టీఎస్‌ ఆర్టీసీకి రూ.21.72 కోట్లు టోకరా! | - | Sakshi
Sakshi News home page

టీఎస్‌ ఆర్టీసీకి రూ.21.72 కోట్లు టోకరా!

Feb 3 2024 5:38 AM | Updated on Feb 3 2024 8:25 AM

- - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు చెల్లించకుండా మోసం చేసిన కేసులో యాడ్‌ ఏజెన్సీ నిర్వాహకుడు వి.సునీల్‌ను హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లోని యాడ్‌ స్పేస్‌ను వినియోగించుకున్న అతను టీఎస్‌ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఎగవేసినట్లు టీమ్‌–5 ఏసీపీ బి.బాబురావు తెలిపారు. చింతల్‌ ప్రాంతానికి చెందిన సునీల్‌ తన భార్య మృదులతో కలిసి గో రూరల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో యాడ్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.

ఐదేళ్ల క్రితం టెండర్ల ద్వారా టీఎస్‌ ఆర్టీసీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రీజియన్లకు చెందిన యాడ్‌ స్పేస్‌ను పొందాడు. దీనిని వివిధ సంస్థల ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చే ఇతగాడు భారీ మొత్తం ఆర్జించాడు. ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సునీల్‌ ప్రతి నెలా రూ.40 లక్షల చొప్పున సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీనికి ష్యూరిటీగా ముందుగానే రూ.3 కోట్లు ఆర్టీసీ వద్ద డిపాజిట్‌ చేశాడు. తొలినాళ్లల్లో నామమాత్రపు చెల్లింపులు చేసిన సునీల్‌ ఆపై మొండికేశాడు. కోవిడ్‌, లాక్‌డౌన్‌ తదితరాల వల్ల ఆశించిన ఆదాయం రాలేదని, కొన్ని బస్సులు తిరగకపోవడంతో యాడ్స్‌ తగ్గాయని ఆర్టీసీ అధికారులకు చెప్పుకొచ్చాడు. 2021లో రూ.కోటి విలువైన చెక్కులు ఇచ్చినా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అవి బౌన్స్‌ అయ్యాయి.

దీనిపై ఆర్టీసీ అధికారులు సునీల్‌ను సంప్రదించి వివరణ కోరడంతో పాటు చెక్‌బౌన్స్‌ కేసు వేస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో రెండు రీజియన్ల అధికారులకు లేఖలు రాసిన సునీల్‌ చెక్‌బౌన్స్‌పై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని, త్వరలోనే ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సంస్థకు నగదు జమ కావాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు సైతం ఈ మేరకు అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులను సునీల్‌ బేఖాతరు చేయడం మొదలెట్టాడు. ప్రకటనల ద్వారా అతడు మాత్రం ఆదాయం ఆర్జిస్తూ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు ఎగ్గొట్టాడు. దీంతో అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం సునీల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement