రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే యువకులు జేబు నిండా డబ్బులతోనో, రకరకాల ఆశలతోనో వస్తారు. కృష్ణాజిల్లా, చల్లపల్లిలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన సుమన్, విజయవాడకు చెందిన చైతన్యలు మాత్రం బుర్ర నిండా ఐడియాలతో వచ్చారు. సృజనాత్మక ఆలోచనలే ఆసరాగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నారు. సినిమాలను ‘నెట్’లో ప్రమోట్ చేయడం అనే ప్రయోగంతో తొలి విజయం సాధించిన సుమన్ (28) చైతన్య (28)లు స్వల్పకాలంలోనే అగ్రస్థాయి యాడ్ ఏజెన్సీగా తమ ‘జాన్‌రైజ్’ను తీర్చిదిద్దారు. ఆ విజయప్రస్థానం గురించి వారి మాటల్లోనే...
‘‘బి.టెక్(సుమన్) ఎం.బి.ఎ (చైతన్య) డిగ్రీలు పుచ్చుకుని హైదరాబాద్‌కు వచ్చాం. ఉద్యోగం వెతుక్కుంటామని ఇంట్లో చెప్పామేగాని నెలవారీ జీతం, నైన్ టు ఫైవ్ జాబ్ దగ్గర ఆలోచనలు ఆగలేదు. ఏదో సాధించాలనే తపనతో తెలిసిన పరిచయాలను ఉపయోగించుకుని సినిమాల్లో ప్రయత్నించాం. అలా మాలో ఒకరు (సుమన్) ‘గమ్యం’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకు అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశారు. సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో మా గమ్యం ఏమిటో తెలిసింది.
సినిమా ప్రమోషన్‌కి ‘నెట్’వర్క్...
నెట్ విప్లవం మొదలైంది. మెయిల్స్ ఇచ్చి పుచ్చుకోవడాలు బాగా అలవాటవుతున్నాయి. అప్పుడు ‘ సినిమాలకు నెట్‌లో ప్రచారం’ ఆలోచన వచ్చింది. తేలికగా, చాలా చౌకగా, ప్రభావవంతంగా ప్రచారం చేయవచ్చని భావించాం. ‘ఒక హోర్డింగ్ ఏర్పాటు చేసే ఖర్చుతో డిజిటల్ మీడియా ప్రచారం మొత్తం పూర్తి చేయవచ్చు’ అని ఒక పెద్ద నిర్మాతకు సలహా ఇవ్వబోతే ఆయన మమ్మల్ని కోపగించుకున్నారు కూడా. ఇలాంటివి ఎదురైనా...మేం వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు హీరో రామ్ నటించిన ‘గణేశ్’కు డిజిటల్ మీడియా ప్రచారం చేసే అవకాశం లభించింది.
ఆసక్తి రేకెత్తించేలా సినిమాకు పేజ్ రూపొందించడం, వేలాది ఇ-మెయిల్స్ సేకరించి, వాటి కి ఈ సైట్ లింక్ పంపించడం లాంటివి చేశాం. ఆ ఆలోచన సూపర్‌హిట్ కావడంతో సినిమా ప్రచారంలో సరికొత్త ధోరణి పుంజుకుంది. ‘గణేశ్, బృందావనం, ఖలేజా, రక్తచరిత్ర, గాయం 2...’ ఇలా పలు సినిమాలకు పనిచేశాం. ఆయా సినిమాలకు ఫేస్‌బుక్ పేజ్ క్రియేట్ చేయడం, డైలీ షూటింగ్ పురోగతి వివరాలు ఇవ్వడం ద్వారా అభిమానులకు ఆసక్తి పెంచేవాళ్లం. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకి ఇవ్వని ఫొటోలు, కంటెంట్‌లను ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకుని వాటికి ఆసక్తికరమైన అంశాలను జోడించి పోస్ట్ చేయడంతో నెటిజన్ల ఆసక్తి రెట్టింపు అయ్యేది.
అలా అలా ‘రైజ్’ంగ్...
సినిమాలకే పరిమితం కాకూడదని ‘జాన్‌రైజ్’ని విభిన్న రంగాలకు విస్తరించాం. సినీరంగం ద్వారా మంచి గుర్తింపు లభించడంతో కార్పొరేట్ కంపెనీలు మా వర్క్ పట్ల ఆసక్తి చూపించాయి. తొలుత మూడున్నర లక్షల రూపాయల పెట్టుబడి, నలుగురు సిబ్బందితో మొదలైన మా సంస్థ దినదినప్రవర్ధమానమైంది. జాన్‌రైజ్ ఫిలిమ్స్, జాన్‌రైజ్ హెల్త్, జాన్‌రైజ్ డిజిటల్, జాన్‌రైజ్ అడ్వర్టయిజింగ్... సేవల్ని బట్టి నాలుగు సంస్థలుగా విభజించుకున్నాం. మాలో ఒకరు (చైతన్య) మార్కెటింగ్, మరొకరు (సుమన్) క్రియేటివ్ సైడ్ చూసుకుంటున్నాం. వైవిధ్యభరితమైన లోగోలు, ప్రకటనలు, బ్రాండింగ్... సేవలతో క్లయింట్స్ సంఖ్యను బాగా పెంచుకోగలిగాం. ఆంధ్రాబ్యాంక్ వంటి బ్యాంకుల దగ్గర్నుంచి జివికె మాల్ వంటి మాల్స్ దాకా... కార్పొరేట్ ఆసుపత్రులు, స్కూల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందిన సంస్థలకు పనిచేస్తున్నాం.
సామాజిక బాధ్యతగా...
పేపర్‌ను పొదుపుగా వాడమని చెప్పడం కోసం ఒక ప్రచారం చేశాం. దీని కోసం ఒక రూ.1000 నోటులా అనిపించేవి ప్రింట్ చేయించి మా వాలంటీర్ల ద్వారా రోడ్ల మీద పడేయించాం. ‘అరె మీ నోటు పడిపోయిందంటూ’ అనగానే దారిన పోయేవారు ఆ నోటు తీసి జేబులో పెట్టుకున్నారు. ఆ తర్వాత తీసి చూస్తే ఆ నోట్ మీద ఒకసైడ్ మాత్రమే ప్రింట్ చేసి ఉంటుంది. రెండో వైపు ‘‘రెండో వైపు ఉపయోగించకపోతే అది కరెన్సీ అయినా వృథాయే’’ అని రాసి ఉంటుంది. అలాగే ఇటీవల వాలంటైన్స్‌డే సందర్భంగా... ‘నో స్మోకింగ్’ అంటూ ప్రచారం చేశాం. పొగతాగడం మానకపోతే ‘‘ప్రేమించడానికి హృదయం ఉండదు’’ అని పరోక్షంగా చెప్పాం. ఇలాంటి సామాజిక అవగాహన కార్యక్రమాలకు మా క్లయింట్లను ఒప్పించి వారితో కలిసి నిర్వహిస్తాం.
మూలాలు మరవకుండా...
‘నథింగ్ ఈజ్ అన్‌క్రియేటివ్’ అనే సిద్ధాంతం మాది. మేం చేసిన వర్క్స్‌కు సంబంధించి పలు సంస్థల నుంచి పురస్కారాలు అందుకున్నాం. బెస్ట్ క్యాప్షన్ అవార్డ్‌లు కూడా వచ్చాయి. మాలో ఒకరు (సుమన్)కి చిన్నప్పుడు అభిమాననటుడి సినిమా పేర్లు రాసి వాటికింద ట్యాగ్‌లైన్లు రాయడం అలవాటు. అదే అలవాటు ఇప్పుడు ఆదరణ పొందే అక్షరాలను అల్లేందుకు కారణమవుతోంది. ప్రస్తుతం మా సంస్థ టర్నోవర్ కోట్ల రూపాయలకు చేరింది. ఒకప్పుడు అమీర్‌పేటలో బ్యాచిలర్ రూమ్‌లో రోజువారీ అద్దెకు కంప్యూటర్‌లు తెచ్చుకుని వర్క్ చేసుకున్న రోజుల్ని మరిచిపోకుండానే... ఆ కష్టమే స్ఫూర్తిగా అత్యుత్తమ యాడ్ ఏజెన్సీగా ఎదగాలని ఆశిస్తున్నాం.
- ఎస్. సత్యబాబు
విజయాన్నియాడ్ చేసుకున్నారు...
Published Wed, Feb 26 2014 11:34 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM
Advertisement