Ad agency
-
సినిమా కన్నా యాడ్ ఫిల్మ్‌కే ఎక్కువ కష్టపడాలి
క్రియేటివిటీ.. క్వాలిటీ రెండూ కావాలితక్కువ సమయంలో ఎక్కువ పనిఈ రంగంలో అవకాశాలు పుష్కలంయాడ్ డైరెక్టర్ యమునా కిషోర్ సమయం తక్కువ ఇస్తున్నారు.. సృజన ఎక్కువ ఆశిస్తున్నారు.. యాడ్ ఫిల్మ్ రంగం గురించి ఇలా చెబుతున్నారు యమునా కిషోర్. తెలుగులో సినిమా దర్శకులు అంటే బోలెడన్ని పేర్లు చెప్పగలమేమో గానీ, ప్రచార చిత్రాల దర్శకులు అంటే మనం భూతద్దం పెట్టి వెతకాల్సిందే. అలా వెతికితే దొరికే పేర్లలో ముందుంటారు యమునా కిషోర్. అచ్చతెలుగు ప్రచార చిత్రాల దర్శకుడిగా ప్రస్తుతం ఆయన టాప్ గ్రేడ్‌లో ఉన్నారు. నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, రానా, అఖిల్, రామ్ చరణ్.. వంటి స్టార్స్‌తో వర్క్ చేయడంతో పాటు ఎవరూ ఊహించని విధంగా కె.విశ్వనాథ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, యాంకర్ సుమ.. వంటివారిని యాడ్స్‌లోకి తీసుకొచ్చి ట్రెండ్ సెట్టర్‌గా మారారు. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనుభవాలను పంచుకున్నారు.. ఆ విశేషాలు.. స్వర్గసీమ, సువర్ణభూమి, ఆర్ఎస్ బ్రదర్స్, నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్... వంటి ఎన్నో పేరున్న బ్రాండ్స్‌కి పనిచేశారు యాడ్ డైరెక్టర్ యమునా కిషోర్. దాదాపు 17 ఏళ్ల క్రితం అంటే 2007లో సంస్కారవంతమైన సోప్ ద్వారా ఈ రంగంలోకి వచ్చాను. అప్పటి నుంచీ ప్రతి ఏటా ఏదో ఒక టాప్ యాడ్ రావడం వల్ల అప్పటి నుంచి విజయవంతమైన యాడ్ ఫిల్మ్ మేకర్‌గా ఈ రంగంలో ఉన్నాను. ఇప్పటి వరకూ సెకండ్ ఇన్నింగ్స్ అనేదే లేదు. కేవలం కరోనా సమయంలో తప్ప ఎప్పుడూ ఖాళీగా లేను.అవకాశాలు పుష్కలం...అడ్వరై్టజ్మెంట్స్ రంగం గతం కంటే ఎక్కువ అవకాశాలు అందిస్తోంది. కొత్త కొత్త విభాగాలు వస్తుండడం వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. నటీనటుల మేకప్ కోసం ఒకప్పుడు సినిమా వాళ్లని వినియోగించేవారు. ఇప్పుడు యాడ్ ఫిల్మ్ కోసం ప్రత్యేకంగా నియమించుకుంటున్నారు. అలాగే స్టైలింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్, లాంగ్వేజ్ కో–ఆర్డినేటర్లు, ఇంటిమసీ కో–ఆర్డినేటర్లు, ఫుడ్ స్టైలిస్ట్స్, నెయిల్ క్లోజ్‌గా చూపాలంటే నెయిల్ మోడల్స్, లెగ్స్‌ని క్లోజ్‌గా చూపాలంటే లెగ్ మోడల్స్.. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్లో కూడా అనేక విభాగాల నుంచి అవకాశాలు పెరిగాయి. సెలబ్రిటీతో వర్క్ సంక్లిష్టమైన టాస్్క... సెలబ్రిటీల రెమ్యునరేషన్ భారీగా ఉంటోంది. కాబట్టి..సెలబ్రిటీ ఇచ్చే ప్రతి నిమిషం అత్యంత విలువైనదే. సెలబ్రిటీకి సినిమాల తరహాలోనే యాడ్ ప్లాట్ చెప్పి ఒప్పించాలి. వాళ్లు ఇచ్చిన టైమ్‌లో ఎన్ని వీలైతే అన్ని యాడ్స్ తీసేయాలి. అది యాడ్ ఫిల్మ్ మేకర్‌కి పెద్ద టాస్క్‌గా మారుతోంది. అందుకే చేయి తిరిగిన యాడ్ ఫిల్మ్ మేకర్స్‌నే సెలక్ట్ చేస్తున్నారు. ఉదాహరణకి నేను మహే‹Ùబాబుతో ఓ యాడ్ షూట్ కోసం వర్క్ చేశాను. ఆ యాడ్‌లో భాగంగా షాప్ కీపర్‌తో, పారిశ్రామిక వేత్తలతో, ఓ ఇంట్లో కుటుంబ సభ్యులతో మహేష్ మాట్లాడతారు.. ఇవన్నీ మూడు వేర్వేరు తరహా నేపథ్యాలు కలిగినవి. అయితే ఈ మూడూ ఒకే సమయంలో షూట్ చేయడానికి మూడు సెట్లు ఒకే చోట వేశాం. సెలబ్రిటీలు ఇచ్చిన సమయం వృథా కాకుండా వారి నుంచి గరిష్ట ప్రయోజనం పొందడం ఇందులోని ముఖ్యమైన అంశం. సెలబ్రిటీల్లా.. సంస్థల యజమానులుయాడ్ ఫిల్మ్‌కి సంస్థ యజమానులే మోడల్స్‌గా మారడం అనేది చాలా కాలం క్రితమే మొదలైనా.. లలితా జ్యుయలర్స్ యాడ్ తర్వాత బాగా పెరిగింది. చాలా మంది అదే దారిలో ప్రయత్నం చేస్తున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. ఉదాహరణకు స్వర్గసీమ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన చంద్రశేఖర్ గారి గురించి చెప్పొచ్చు. ఆయనతో మేం రూపొందించిన యాడ్ ఫిల్మ్ కోసం ఒకే రోజు 25 క్యారెక్టర్లు షూట్ చేశాం. ఆయన పూర్తి స్థాయి ప్రొఫెషనల్ ఆరి్టస్ట్లా వరుసగా క్యారెక్టర్లు మారుతున్నా ఏ మాత్రం విసుగు చెందకుండా ప్రతి పాత్రలోనూ లీనమై చేశారు. అలాంటి అంకిత భావం ఉంటే తప్ప సంస్థ యజమాని అయినంత మాత్రాన వాళ్లు చేసిన యాడ్స్ హిట్ కావు. మలచుకుంటేనే.. గెలుచుకుంటాం.. యాడ్ ఫిల్మ్ మేకింగ్‌ని ప్రేమించి రావాలి. కానీ ఈ రంగంలోకి వచ్చేవారిలో సినిమాలకు వెళ్తూ వెళ్లూ మధ్యలో సరదాగానో టైంపాస్గానో చేసేవాళ్లు ఎక్కువ. పూర్తి స్థాయిలో ఈ ఫీల్డ్‌లోనే స్థిరపడాలి అనుకునేవారు తక్కువ. యాడ్ ఫిల్మ్‌కి సినిమా కన్నా ఎక్కువ కష్టపడాలి. రూపొందించే దర్శకుడికి సమాజం పట్ల అవగాహన, సమకాలీన మార్పుల మీద పట్టు అవసరం. ఆధునిక పోకడల్ని అందిపుచ్చుకుంటూ, మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మనల్ని మనం మలచుకుంటూ డైనమిక్‌గా ఉన్నంత కాలం అవకాశాలు పుష్కలంగా వస్తూనే ఉంటాయి. క్రియేటివిటీతో పాటు స్పీడ్ కూడా.. యాడ్ ఫిల్మ్ తయారయ్యాక ప్రదర్శించడానికి ఒకప్పుడు టీవీలు లాంటి ఒకటో రెండో మాత్రమే ఉండేవి. సోషల్ మీడియా ఆగమనం తర్వాత విభిన్న రకాల వేదికలు వస్తున్నాయి. యాడ్స్ రూపకల్పన సమయంలోనే వాటిని ప్రదర్శించే వేదికల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రంగంలో వేగం, అదే సమయంలో సృజనాత్మకత కూడా పెరిగింది. ఇప్పుడు వీక్షకులు ఎక్కువ నిడివి ఉండే యాడ్స్ చూడడం లేదు. కాబట్టి వారిని కొన్ని సెకన్లలోనే ఆకట్టుకునేలా యాడ్ తీయగలగాలి. అదే సమయంలో క్రియేటివిటీ మిస్ కాకుండా చూసుకోవాలి. -
టీఎస్ ఆర్టీసీకి రూ.21.72 కోట్లు టోకరా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు చెల్లించకుండా మోసం చేసిన కేసులో యాడ్ ఏజెన్సీ నిర్వాహకుడు వి.సునీల్‌ను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివిధ ప్రాంతాల్లోని యాడ్ స్పేస్‌ను వినియోగించుకున్న అతను టీఎస్ ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం ఎగవేసినట్లు టీమ్–5 ఏసీపీ బి.బాబురావు తెలిపారు. చింతల్ ప్రాంతానికి చెందిన సునీల్ తన భార్య మృదులతో కలిసి గో రూరల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో యాడ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం టెండర్ల ద్వారా టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లకు చెందిన యాడ్ స్పేస్‌ను పొందాడు. దీనిని వివిధ సంస్థల ప్రకటనల కోసం అద్దెకు ఇచ్చే ఇతగాడు భారీ మొత్తం ఆర్జించాడు. ఆర్టీసీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సునీల్ ప్రతి నెలా రూ.40 లక్షల చొప్పున సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీనికి ష్యూరిటీగా ముందుగానే రూ.3 కోట్లు ఆర్టీసీ వద్ద డిపాజిట్ చేశాడు. తొలినాళ్లల్లో నామమాత్రపు చెల్లింపులు చేసిన సునీల్ ఆపై మొండికేశాడు. కోవిడ్, లాక్డౌన్ తదితరాల వల్ల ఆశించిన ఆదాయం రాలేదని, కొన్ని బస్సులు తిరగకపోవడంతో యాడ్స్ తగ్గాయని ఆర్టీసీ అధికారులకు చెప్పుకొచ్చాడు. 2021లో రూ.కోటి విలువైన చెక్కులు ఇచ్చినా బ్యాంకు ఖాతాలో నగదు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి. దీనిపై ఆర్టీసీ అధికారులు సునీల్‌ను సంప్రదించి వివరణ కోరడంతో పాటు చెక్‌బౌన్స్ కేసు వేస్తామని స్పష్టం చేశారు. ఆ సమయంలో రెండు రీజియన్ల అధికారులకు లేఖలు రాసిన సునీల్ చెక్బౌన్స్పై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవద్దని, త్వరలోనే ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం ఇచ్చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సంస్థకు నగదు జమ కావాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు సైతం ఈ మేరకు అవకాశం ఇచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఆర్టీసీ అధికారులను సునీల్ బేఖాతరు చేయడం మొదలెట్టాడు. ప్రకటనల ద్వారా అతడు మాత్రం ఆదాయం ఆర్జిస్తూ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.21.72 కోట్లు ఎగ్గొట్టాడు. దీంతో అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన పోలీసులు శుక్రవారం సునీల్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
విజయాన్నియాడ్ చేసుకున్నారు...
రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే యువకులు జేబు నిండా డబ్బులతోనో, రకరకాల ఆశలతోనో వస్తారు. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన సుమన్, విజయవాడకు చెందిన చైతన్యలు మాత్రం బుర్ర నిండా ఐడియాలతో వచ్చారు. సృజనాత్మక ఆలోచనలే ఆసరాగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. సినిమాలను ‘నెట్’లో ప్రమోట్ చేయడం అనే ప్రయోగంతో తొలి విజయం సాధించిన సుమన్ (28) చైతన్య (28)లు స్వల్పకాలంలోనే అగ్రస్థాయి యాడ్ ఏజెన్సీగా తమ ‘జాన్‌రైజ్’ను తీర్చిదిద్దారు. ఆ విజయప్రస్థానం గురించి వారి మాటల్లోనే... ‘‘బి.టెక్(సుమన్) ఎం.బి.ఎ (చైతన్య) డిగ్రీలు పుచ్చుకుని హైదరాబాద్‌కు వచ్చాం. ఉద్యోగం వెతుక్కుంటామని ఇంట్లో చెప్పామేగాని నెలవారీ జీతం, నైన్ టు ఫైవ్ జాబ్ దగ్గర ఆలోచనలు ఆగలేదు. ఏదో సాధించాలనే తపనతో తెలిసిన పరిచయాలను ఉపయోగించుకుని సినిమాల్లో ప్రయత్నించాం. అలా మాలో ఒకరు (సుమన్) ‘గమ్యం’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో మా గమ్యం ఏమిటో తెలిసింది. సినిమా ప్రమోషన్‌కి ‘నెట్’వర్క్... నెట్ విప్లవం మొదలైంది. మెయిల్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు బాగా అలవాటవుతున్నాయి. అప్పుడు ‘ సినిమాలకు నెట్లో ప్రచారం’ ఆలోచన వచ్చింది. తేలికగా, చాలా చౌకగా, ప్రభావవంతంగా ప్రచారం చేయవచ్చని భావించాం. ‘ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసే ఖర్చుతో డిజిటల్ మీడియా ప్రచారం మొత్తం పూర్తి చేయవచ్చు’ అని ఒక పెద్ద నిర్మాతకు సలహా ఇవ్వబోతే ఆయన మమ్మల్ని కోపగించుకున్నారు కూడా. ఇలాంటివి ఎదురైనా...మేం వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు హీరో రామ్ నటించిన ‘గణేశ్’కు డిజిటల్ మీడియా ప్రచారం చేసే అవకాశం లభించింది. ఆసక్తి రేకెత్తించేలా సినిమాకు పేజ్ రూపొందించడం, వేలాది ఇ-మెయిల్స్ సేకరించి, వాటి కి ఈ సైట్ లింక్ పంపించడం లాంటివి చేశాం. ఆ ఆలోచన సూపర్‌హిట్ కావడంతో సినిమా ప్రచారంలో సరికొత్త ధోరణి పుంజుకుంది. ‘గణేశ్, బృందావనం, ఖలేజా, రక్తచరిత్ర, గాయం 2...’ ఇలా పలు సినిమాలకు పనిచేశాం. ఆయా సినిమాలకు ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం, డైలీ షూటింగ్ పురోగతి వివరాలు ఇవ్వడం ద్వారా అభిమానులకు ఆసక్తి పెంచేవాళ్లం. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వని ఫొటోలు, కంటెంట్లను ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకుని వాటికి ఆసక్తికరమైన అంశాలను జోడించి పోస్ట్ చేయడంతో నెటిజన్ల ఆసక్తి రెట్టింపు అయ్యేది. అలా అలా ‘రైజ్’ంగ్... సినిమాలకే పరిమితం కాకూడదని ‘జాన్‌రైజ్’ని విభిన్న రంగాలకు విస్తరించాం. సినీరంగం ద్వారా మంచి గుర్తింపు లభించడంతో కార్పొరేట్ కంపెనీలు మా వర్క్ పట్ల ఆసక్తి చూపించాయి. తొలుత మూడున్నర లక్షల రూపాయల పెట్టుబడి, నలుగురు సిబ్బందితో మొదలైన మా సంస్థ దినదినప్రవర్ధమానమైంది. జాన్‌రైజ్ ఫిలిమ్స్, జాన్‌రైజ్ హెల్త్, జాన్‌రైజ్ డిజిటల్, జాన్‌రైజ్ అడ్వర్టయిజింగ్... సేవల్ని బట్టి నాలుగు సంస్థలుగా విభజించుకున్నాం. మాలో ఒకరు (చైతన్య) మార్కెటింగ్, మరొకరు (సుమన్) క్రియేటివ్ సైడ్ చూసుకుంటున్నాం. వైవిధ్యభరితమైన లోగోలు, ప్రకటనలు, బ్రాండింగ్... సేవలతో క్లయింట్స్ సంఖ్యను బాగా పెంచుకోగలిగాం. ఆంధ్రాబ్యాంక్ వంటి బ్యాంకుల దగ్గర్నుంచి జివికె మాల్ వంటి మాల్స్ దాకా... కార్పొరేట్ ఆసుపత్రులు, స్కూల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందిన సంస్థలకు పనిచేస్తున్నాం. సామాజిక బాధ్యతగా... పేపర్‌ను పొదుపుగా వాడమని చెప్పడం కోసం ఒక ప్రచారం చేశాం. దీని కోసం ఒక రూ.1000 నోటులా అనిపించేవి ప్రింట్ చేయించి మా వాలంటీర్ల ద్వారా రోడ్ల మీద పడేయించాం. ‘అరె మీ నోటు పడిపోయిందంటూ’ అనగానే దారిన పోయేవారు ఆ నోటు తీసి జేబులో పెట్టుకున్నారు. ఆ తర్వాత తీసి చూస్తే ఆ నోట్ మీద ఒకసైడ్ మాత్రమే ప్రింట్ చేసి ఉంటుంది. రెండో వైపు ‘‘రెండో వైపు ఉపయోగించకపోతే అది కరెన్సీ అయినా వృథాయే’’ అని రాసి ఉంటుంది. అలాగే ఇటీవల వాలంటైన్స్‌డే సందర్భంగా... ‘నో స్మోకింగ్’ అంటూ ప్రచారం చేశాం. పొగతాగడం మానకపోతే ‘‘ప్రేమించడానికి హృదయం ఉండదు’’ అని పరోక్షంగా చెప్పాం. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలకు మా క్లయింట్లను ఒప్పించి వారితో కలిసి నిర్వహిస్తాం. మూలాలు మరవకుండా... ‘నథింగ్ ఈజ్ అన్క్రియేటివ్’ అనే సిద్ధాంతం మాది. మేం చేసిన వర్క్స్‌కు సంబంధించి పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నాం. బెస్ట్ క్యాప్షన్ అవార్డ్లు కూడా వచ్చాయి. మాలో ఒకరు (సుమన్)కి చిన్నప్పుడు అభిమాననటుడి సినిమా పేర్లు రాసి వాటికింద ట్యాగ్లైన్లు రాయడం అలవాటు. అదే అలవాటు ఇప్పుడు ఆదరణ పొందే అక్షరాలను అల్లేందుకు కారణమవుతోంది. ప్రస్తుతం మా సంస్థ టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరింది. ఒకప్పుడు అమీర్‌పేటలో బ్యాచిలర్ రూమ్‌లో రోజువారీ అద్దెకు కంప్యూటర్లు తెచ్చుకుని వర్క్ చేసుకున్న రోజుల్ని మరిచిపోకుండానే... ఆ కష్టమే స్ఫూర్తిగా అత్యుత్తమ యాడ్ ఏజెన్సీగా ఎదగాలని ఆశిస్తున్నాం. - ఎస్. సత్యబాబు