ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్‌ | Maharashtra housing authority decides to sell open places for hoarding | Sakshi
Sakshi News home page

ప్రకటన కంపెనీల ఆగడాలకు ‘మాడా’ చెక్‌

Published Wed, Feb 19 2025 4:52 PM | Last Updated on Wed, Feb 19 2025 5:32 PM

Maharashtra housing authority decides to sell open places for hoarding

ప్రకటనదారులకు వాటిని అద్దెకివ్వాలని భావిస్తున్న మాడా 

ఖర్చుల తగ్గింపు కోసం నిబంధనలను పక్కనపెడుతున్న కంపెనీలు 

సరైన పునాది, ఇనుప చానెల్స్‌ లేకుండా హోర్డింగుల నిర్మాణం 

మాడా నిర్ణయంతో కంపెనీల ఇష్టారాజ్యానికి బ్రేకులు 

త్వరలో ముంబైవ్యాప్తంగా సొంత స్థలాల్లో స్వయంగా హోర్డింగుల నిర్మాణం 

దాదర్‌: ముంబైవ్యాప్తంగా ఖాళీస్థలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని అద్దెకివ్వాలని మహారాష్ట్ర హౌసింగ్‌ ఏరియా డెవలఫ్‌మెంట్‌ అథారిటీ (మాడా) నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయనుంది. ముంబైసహా ఉప నగరాలలో అనేక చోట్ల మాడాకు సొంత స్ధలాలున్నాయి. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్ధలాల్లో హోర్డింగులు నిర్మించి వాటిని ప్రకటనల కంపెనీలకు అద్దెకు ఇవ్వనుంది. ఇప్పటికే బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) తమ సొంత స్ధలాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రకటనల కంపెనీలకు అనుమతినిచ్చింది. వీటి ద్వారా ఏటా కొన్ని కోట్ల రూపాయలు అదనంగా అర్జిస్తోంది. ఇదే తరహాలో మాడా హోర్డింగులు నిర్మించి అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది.  

హోర్డింగులపై ప్రత్యేక సర్వే... 
గతేడాది వర్షా కాలంలో ఘాట్కోపర్‌లోని చడ్డా నగర్‌లో 80/80 అడుగుల భారీ హోర్డింగ్‌ పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై కూలింది. ఈ ఘటనలో సుమారు 14 మంది చనిపోగా 60పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన మాడా తమ సొంత స్ధలాల్లో ఏర్పాటుచేసిన హోర్డింగులపై సర్వే చేపట్టి వాటి స్ధితి గతులను పరిశీలించింది. ఈ సర్వేలో మొత్తం 62 భారీ హోర్డింగులకు గానూ 50 హోర్డింగులకు మాత్రమే నో అబ్జక్షన్‌ సరి్టఫికెట్‌ ఉందని తేలింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన మిగిలిన 12 హోర్డింగులను నేలమట్టం చేసింది.నిబంధనల ప్రకారం కంపెనీలు హోర్డింగులు ఏర్పాటు చేసే ముందు బీఎంసీ నుంచి కచి్చతంగా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత స్ధలం యజమానిగా మాడా నుంచి ఎన్‌ఓసీ తీసుకోవల్సి ఉంటుంది. కానీ హోర్డింగుల ఏర్పాటుపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. భారీ హోర్డింగుల ఏర్పాటుకు పటిష్టమైన పునాది, బేస్‌మెంట్, ఇనుప చానెళ్లు తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి గాలివేగాన్ని తట్టుకుని నిలబడగలుగుతాయి. 

అయితే కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీలు ఖర్చుల తగ్గింపుకోసం నామమాత్రంగా పునాదులు తవ్వి హోర్డింగులు నిర్మించి ప్రకటనల కంపెనీలకు లీజుకు ఇస్తున్నారు. ఇలాంటి హోర్డింగులు వర్షాకాలంలో వేగంగా వీచే గాలుల తాకిడికి తట్టుకోలేక నేల కూలుతున్నాయి. ఫలితంగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నçష్టం చోటుచేసుకుంటోంది. ఘాట్కోపర్‌లో గతేడాది జరిగిన హోర్డింగ్‌ ప్రమాదానికి ఇదే ప్రధాన కారణమని తేలింది. అనుమతి 40/40 అడుగులకు తీసుకుని రెట్టింపు సైజ్‌( 80/80)హోర్డింగును ఏర్పాటుచేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తమ సొంత స్ధలాల్లో స్వయంగా పటిష్టమైన పునాదులతో, బేస్‌మెంట్‌తో హోర్డింగుల ఇనుప చానెళ్లు నిర్మించి అద్దెకివ్వాలని మాడా భావించింది. 

ఇదీ చదవండి: కంటెంట్‌ క్వీన్స్‌ మ్యాజిక్‌ : ‘యూట్యూబ్‌ విలేజ్‌’ వైరల్‌ స్టోరీ


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement