సాక్షి, అనంతపురం : వక్రమార్గంలో ఉపాధ్యాయ పోస్టులు దక్కించుకోవాలని చూశారు. లేని వైకల్యాన్ని ఉన్నట్లు చూపించి అధికారులను బురిడీ కొట్టించారు. అయితే వారి భాగోతం మెడికల్ బోర్డులో బయటపడింది. ఈ అక్రమ వ్యవహారం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. బోగస్ సర్టిఫికెట్లతో బధిరుల కోటాలో ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులకు చెక్ పడింది.
వివరాల్లోకి వెళ్తే...డీఎస్సీ–18లో స్కూల్ అసిస్టెంట్ గణితం సబ్జెక్టులో కె.అనసూయ, కె.చంద్రమౌళి, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్.మాధవిలత, పి.విజిత, సోషల్ సబ్జెక్టులో టి.నారాయణస్వామి బధిరుల (హెచ్‌ఐ) కేటగిరీలో ఉద్యోగాలు పొందారు. జిల్లాస్థాయిలో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ పూర్తయింది. పి. విజిత మాత్రం అనారోగ్య కారణంగా మెడికల్ బోర్డుకు ఇంకా వెళ్లలేదు. తక్కిన నలుగురు గత నెల(సెప్టెంబరు) 19 నుంచి 23 దాకా మెడికల్ బోర్డు వైజాగ్ ఈఎన్‌టీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అక్కడి వైద్యులు కంప్యూటర్ ద్వారా బేరా పరీక్షలు నిర్వహించడంతో వీరి బండారం బయటపడింది. టి.నారాయణస్వామి మినహా తక్కిన ముగ్గురు అభ్యర్థుల వినికిడి లోపం బోగస్ అని తేలింది. విశాఖ నుంచి దిమ్మతిరిగే రిపోర్ట్ జిల్లాకు రావడంతో అభ్యర్థులు ఖంగుతిన్నారు.
‘0’ శాతం కూడా వైకల్యం లేదు
గణితం సబ్జెక్టులో ఎంపికైన కె.అనసూయకు విశాఖపట్నం మెడికల్‌బోర్డు నిర్వహించిన బేరా టెస్ట్‌లో ‘0’ శాతం ఉన్నట్లు తేలింది. అంటే సాధారణ వ్యక్తుల్లాగా ఉన్నట్లే. ఈమె 51–55 (రెండు చెవులు) శాతం వినికిడిలోపం ఉన్నట్లు డీఎస్సీకు దరఖాస్తు చేసుకుంది. 50 శాతం పైగా వినికిడి లోపం ఉన్నట్లు ఎస్‌వీఆర్‌ఆర్ జీజీ ఆస్పత్రి తిరుపతి వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్ పొందుపరిచింది. మరో అభ్యర్థి కె.చంద్రమౌళికి ‘5’ శాతం వినికిడి లోపం ఉన్నట్లు బేరా టెస్ట్‌లో తేలింది. ఈయన కూడా 51–55 (రెండు చెవులు) శాతం వినికిడి లోపం ఉన్నట్లు డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నాడు. 53 శాతం చెవుడు ఉన్నట్లు అనంతపురం మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జత చేశాడు.
ఫిజికల్ సైన్స్‌లో మాధవీలతకు ‘0’ శాతం
ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులో ఎస్.మాధవీలతకు ‘0’ శాతం వినికిడి లోపం ఉన్నట్లు మెడికల్ బోర్డులో తేలింది. ఈమె తనకు ఏకంగా 70 శాతం పైబడి వినికిడి లోపం ఉన్నట్లు డీఎస్సీకి దరఖాస్తు చేసుకుంది. 76 శాతం వినికిడి లోపం ఉన్నట్లు కడప రిమ్స్ ఆస్పత్రి వైద్యులు జారీ చేసిన సర్టిఫికెట్ పొందుపరిచింది. సోషల్ సబ్జెక్టులో దరఖాస్తు చేసుకున్న టి.నారాయణస్వామి అనే అభ్యర్థి 70 శాతం వినికిడి లోపం ఉన్నట్లు విశాఖ మెడికల్ బోర్డు ధ్రువీకరించింది. అనారోగ్య కారణంగా హాజరుకాలేకపోయిన ఫిజికల్‌సైన్స్ సబ్జెక్టు అభ్యర్థిని పి.విజిత పరీక్షలకు బోర్డుకు వెళ్లాల్సి ఉంది. కాగా బోగస్ సర్టిఫికెట్లు జతచేసి ఉద్యోగాలు పొందాలని చూసిన అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే యోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నారు. దీనిపై స్పష్టత కోసం కమిషనర్‌కు రాసి అక్కడి నుంచి రాగానే చర్యలు తీసుకోనున్నారు.
భయం లేకనే దరఖాస్తు
వికలాంగ కేటగిరిల్లో బోగస్ సర్టిఫికెట్లు జత చేసి సులువుగా ఉద్యోగాలు పొందవచ్చనే భావనలో చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ‘దొరికితే దొంగ, దొరక్కపోతే దొర’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. స్థానిక ఉన్న వైద్యులకు డబ్బు ఎర చూపించి లేని వైకల్యం ఉన్నట్లు బోగస్ ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. మెడికల్ బోర్డులో కూడా తమ ‘ప్రత్యేక రూటు’లో పని చేయించుకోవచ్చని ధీమాతో దరఖాస్తు చేసుకుంటున్నారు. గతంలో పలువురు అభ్యర్థులు ఇదే తరహాలో ఉద్యోగాలు పొందారు. భోగస్ అని తేలిన తర్వాత కూడా కఠిన చర్యలు లేకపోవడంతో వీరి ఆగడాలకు అడ్డుపడడం లేదు. భోగస్ అభ్యర్థుల కారణంగా నిజంగా అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment