అనంతపురం సప్తగిరి సర్కిల్ : డీఎస్సీకి అర్హత సాధించే వరకు తామూ విశ్రమించబోమని 2012-14 డీఎడ్ విద్యార్థుల డీఎస్సీ అర్హత సాధన కమిటీ నాయకులు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో జరిగే డీఎస్సీకి అవకాశం కల్పించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డీఎడ్ విద్యార్థులతో ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్, సంగమేష్‌నగర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు.
ధర్నానుద్దేశించి కమిటీ జిల్లా అధ్యక్షుడు గణేనాయక్, ఉపాధ్యక్షుడు మను మాట్లాడుతూ 2012లో జూలైలో జరగాల్సిన కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది మేలో పూర్తి కావాల్సిన కోర్సు ఆలస్యమైందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు మూడు రోజుల ముందు తమ కోర్సు పూర్తవుతుందని, అయినా డీఎస్సీకి అనుమతించకపోవడం దారుణమన్నారు. తప్పు ప్రభుత్వం చేసి శిక్ష మాకు వేస్తారా అంటూ ప్రశ్నించారు. టెట్ రద్దు చేస్తామని గతంలో ప్రకటించి.. ఇప్పుడేమో రాబోవు డీఎస్సీ నోటిఫికేషన్‌లో టెట్ పాస్ అయిన వారే అర్హులని చెబుతున్నారన్నారు. ఆరు నెలలకోసారి జరపాల్సిన టెట్ ఏడాది కావస్తున్నా జరపడం లేదన్నారు.
డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 23న సమావేశమై భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. దాదాపు గంట పాటు ధర్నా సాగింది. అనంతరం ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ శివరామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శులు మల్లికార్జున, పెద్దయ్య, తిరుపతయ్య, అశోక్, ప్రధాన కార్యదర్శి సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనకు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం మద్దతు
డీఎడ్ విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుంతరెడ్డి, గోపీనాథ్, రంగనాయకులు మద్దతు తెలిపారు. చింతాసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ డీఎడ్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు మారాలన్నారు. 2012-14 డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టెట్ క్వాలిఫై కాని వారు డీఎస్సీకి అనర్హులంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం అనాలోచిత చర్యగా పేర్కొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, ఇతర నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు.
డీఎస్సీ అర్హత సాధించే దాకా విశ్రమించం
Published Tue, Jul 22 2014 4:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement