హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలకు మరో గుడ్‌న్యూస్‌.. టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

Published Sun, Jun 11 2023 6:46 AM | Last Updated on Sun, Jun 11 2023 7:34 AM

- - Sakshi

హైదరాబాద్: గండిమైసమ్మ నుంచి హైటెక్‌ సిటీకి వెళ్లేందుకు మియాపూర్‌ వరకు వచ్చి అక్కడి నుంచి మరో బస్సు మారాలి. ఈసీఐల్‌ నుంచి షామీర్‌పేట్‌కు వెళ్లే ప్రయాణికులు సుచిత్ర వద్ద మరో బస్సెక్కాలి. ప్రతి రోజు వేలాది మంది రాకపోకలు సాగించే ఈ రూట్‌లలో రెండు బస్సులు మారాల్సి రావడంతో ప్రయాణికులు సిటీ బస్సులకు ప్రత్యామ్నాయంగా ఆటోలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్క ఈ రెండు మార్గాల్లోనే కాదు.. నగరంలోని అనేక రూట్‌లలో నేరుగా బస్సు సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆర్టీసీ అధ్యయనంలో వెల్లడైంది.

ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌, రద్దీ ఉన్న రూట్‌లలో లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేవిధంగా ఆర్టీసీ అధికారులు కసరత్తు చేపట్టారు. ఇప్పటికే కొన్ని రూట్‌లను పొడిగించి ఈ తరహా బస్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా మరిన్ని రూట్‌లపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, హౌస్‌కీపింగ్‌ సిబ్బంది, ఔటర్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరంలోకి రాకపోకలు సాగించే ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూట్‌ల పొడిగింపును చేపట్టినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు.

సాఫీగా ప్రయాణం..
► జగద్గిరిగుట్ట చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి రోజు వందలాది మంది హౌస్‌కీపింగ్‌ సిబ్బంది ఐటీ సంస్థల్లో పని చేసేందుకు హైటెక్‌ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్‌ వైపు ప్రయాణం చేస్తారు. కానీ ఈ ప్రయాణికులంతా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు వద్ద బస్సులు మారాల్సి ఉంటుంది. ఇందుకోసం రోడ్డు దాటాలి. ఇది చాలా మంది మహిళా ప్రయాణికులకు ఎంతో ఇబ్బందిగా ఉన్నట్లు ఆర్టీసీ గుర్తించింది. జగద్గిరిగుట్ట నుంచి నేరుగా ఐటీ కారిడార్‌లకు చేరుకొనేలా బస్సులను నడిపేందుకు చర్యలు చేపట్టారు.

► ఈసీఐఎల్‌ నుంచి మేడ్చల్‌, షామీర్‌పేట్‌లకు వెళ్లేందుకు గతంలో రెండు బస్సులు మారాల్సి ఉంది. దీంతో ఈసీఐల్‌ నుంచి రెండు వైపులా నేరుగా వెళ్లేందుకు బస్సులను అందుబాటులోకి తెచ్చారు. ఉప్పల్‌ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లే బస్సులు ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా మెహిదీపట్నం చౌరస్తాలో మలుపు తిప్పుకోవడం ఎంతో కష్టంగా మారింది. మరోవైపు మెహిదీపట్నం నుంచి మంచిరేవుల వైపు వెళ్లేవారు రెండు బస్సులు మారాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉప్పల్‌–మెహిదీపట్నం (113ఎం) బస్సులను కొన్నింటిని మంచిరేవుల వరకు పొడిగించారు. ఈ బస్సులు బోడుప్పల్‌ కాలనీ నుంచి మంచిరేవుల (113/120ఎం) వరకు నేరుగా రాకపోకలు సాగిస్తాయి. బోడుప్పల్‌ నుంచి నేరుగా నానల్‌నగర్‌, షేక్‌పేట్‌, పుప్పాలగూడ, మంచిరేవుల వరకు వెళ్లే ప్రయాణికులు ఈ బస్సులను వినియోగించుకోవచ్చు.

► లింగంపల్లి నుంచి నల్లగండ్ల మీదుగా క్యూసిటీ వరకు మరో కొత్త రూట్‌ను సైతం ఎంపిక చేశారు. మేడ్చల్‌ వైపు నుంచి ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు మెహిదీపట్నం వరకు ప్రయాణం చేస్తున్నారు. కానీ.. సికింద్రాబాద్‌లో దిగి మెహిదీపట్నం బస్సెక్కాల్సి ఉంటుంది. పద్మవ్యూహాన్ని తలపించే సికింద్రాబాద్‌ ట్రాఫిక్‌ వలయాన్ని దాటుకొని బస్సెక్కేందుకు ప్రయాణికులు చాలా కష్టపడాల్సివస్తోంది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు మేడ్చల్‌ నుంచి బేగంపేట్‌ మీదుగా మెహిదీపట్నానికి డైరెక్ట్‌ బస్సును ప్రవేశపెట్టారు.

ఔటర్‌కు అందుబాటులో..
► శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వరకు ఇటు ఘట్కేసర్‌ నుంచి మేడ్చల్‌ వరకు ఔటర్‌కు ఆనుకొని ఉన్న కాలనీలను, గ్రామీణ ప్రాంతాలను కనెక్ట్‌ చేసేవిధంగా బస్సులను నడిపేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

► సర్వీస్‌రోడ్డు మార్గాల్లో సిటీ బస్సులను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులకు నిరాటంకమైన రవాణా సదుపాయం లభించనుంది. ‘ఉబెర్‌. ఓలా వంటి సదుపాయాల వల్ల చాలా వరకు ప్రయాణికులు నేరుగా గమ్యానికి చేరుకొనేందుకే మొగ్గు చూపుతున్నారు. మారిన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని ఒక అధికారి వివరించారు.

స్కూల్‌ వేళలకు అనుగుణంగా 2 వేల ట్రిప్పులు
ఈ నెల 12వ తేదీ సోమవారం నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. విద్యార్థుల డిమాండ్‌ మేరకు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. పిల్లలు ఉదయం స్కూళ్లకు వెళ్లేందుకు సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు వీలుగా బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ వెంకన్న తెలిపారు. సికింద్రాబాద్‌ రీజియన్‌లో ప్రతి రోజు సుమారు వెయ్యి ట్రిప్పులను అదనంగా నడపనున్నారు. హైదరాబాద్‌ రీజియన్‌లోనూ మరో వెయ్యి ట్రిప్పులను నడుపుతారు. ఉద యం 7 నుంచి 9 గంటల వరక తిరిగి మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement