సాక్షి, ఒంగోలు: సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్‌జీటీ)ల నుంచి స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురు ఉపాధ్యాయులపై చీటింగ్, ఫోర్జరీలకు సంబంధించి 420, 468, 471 సెక్షన్‌ల కింద గతనెల 30వ తేదీన సీఐడీ విభాగం రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదు చేసింది. ఈ పదోన్నతుల వ్యవహారం ఇప్పటిది కాకపోయినా కేసులు మాత్రం తాజాగా నమోదయ్యాయి. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాకు చెందిన 82 మంది, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 87 మంది ఉపాధ్యాయులు ఈ కేసులను ఎదుర్కోవాల్సి ఉంది. ప్రకాశం జిల్లాలోని 248 మందికి ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతి కల్పించగా వారిలో 80 మందిపై కేసులు నమోదయ్యాయి. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో పదోన్నతి పొందిన మరో ఇద్దరిపైనా కేసులు దాఖలయ్యాయి. నెల్లూరు జిల్లాలో 272 మంది ఇంగ్లిష్ సబ్జెక్టులో పదోన్నతులు పొందగా వారిలో 87 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్‌జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2000 సంవత్సరం తరువాత పదోన్నతులు లేకపోవడంతో 2009లో ప్రభుత్వం భారీ సంఖ్యలో ప్రమోషన్లు కల్పించింది. అన్ని సబ్జెక్టులకు సంబంధించి పదోన్నతులు ఇచ్చినప్పటికీ ఇంగ్లిషు సబ్జెక్టులో పదోన్నతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అప్పట్లో పదోన్నతి పొందేందుకు అర్హులైన (ఎంఏ, ఇంగ్లిషు) వారు లేకపోవడమే ఇందుకు కారణం. తమ ముందు బ్యాచ్‌లకు చెందిన వారికి భారీగా పదోన్నతులు రావడంతో తమ వంతు వచ్చేసరికి తాము ఉద్యోగంలో ఉంటామో, పదవీ విరమణ చేస్తామో అనే సమస్య పలువురు ఉపాధ్యాయులను వేధించసాగింది. దీంతో ఉపాధ్యాయులకు సంబంధించి అలాంటి వర్గం వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. అనేకమంది చెల్లుబాటు కాని ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల సర్టిఫికెట్లను పొందుపరచడంతో తదుపరి పదోన్నతులు పొందాల్సిన తమకు తీవ్రంగా అన్యాయం జరగనున్నదనేది వారి అభియోగంలోని సారాంశం.
ముఖ్యంగా ఎస్‌జీటీలుగా పనిచేస్తున్నవారు ఇంగ్లిషు సబ్జెక్టుకు సంబంధించి తమిళనాడులోని అన్నామలై, అళగప్ప, మధురై కామరాజ్, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్, ఎంఎస్ యూనివర్సిటీ, వినాయక మిషన్‌ల నుంచి, జేఎన్‌ఆర్‌వీ (రాజస్థాన్), కువెంఫు (కర్నాటక), భోజ్ (మధ్యప్రదేశ్), మగధ (బీహార్) యూనివర్సిటీల నుంచి ఎంఏ (ఇంగ్లిషు) పట్టాలు పొంది వాటిని తమ పదోన్నతులకు జతపరిచారు. పదోన్నతులు కల్పించేటప్పుడు ప్రభుత్వం నుంచి ఇతర రాష్ట్రాల యూనివర్సిటీల నుంచి పొందిన పట్టాలు చెల్లుబాటు కావనే అంశం ఎక్కడా పేర్కొనకపోవడంతో సదరు పట్టాలు పొంది ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్లుగా కొనసాగతున్నవారు ఇదెక్కడి న్యాయమంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా 2009లో ఈ పదోన్నతుల ప్రక్రియ జరిగినప్పటికీ ఈ వివాదం మాత్రం 2010 నుంచి తీవ్రమైంది. అప్పట్లో ఈ వ్యవహారంపై ప్రభుత్వం శాఖాపరంగా చేపట్టిన విచారణ నత్తనడకన సాగడంతో పలువురు ఉప లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో ఉప లోకాయుక్త ఈ వ్యవహారాన్ని సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
14 అంశాలపై విచారణ
విద్యాశాఖ అధికారులు తొలుత నిర్వహించిన విచారణలో సంబంధిత సర్టిఫికెట్లు ఆయా యూనివర్సిటీలు జారీ చేసినవేనని తేలింది. అయితే ఈ విచారణలో 14 అంశాలను కమిటీ వెలుగులోకి తెచ్చింది. దీనిలో భాగంగా ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలకు స్టడీ సెంటర్లు ఆయా రాష్ట్రాలలోనే ఉండాలి. ఉపాధ్యాయులు పీజీ చేసిన కాలంలో ఆ సంస్థలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు ఉండాలి. పరీక్షలు జరిగిన తేదీల్లో ఉపాధ్యాయులు తప్పనిసరిగా సెలవులు పెట్టి ఉండాలి. డిగ్రీకి పీజీకి మధ్య రెండు సంవత్సరాల గ్యాప్ ఉండాలి. పలువురు పదోన్నతి ఉత్తర్వులు ముందుగా తీసుకుని ఆ తరువాత తేదీలలో సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిసింది. మరికొందరు రెండు సంవత్సరాల కాలంలో పూర్తిచేయాల్సిన పీజీని కేవలం ఏడాదిలో (ఒన్ సిట్టింగ్) చదివి ఉన్నట్లు తెలిసింది. రెండేళ్ల పీజీ కోర్సుకు సంబంధించి ఒక ఏడాది ఒక యూనివర్సిటీలో రెండో సంవత్సరం మరో యూనివర్సిటీలో చదివి ఉంటే అలాంటి వారు అనర్హులవుతారు. యూజీసీ గుర్తింపు లేని యూనివర్సిటీలో చదివినవారు, స్కూళ్లలో పనిచేస్తూనే రెగ్యులర్‌గా యూనివర్సిటీకి వెళ్లి పీజీ చేసినట్లుగా సర్టిఫికెట్లు పొందినవారు... ఇలాంటి అంశాలపై సీఐడీ అధికారులు లోతుగా విచారణ చేపట్టనున్నారు. ఈ 14 అంశాలలో అన్నీ సక్రమంగా ఉంటే సరే. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయుల భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
ప్రకాశం జిల్లాలో...
గిద్దలూరు, కందుకూరు, కంభం, జె.పంగులూరు, పొన్నలూరు, దర్శి, అద్దంకి, పెద్దారవీడు, మార్కాపురం, తర్లుపాడు, వలేటివారిపాలెం, కొండపి, టంగుటూరు, బేస్తవారిపేట, లింగసముద్రం, కొనకనమిట్ల, కురిచేడు, సంతనూతలపాడు, దొనకొండ, దోర్నాల, రాచర్ల, నాగులుప్పలపాడు, మర్రిపూడి, ఉలవపాడు, జరుగుమల్లి, చీమకుర్తి, పీసీపల్లి, బల్లికురవ, కొరిశపాడు, సింగరాయకొండ, త్రిపురాంతకం, మార్టూరు, సంతమాగులూరు, మద్దిపాడు మండలాల్లో ఎస్‌జీటీలుగా పనిచేసి ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన 82 మంది ఉపాధ్యాయులపై ఈ కేసులు నమోదయ్యాయి.