నకిలీ పట్టాలకు నిలయంగా మారిన కాలనీ,గంటావురు ఇందిరమ్మ కాలనీలో వెలుగుచూసిన నకిలీ అనుభవ ధ్రువపత్రాలు
పలమనేరు పట్టణంలో ఖాళీ జాగాలకు రెక్కలు వచ్చాయి. కబ్జాదారులు ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వాటికి బోగస్ పట్టాలు సృష్టించి, సదరు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : పలమనేరు పట్టణంలో బోగస్ ఇంటి పట్టాలు కలకలం రేపుతున్నాయి. 400 వరకు బోగస్ ఇంటి పట్టాలు (ఇంటి నివేశ పట్టాలు, అనుభవ ధ్రువపత్రాలు) చెలామణిలో ఉన్నాయని సమాచారం. ఈ పట్టాలతో పలువురు ఇందిరమ్మ కాలనీలు, పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో పక్కా ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. ఇప్పటికీ బోగస్ పట్టాలు అంగట్లో సరుకుల్లా దొరుకుతున్నాయని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిజమేనని గతంలో రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఫైలును ఎవరు తొక్కిపెడుతున్నారు.. ఎందుకు తొక్కిపెడుతున్నారన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇప్పటివరకు బోగస్ పట్టాలతో ప్రభుత్వానికి చెందిన రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది.
పక్కాగా బోగస్ పట్టాలు తయారు చేశారు
ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలు పొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదులో ఆగిన వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల స్కెచ్‌లను రెవెన్యూ సర్వేయర్ల నుంచి బోగస్ పట్టాల ముఠా పొందింది. ఆ మేరకు లే అవుట్లో ఖాళీ ఉన్న బ్లాక్‌లను గుర్తించి, అక్కడ ఏ, బీ అనే సబ్ డివిజన్ నంబర్ల ద్వారా ఒరిజినల్ హద్దులనే పెట్టి పట్టాలు తయారు చేశారు. నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మడంతో ప్లాట్లు స్థలాన్ని స్వాధీనం చేయించడం, ఇంటి నిర్మాణం దాకా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఈ ముఠానే దగ్గరుండి చూసుకుంటుందనే ఆరోపణలున్నాయి.
ఇదెలా సాగుతోందంటే..
గతంలో పలమనేరు తహసీల్దార్లుగా పనిచేసిన నాగమణి, మునాఫ్, రవిచంద్రన్ హయాంలో అప్పటి సర్వేయర్లు, ఆర్‌ఐలు, వీఆర్వోల ద్వారా తహసీల్దార్ కార్యాలయం, తహసీల్దార్ల సీళ్లను కొందరు సంపాదించినట్లు తెలిసింది. కార్యాలయంలోని ఖాళీ ఇంటి అనుభవ నివేశపత్రాలు, పట్టాలను భారీగా జిరాక్స్ చేయిం చుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐదేళ్లుగా రెవెన్యూ కార్యాలయంలోని కాలనీ స్కెచ్‌ల ఆధారంగానే బోగస్ పట్టాల తయారీ జోరుగా సాగినట్టు తెలుస్తోంది. ఈ ముఠాలోని కొందరు సభ్యులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంటి పట్టాగాని, అనుభవ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తే కార్యాలయంలోని వీహెచ్‌ఎస్(విలేజ్ హౌస్‌సైట్ రిజిస్టర్)లో నమోదు కావాలి. కానీ ఇక్కడ అవేమీలేనట్లు సమాచారం.
ఇందులో రెండు ప్రధాన ముఠాలు
ఈ కుంభకోణంలో ఓ రిటైర్డ్ కరణం, ఓ వీఆర్వో, సర్వేయర్ వద్ద పనిచేసిన వెలుగు సర్వేయర్, ఓ ఆర్‌ఐ, నలుగురు బదిలీ అయిన వీఆర్వోలు, నలుగురు మాజీ కౌన్సిలర్లు, పదిమంది రెవెన్యూ బ్రోకర్లు కీలకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం రెండు సెంట్లు కనిపిస్తే వీళ్లు రంగంలోకి దిగి.. దానికి నకిలీ పట్టా తయారు చేయడం జరిగిపోతోంది. సర్వే సైతం వాళ్లే చేసి, హద్దులు చూపి, కొన్న వారికి ఇంటి స్థలాన్ని మూడు రోజుల్లో చేతికిచ్చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో స్థలాలపై అనుభవం కలిగి పట్టాలు లేని వారికి సైతం దొంగపట్టాలను తయారు చేసినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఎఫ్‌ఎంబీ బుక్కులే ఈ ముఠా చేతుల్లో ఉన్నాయంటే వీరు ప్రత్యామ్నాయంగా ఓ తహసీల్దార్ కార్యాలయాన్నే నడుపుతున్నట్లు ఉంది వ్యవహారం.
అధికారుల విచారణలో బయటపడినా..
ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడింది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ నివేదిక విషయం మాత్రం బయటకు రాలేదు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందిం చాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment