలైతే 5 ఏళ్లకు ముందు సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్నీ అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు. -
ఆర్టీసీలో ‘అన్‌ఫిట్’ గోల్మాల్
♦ నకిలీ ధ్రువపత్రాలతో విధులకు కొందరు డ్రైవర్ల ఎగనామం ♦ యథావిధిగా జీతాలు ♦ ఓ అచ్చుతప్పుతో దొరికిపోయిన తీరు ♦ 20 మందిపై కేసులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)లో మరో గోల్మాల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విధులకు ఎగనామం పెడుతూ జీతంలో కోత పడకుండా చూసుకునేందుకు కొందరు డ్రైవర్లు ఆడిన ‘అన్‌ఫిట్’ డ్రామా బట్టబయలైంది. శారీరక సమస్యల కారణంగా డ్రైవర్ విధులను చేపట్టే సామర్థ్యం లేదంటూ ఆర్టీసీ మెడికల్ బోర్డు పేరిట పలువురు నకిలీ అన్‌ఫిట్ ధ్రువపత్రాలు సమర్పించినట్లు అధికారుల విచారణలో నిగ్గుతేలింది. జీతాలు పెరిగినా విధులకు ఎగనామం... ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ సిబ్బంది వేతనాలను సవరించడంతో భారీగా పెరిగాయి. సీనియర్ డ్రైవర్ల జీతం రూ. 50 వేలు దాటింది. అయితే సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిందిపోయి కొందరు సిబ్బంది ఏకంగా విధులకు ఎగనామం పెట్టి జీతాలు జేబులో వేసుకునేందుకు పథకం రచించారు. డ్రైవర్‌కు కంటి చూపు ప్రధానం. అలాగే కాళ్లు, చేతులు కూడా సరిగ్గా పనిచేయాలి. సమస్యలున్న వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి లోపాలను తేలుస్తారు. ఒకవేళ శారీరక లోపాలుంటే ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉండే ఆర్టీసీ మెడికల్ బోర్డు వారికి అన్‌ఫిట్ ధ్రువపత్రాలను జారీ చేస్తుంది. దాన్ని డిపో మేనేజర్లకు సమర్పిస్తే ప్రత్యామ్నాయంగా గ్యారేజీలో శ్రామిక్గానో (జీతం రూ. 17 వేలు), డిపోల్లో ఇతర పనులకో అటువంటి వారి సేవలను వినియోగించుకుంటారు. అయితే జీతం మాత్రం డ్రైవర్ స్కేల్ ప్రకారమే చెల్లిస్తారు. దీన్ని అదనుగా చేసుకుని కొందరు బద్ధకస్తులైన డ్రైవర్లు మెడికల్ బోర్డు జారీ చేసినట్టుగా బోగస్ ధ్రువపత్రాలు సృష్టించి డ్రైవర్ విధులకు ఎగనామం పెట్టేశారు. దొరికిందిలా... వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఓ డ్రైవర్ దాఖలు చేసిన సర్టిఫికెట్లో ‘సూపరింటెండెంట్’ ఆంగ్ల పదంలో అచ్చు తప్పు దొర్లింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆర్టీసీ ఆసుపత్రిని వాకబు చేయగా అది నకిలీదని తేలింది. దీంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి ఇటీవల దాఖలైన పలు సర్టిఫికెట్లను పరిశీలించగా వాటిల్లో ఇలాంటి బోగస్‌లు భారీగా ఉన్నట్టు బయటపడింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు ఇటువంటి 20 మందిని గుర్తించిన అధికారులు ఈ గోల్‌మాల్‌పై లోతుగా విచారణ ప్రారంభించారు. గతేడాది దాఖలైన సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక డిపో మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కూడా రంగంలోకి దిగారు. నకిలీ అన్‌ఫిట్ ధ్రువపత్రాలు సృష్టించిన సూత్రధారి కోసం గాలిస్తున్నారు. -
బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): కొంతమంది విద్యార్థులు బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ బుధవారం హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇటీవల ముగిసిన మెడికల్ కౌన్సెలింగ్‌లో ఏడుగురు అగ్రకుల అభ్యర్థులు బీసీ బోగస్ సర్టిఫికెట్లతో ఎంబీబీఎస్ సీట్లు పొందారు. వీరిలో ఐదుగురు ఏపీ ఎంసెట్, మరో ఇద్దరు తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొంది సీట్లు దక్కించుకున్నారు. వారందరూ కర్నూలు జిల్లా కల్లూరు మండలం తహసీల్దార్ శివరాముడు జారీచేసినట్లు ఉన్న కుల ధ్రువపత్రాలు సమర్పించడంతో అనుమానం వచ్చినట్లు మంత్రి తెలిపారు. అనంతపురం, కాకినాడ, కరీంనగర్ జిల్లాల వారు కల్లూరు మండలంలో ఉంటున్నట్లుగా నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ ఏడుగురిలో ఆరుగురు బాలికలు కావడం విశేషం. వారందరికీ బీసీ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చిన జాబితా ప్రకారం హెల్త్ యూనివర్సిటీలో జరిగిన కౌన్సెలింగ్‌లో అధికారులు సీట్లు కేటాయించారు. మిగిలిన కౌన్సెలింగ్ కేంద్రాల్లోనూ ఎవరైనా ఇలా చేరారేమో విచారణ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. డీజీపీ, ఇంటెలిజన్స్ డీజీ దృష్టికి తీసుకువచ్చామని, సీబీ సీఐడీ విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఈ విషయాన్ని ఎంసీఐ దృష్టికి తీసుకెళ్లి బీసీ విద్యార్థులకు చెందాల్సిన సీట్లు వారికే కేటాయించేలా ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. సదరు తహసీల్దార్ విషయమై కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అవినీతికి పాల్పడుతున్నాడని తెలిసి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీచేసినట్లు చెప్పారని వివరించారు. ఇదే విషయమై ప్రస్తుతం వెలుగోడులో తహసీల్దార్‌గా పనిచేస్తున్న శివరాముడును ‘సాక్షి’ వివరణ కోరగా... నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం ఇప్పుడే తెలిసిందన్నారు. తహసీల్దార్‌గా ఇప్పటి వరకు లక్షా 70వేల సర్టిఫికెట్లు జారీ చేశానని, వీటిలో నకిలీలు ఉన్నట్లు తెలియదన్నారు. పరిశీలించిన తర్వాత వివరణ ఇస్తానని చెప్పారు. -
బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 12 మంది సస్పెన్షన్
పాల్వంచ (ఖమ్మం): తప్పుడు ధ్రువపత్రాలతో ఖమ్మం జిల్లాలోని కేటీపీఎస్ (కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్) 5,6 దశల కర్మాగారంలో ఉద్యోగాలు పొందిన 12 మంది జేపీఏ (జూనియర్ ప్లాంట్ అటెండెంట్)లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2013 జూలైలో జెన్కో సంస్థలో 1295 మంది జేపీఏలుగా ఉద్యోగాలు పొందారు. అందులో 446 మంది కేటీపీఎస్ కర్మాగారానికి నియమితులయ్యారు. అయితే రిక్రూట్మెంట్ సమయంలో తప్పుడు ఏజెన్సీ సర్టిఫికెట్లతో కొందరు ఉద్యోగాలు పొందారని గిరిజన సంఘాలు జిల్లా కలెక్టర్‌కు, జెన్కో యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు, సర్టిఫికెట్లను తిరిగి రెవెన్యూ అధికారులు పరిశీలించారు. దీంతో 12 మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీంతో వారిని సస్పెండ్ చేయాలని ఇటీవల బదిలీ అయిన కలెక్టర్ ఇలంబరితి జెన్కో యాజమాన్యాన్ని ఆదేశించారు. ఆ మేరకు కేటీపీఎస్ 5,6 అధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. 25 నెలల పాటు విధుల నిర్వహించిన అనంతరం వీరు సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయంశంగా మారింది. తప్పుడు ఆధారాలతో రెవెన్యూ అధికారులను పక్కదోవ పట్టించిన 12 మందిపై పోలీసు కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. -
బడి పంతుళ్లపై కేసుల నమోదు
సాక్షి, ఒంగోలు: సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)ల నుంచి స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ఉపాధ్యాయులపై చీటింగ్, ఫోర్జరీలకు సంబంధించి 420, 468, 471 సెక్షన్ల కింద గతనెల 30వ తేదీన సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసింది. ఈ పదోన్నతుల వ్యవహారం ఇప్పటిది కాకపోయినా కేసులు మాత్రం తాజాగా నమోదయ్యాయి. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన 82 మంది, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 87 మంది ఉపాధ్యాయులు ఈ కేసులను ఎదుర్కోవాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలోని 248 మందికి ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతి కల్పించగా వారిలో 80 మందిపై కేసులు నమోదయ్యాయి. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో పదోన్నతి పొందిన మరో ఇద్దరిపైనా కేసులు దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 272 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతులు పొందగా వారిలో 87 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2000 సంవత్సరం తరువాత పదోన్నతులు లేకపోవడంతో 2009లో ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రమోషన్లు కల్పించింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతులు ఇచ్చినప్పటికీ ఇంగ్లిషు సబ్జెక్టులో పదోన్నతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పట్లో పదోన్నతి పొందేందుకు అర్హులైన (ఎంఏ, ఇంగ్లిషు) వారు లేకపోవడమే ఇందుకు కారణం. తమ ముందు బ్యాచ్‌లకు చెందిన వారికి భారీగా పదోన్నతులు రావడంతో తమ వంతు వచ్చేసరికి తాము ఉద్యోగంలో ఉంటామో, పదవీ విరమణ చేస్తామో అనే సమస్య పలువురు ఉపాధ్యాయులను వేధించసాగింది. దీంతో ఉపాధ్యాయులకు సంబంధించి అలాంటి వర్గం వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. అనేకమంది చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లను పొందుపరచడంతో తదుపరి పదోన్నతులు పొందాల్సిన తమకు తీవ్రంగా అన్యాయం జరగనున్నదనేది వారి అభియోగంలోని సారాంశం. ముఖ్యంగా ఎస్జీటీలుగా పనిచేస్తున్నవారు ఇంగ్లిషు సబ్జెక్టుకు సంబంధించి తమిళనాడులోని అన్నామలై, అళగప్ప, మధురై కామరాజ్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఎంఎస్ యూనివర్సిటీ, వినాయక మిషన్ల నుంచి, జేఎన్ఆర్వీ (రాజస్థాన్), కువెంఫు (కర్నాటక), భోజ్ (మధ్యప్రదేశ్), మగధ (బీహార్) యూనివర్సిటీల నుంచి ఎంఏ (ఇంగ్లిషు) పట్టాలు పొంది వాటిని తమ పదోన్నతులకు జతపరిచారు. పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి పొందిన పట్టాలు చెల్లుబాటు కావనే అంశం ఎక్కడా పేర్కొనకపోవడంతో సదరు పట్టాలు పొంది ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్లుగా కొనసాగతున్నవారు ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా 2009లో ఈ పదోన్నతుల ప్రక్రియ జరిగినప్పటికీ ఈ వివాదం మాత్రం 2010 నుంచి తీవ్రమైంది. అప్పట్లో ఈ వ్యవహారంపై ప్రభుత్వం శాఖాపరంగా చేపట్టిన విచారణ నత్తనడకన సాగడంతో పలువురు ఉప లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో ఉప లోకాయుక్త ఈ వ్యవహారాన్ని సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 14 అంశాలపై విచారణ విద్యాశాఖ అధికారులు తొలుత నిర్వహించిన విచారణలో సంబంధిత సర్టిఫికెట్లు ఆయా యూనివర్సిటీలు జారీ చేసినవేనని తేలింది. అయితే ఈ విచారణలో 14 అంశాలను కమిటీ వెలుగులోకి తెచ్చింది. దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలకు స్టడీ సెంటర్లు ఆయా రాష్ట్రాలలోనే ఉండాలి. ఉపాధ్యాయులు పీజీ చేసిన కాలంలో ఆ సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉండాలి. పరీక్షలు జరిగిన తేదీల్లో ఉపాధ్యాయులు తప్పనిసరిగా సెలవులు పెట్టి ఉండాలి. డిగ్రీకి పీజీకి మధ్య రెండు సంవత్సరాల గ్యాప్ ఉండాలి. పలువురు పదోన్నతి ఉత్తర్వులు ముందుగా తీసుకుని ఆ తరువాత తేదీలలో సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిసింది. మరికొందరు రెండు సంవత్సరాల కాలంలో పూర్తిచేయాల్సిన పీజీని కేవలం ఏడాదిలో (ఒన్ సిట్టింగ్) చదివి ఉన్నట్లు తెలిసింది. రెండేళ్ల పీజీ కోర్సుకు సంబంధించి ఒక ఏడాది ఒక యూనివర్సిటీలో రెండో సంవత్సరం మరో యూనివర్సిటీలో చదివి ఉంటే అలాంటి వారు అనర్హులవుతారు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీలో చదివినవారు, స్కూళ్లలో పనిచేస్తూనే రెగ్యులర్‌గా యూనివర్సిటీకి వెళ్లి పీజీ చేసినట్లుగా సర్టిఫికెట్లు పొందినవారు... ఇలాంటి అంశాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ 14 అంశాలలో అన్నీ సక్రమంగా ఉంటే సరే. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే. ప్రకాశం జిల్లాలో... గిద్దలూరు, కందుకూరు, కంభం, జె.పంగులూరు, పొన్నలూరు, దర్శి, అద్దంకి, పెద్దారవీడు, మార్కాపురం, తర్లుపాడు, వలేటివారిపాలెం, కొండపి, టంగుటూరు, బేస్తవారిపేట, లింగసముద్రం, కొనకనమిట్ల, కురిచేడు, సంతనూతలపాడు, దొనకొండ, దోర్నాల, రాచర్ల, నాగులుప్పలపాడు, మర్రిపూడి, ఉలవపాడు, జరుగుమల్లి, చీమకుర్తి, పీసీపల్లి, బల్లికురవ, కొరిశపాడు, సింగరాయకొండ, త్రిపురాంతకం, మార్టూరు, సంతమాగులూరు, మద్దిపాడు మండలాల్లో ఎస్జీటీలుగా పనిచేసి ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన 82 మంది ఉపాధ్యాయులపై ఈ కేసులు నమోదయ్యాయి. -
