విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: యూజీసీ గుర్తింపు లేని విద్యాసంస్థలు జారీ చేసిన సర్టిఫికెట్లు ఇటు విద్యాశాఖలో, అటు టీచర్లలో గుబులు రేపుతున్నా యి. గతంలో యూజీసీ గుర్తింపులేని విద్యా సంస్థల నుంచి పొందిన సర్టిఫికెట్ల ఆధారం గా కొందరు ఉపాధ్యాయులు పదోన్నతులు పొందారు. అయితే వీటిలో కొన్ని నకిలీ సర్టిఫికెట్లు కూడా ఉన్నట్టు సమాచారం. ఇలా పదోన్నతులు పొందిన వారిలో జిల్లాలో ప్రస్తుతం 45 మంది క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమ పదోన్నతులపై అప్పట్లో విద్యాశాఖ జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికలను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. 45 మందికి సీఐడీ నోటీసులు కూడా పంపినట్లు సమాచారం. వారంతా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారు. ముందుగా పాలకులు ప్రకటించి ఉంటే ఆయా కళాశాలల్లో దూర విద్య ద్వారా డిగ్రీని పొందేవాళ్లం కాదని సంబంధిత టీచర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో చేపడుతున్న ఉపాధ్యాయుల పదోన్నతి ప్రక్రియపై విద్యాశాఖ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008-09 సంవత్సరంలో జంబో డీఎస్సీని ప్రకటించారు. ఎస్జీటీలకు, నకిలీల గుబులుఅర్హులైన ఉపాధ్యాయులకు జిల్లా పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో అవసరమైన ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం), స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పదోన్నతులకు అవకాశం కల్పించారు. వేల సంఖ్యలో ఉన్న పదోన్నతులను వదులుకోకూడదని భావించినకొందరు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కారు. జిల్లాకు చెందిన కొందరు ఉపాధ్యాయులు రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లోని వినాయకా విద్యామిషన్, రాజీవ్ విద్యాపీఠం వంటి గుర్తింపులేని వర్సిటీల నుంచి బీఎడ్ సర్టిఫికెట్‌తో పాటు పీజీ సర్టిఫికెట్లు పొందారు. మరికొందరు ఏకంగా నకిలీ సర్టిఫికెట్లను సమర్పించి పదోన్నతులు పొందా రు.ఇందులో ముఖ్యంగా ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన వారు అధికంగా ఉన్నారు. భారీ సంఖ్యలో పదోన్నతులు ఉండడంతో సర్టిఫికెట్లపై ఎలాంటి విచారణ జరపకుండానే అప్పట్లో పదోన్నతులు కల్పించా రు. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతి లభించకపోవడంతో అప్పటి రాష్ట్ర పాఠశాల విద్యాసంచాలకులు పూనం మాలకొండయ్యకు వారు ఫిర్యాదు చేశారు.
దీనిపై ఆమె స్పందిస్తూ సర్టిఫికెట్లు నిజమైనవా? నకిలీవా? సర్టిఫికెట్లు జారీ చేసిన యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా... నిగ్గుతేల్చాలని ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అక్రమాలు బయటపడతాయన్న భయంతో తమను కాపాడాలని... అక్రమ పదోన్నతు లు పొందినవారు రాజకీయంగా ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పటి రోశయ్య ప్రభుత్వంపై వచ్చిన ఒత్తిడి కారణంగా విచారణ ఆగిపోయింది. అర్హులైన ఉపాధ్యాయులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో మళ్లీ కదలిక వచ్చింది. ఆ తర్వాత సీఐడీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారులు జరిపిన విచారణలో నకిలీ సర్టిఫికెట్ల గుట్టు బయటపడింది. ఈ మేరకు వారి జాబితాను సీఐడీ అధికారులకు గత ఏడాది అప్పగించారు. అభ్యర్థుల కేసుకు సంబంధించిన నోటీలనుతాజాగా పంపినట్లు తెలుస్తోంది.
అక్రమాలకు తావులేకుండా...
తాజాగా జరుగుతున్న పదోన్నతుల ప్రక్రియలో అక్రమాలకు చోటులేకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ జి.కృష్ణారావు తెలిపారు. ప్రభుత్వం ముందుగా తెలిపిన అనర్హత యూనివర్సిటీ విద్యార్హతల సరిఫికెట్లు తాజా ప్రక్రియలో ఎదురుకాలేదని వివరించారు. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల పేర్లు, వారు పనిచేసే స్థానాల వివరాలను వెల్లడించేందుకు డీఈఓ నిరాకరించారు.