ఆర్టీసీలో ‘అన్‌ఫిట్’ గోల్‌మాల్
♦ నకిలీ ధ్రువపత్రాలతో విధులకు కొందరు డ్రైవర్ల ఎగనామం
♦ యథావిధిగా జీతాలు
♦ ఓ అచ్చుతప్పుతో దొరికిపోయిన తీరు
♦ 20 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)లో మరో గోల్‌మాల్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విధులకు ఎగనామం పెడుతూ జీతంలో కోత పడకుండా చూసుకునేందుకు కొందరు డ్రైవర్లు ఆడిన ‘అన్‌ఫిట్’ డ్రామా బట్టబయలైంది. శారీరక సమస్యల కారణంగా డ్రైవర్ విధులను చేపట్టే సామర్థ్యం లేదంటూ ఆర్టీసీ మెడికల్ బోర్డు పేరిట పలువురు నకిలీ అన్‌ఫిట్ ధ్రువపత్రాలు సమర్పించినట్లు అధికారుల విచారణలో నిగ్గుతేలింది.
జీతాలు పెరిగినా విధులకు ఎగనామం...
ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ సిబ్బంది వేతనాలను సవరించడంతో భారీగా పెరిగాయి. సీనియర్ డ్రైవర్ల జీతం రూ. 50 వేలు దాటింది. అయితే సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిందిపోయి కొందరు సిబ్బంది ఏకంగా విధులకు ఎగనామం పెట్టి జీతాలు జేబులో వేసుకునేందుకు పథకం రచించారు. డ్రైవర్‌కు కంటి చూపు ప్రధానం. అలాగే కాళ్లు, చేతులు కూడా సరిగ్గా పనిచేయాలి. సమస్యలున్న వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి లోపాలను తేలుస్తారు. ఒకవేళ శారీరక లోపాలుంటే ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్, ఆర్టీసీ ఆసుపత్రి సూపరింటెండెంట్, మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉండే ఆర్టీసీ మెడికల్ బోర్డు వారికి అన్‌ఫిట్ ధ్రువపత్రాలను జారీ చేస్తుంది. దాన్ని డిపో మేనేజర్లకు సమర్పిస్తే ప్రత్యామ్నాయంగా గ్యారేజీలో శ్రామిక్‌గానో (జీతం రూ. 17 వేలు), డిపోల్లో ఇతర పనులకో అటువంటి వారి సేవలను వినియోగించుకుంటారు. అయితే జీతం మాత్రం డ్రైవర్ స్కేల్ ప్రకారమే చెల్లిస్తారు. దీన్ని అదనుగా చేసుకుని కొందరు బద్ధకస్తులైన డ్రైవర్లు మెడికల్ బోర్డు జారీ చేసినట్టుగా బోగస్ ధ్రువపత్రాలు సృష్టించి డ్రైవర్ విధులకు ఎగనామం పెట్టేశారు.
దొరికిందిలా...
వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఓ డ్రైవర్ దాఖలు చేసిన సర్టిఫికెట్‌లో ‘సూపరింటెండెంట్’ ఆంగ్ల పదంలో అచ్చు తప్పు దొర్లింది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఆర్టీసీ ఆసుపత్రిని వాకబు చేయగా అది నకిలీదని తేలింది. దీంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి ఇటీవల దాఖలైన పలు సర్టిఫికెట్లను పరిశీలించగా వాటిల్లో ఇలాంటి బోగస్‌లు భారీగా ఉన్నట్టు బయటపడింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతోపాటు హైదరాబాద్ పరిధిలో ఇప్పటివరకు ఇటువంటి 20 మందిని గుర్తించిన అధికారులు ఈ గోల్‌మాల్‌పై లోతుగా విచారణ ప్రారంభించారు. గతేడాది దాఖలైన సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు స్థానిక డిపో మేనేజర్లు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారు కూడా రంగంలోకి దిగారు. నకిలీ అన్‌ఫిట్ ధ్రువపత్రాలు సృష్టించిన సూత్రధారి కోసం గాలిస్తున్నారు.