నకిలీల గుబులు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: యూజీసీ గుర్తింపు లేని విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు ఇటు విద్యాశాఖలో, అటు టీచర్లలో గుబులు రేపుతున్నా యి. గతంలో యూజీసీ గుర్తింపులేని విద్యా సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్ల ఆధారం గా కొందరు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. అయితే వీటిలో కొన్ని నకిలీ సర్టిఫికెట్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఇలా పదోన్నతులు పొందిన వారిలో జిల్లాలో ప్రస్తుతం 45 మంది క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ పదోన్నతులపై అప్పట్లో విద్యాశాఖ జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. 45 మందికి సీఐడీ నోటీసులు కూడా పంపినట్లు సమాచారం. వారంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ముందుగా పాలకులు ప్రకటించి ఉంటే ఆయా కళాశాలల్లో దూర విద్య ద్వారా డిగ్రీని పొందేవాళ్లం కాదని సంబంధిత టీచర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో చేపడుతున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియపై విద్యాశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008-09 సంవత్సరంలో జంబో డీఎస్సీని ప్రకటించారు. ఎస్జీటీలకు, నకిలీల గుబులుఅర్హులైన ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో అవసరమైన ప్రధానోపాధ్యాయుల (హెచ్ఎం), స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పదోన్నతులకు అవకాశం కల్పించారు. వేల సంఖ్యలో ఉన్న పదోన్నతులను వదులుకోకూడదని భావించినకొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోని వినాయకా విద్యామిషన్, రాజీవ్ విద్యాపీఠం వంటి గుర్తింపులేని వర్సిటీల నుంచి బీఎడ్ సర్టిఫికెట్తో పాటు పీజీ సర్టిఫికెట్లు పొందారు. మరికొందరు ఏకంగా నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి పదోన్నతులు పొందా రు.ఇందులో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన వారు అధికంగా ఉన్నారు. భారీ సంఖ్యలో పదోన్నతులు ఉండడంతో సర్టిఫికెట్లపై ఎలాంటి విచారణ జరపకుండానే అప్పట్లో పదోన్నతులు కల్పించా రు. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి లభించకపోవడంతో అప్పటి రాష్ట్ర పాఠశాల విద్యాసంచాలకులు పూనం మాలకొండయ్యకు వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ సర్టిఫికెట్లు నిజమైనవా? నకిలీవా? సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా... నిగ్గుతేల్చాలని ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అక్రమాలు బయటపడతాయన్న భయంతో తమను కాపాడాలని... అక్రమ పదోన్నతు లు పొందినవారు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పటి రోశయ్య ప్రభుత్వంపై వచ్చిన ఒత్తిడి కారణంగా విచారణ ఆగిపోయింది. అర్హులైన ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మళ్లీ కదలిక వచ్చింది. ఆ తర్వాత సీఐడీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టు బయటపడింది. ఈ మేరకు వారి జాబితాను సీఐడీ అధికారులకు గత ఏడాది అప్పగించారు. అభ్యర్థుల కేసుకు సంబంధించిన నోటీలనుతాజాగా పంపినట్లు తెలుస్తోంది. అక్రమాలకు తావులేకుండా... తాజాగా జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియలో అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం ముందుగా తెలిపిన అనర్హత యూనివర్సిటీ విద్యార్హతల సరిఫికెట్లు తాజా ప్రక్రియలో ఎదురుకాలేదని వివరించారు. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల పేర్లు, వారు పనిచేసే స్థానాల వివరాలను వెల్లడించేందుకు డీఈఓ నిరాకరించారు. -
గురువుల్లో గుబులు
శ్రీకాకుళం న్యూకాలనీ, న్యూస్‌లైన్: నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందిన వారిపై రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్, సీఐడీ అధికారులు కొరడా ఝుళిపించడం ఉపాధ్యాయుల్లో గుబులు పట్టుకుంది. ఎస్జీటీలుగా పనిచేస్తూ అక్రమంగా స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందినవారిపై శుక్రవారం దాడులు జరగడమే కాకుండా కఠినంగా కేసులు కూడా నమోదు చేస్తుండడమే దీనికి కారణం. జిల్లాలో కూడా అక్రమ పదోన్నతులు పొందిన వారు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలతో పోల్చితే శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారే జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల్లో అధికంగా పనిచేస్తున్నారు. జిల్లాలో ఎస్జీటీలుగా ఉద్యోగాలు చేస్తూ నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందిన వారు వందల సంఖ్యలో ఉండచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీల ద్వారా యూజీ, పీజీ కోర్సులు చదవకుండా నికిలీ ధ్రువపత్రాలను రూ 10వేల నుంచి రూ 30వేల మద్య కొనుగోలు చేసి పదోన్నతల సమయం వాటిని అస్త్రాలగా ఉపయోగించుకున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా జిల్లాలో కూడా నికిలీ పత్రాలతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు ఉన్నారనే విషయం సుస్పష్టం అవుతుండటంతో విజిలెన్స్, సీఐడీ దాడులు జరగవచ్చుననే ఊహాగానాలు విద్యాశాఖ వర్గాల్లో జోరందుకున్నాయి. దాడులు సైతం జరగవచ్చుననే సంకేతాలను అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ఇది అక్రమ పద్ధతుల్లో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. -
నేడో రేపో బేడీలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పదోన్నతి కోసం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 42 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన సీబీసీఐడీ ఆధారాల సేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యే అవకాశముంది. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పదోన్నతి పొందిన వారు రాష్ట్రంలో 3,500 మంది ఉన్నట్లు ఆరోపణలు రాగా, ఇందులో జిల్లా నుంచి 300కు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రస్తుతానికి 42 మందిని సీబీసీఐడీ గుర్తించినట్టు సమాచారం. డీఈఓ కార్యాలయ వర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 (34) కింద ఎఫ్ఐఆర్ జారీ చేసిన సీబీసీఐడీ విచారణ జరిపింది. అక్టోబర్ మూడో వారంలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై కేసులు నమోదయ్యాయి. 2009 జనవరి చివరివారంలో జరిగిన పదోన్నతి కౌన్సెలింగ్‌లోనూ కొందరు ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అర్హతలున్నా పదోన్నతులు దక్కక పోవడంతో కొందరు ఉపాధ్యాయులు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ‘బోగస్’లను గుర్తించేందుకు 4 ఏప్రిల్, 2010లో విద్యాశాఖ డెరైక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప విద్యాధికారుల స్థాయిలో సర్టిఫికెట్లను పరిశీలించి వినాయక విద్యామిషన్ (తమిళనాడు), రాజస్థాన్ విద్యాపీఠ్, కువెంపు, భోజ్ యూనివర్సిటీల పేరిట జారీ అయిన సర్టిఫికెట్లు బోగస్విగా నిర్ధారించారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా! సిద్దిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ సర్టిఫికెట్లను చెలామణి చేస్తోందంటూ 2009 పదోన్నతుల కౌన్సెలింగ్ సందర్భంగా ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. రాత్రికి రాత్రే పోస్టుగ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చిన వైనాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులపై విచారణ కొలిక్కి వస్తోంది. సర్టిఫికెట్లు ఎక్కడ నుంచి పొందారు, వీటి జారీ వెనుక వున్న ముఠా ఎవరనే కోణంలోనూ సీబీసీఐడీ సమాచారం సేకరిస్తోంది. డీఎస్సీ 2012లో కూడా కొందరు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించేందుకు ప్రయత్నించడంతో స్వయంగా డీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీసీఐడీ అభియోగాలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల జాబితాను వెలువరించేందుకు డీఈఓ కార్యాలయ వర్గాలు నిరాకరిస్తున్నాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే సమాచారం ఉండటంతో కొందరు ముందస్తుగా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.