అందుబాటులో విద్యార్థుల ఐదేళ్ల డేటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థుల సమగ్ర వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. బోగస్ సర్టిఫికెట్లను నిరోధించేందుకు ఈ చర్యలు చేపడుతోంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి దీనికి సంబంధించిన చర్యలపై అధికారులతో ఇప్పటికే చర్చించారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా వెబ్‌సైట్ రూపకల్పనకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనిని సిద్ధం చేశారు.tsche.ac.in పేరుతో రూపొందించిన వెబ్‌సైట్‌లో గడిచిన ఐదేళ్లలో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ తదితర కోర్సులను పూర్తి చేసిన విద్యార్థుల హాల్ టికెట్ నంబరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, ఆ డిగ్రీలో విద్యార్థి సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కుల వివరాలు అన్నింటినీ అందుబాటులో ఉంచనున్నారు. పదో తరగతి, ఇంటర్మీడి యెట్ వివరాలనూ వెబ్‌సైట్‌లో ఉంచే ఆలోచన చేస్తున్నారు.
హాల్ టికెట్ నంబర్‌తో పూర్తి సమాచారం
విద్యార్థి హాల్ టికెట్ నంబరు ఎంటర్ చేస్తే చాలు.. ఆ విద్యార్థికి సంబంధించిన ఆ వివరాలన్నింటినీ పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అనేది లేకుండా ఏ నియామక సంస్థ అయినా, విద్యా సంస్థ అయినా ఆ విద్యార్థికి సంబంధించిన సర్టిఫికెట్, అందులోని వివరాలు సరైనవేనా? కావా? అన్నది సరిచూసుకోవచ్చు. విద్యార్థి ఇచ్చిన సర్టిఫికెట్‌లోని వివరాలను హాల్‌టికెట్ నంబరు సహాయంతో పొందే వీలు ఏర్పడుతుంది. వచ్చే 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో ఈ వివరాలను అందుబాటులోకి తేనుంది. వీలైతే 5 ఏళ్లకు ముందు సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్నీ అందుబాటులోకి తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
బోగస్ సర్టిఫికెట్లకు ఆన్‌లైన్ చెక్!
Published Wed, May 18 2016 4:11 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement