DSC-14
-
98 పోస్టులకు 89 మంది ఓకే !
► స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితా విడుదల ► తొమ్మిది పోస్టులకు అభ్యర్థులు లేరు ► నేడు సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం ఎడ్యుకేషన్ : కలెక్టర్ కోన శశిధర్ ఆమోదంతో డీఈవో అంజయ్య గురువారం డీఎస్సీ-14 స్కూల్ అసిస్టెంట్ల సెలక్షన్ జాబితాను అధికారికంగా ప్రకటించారు. 98 పోస్టులకు 89 మంది ఓకే అయ్యారు. మిగిలిన తొమ్మిది పోస్టులకు ఆయా కేటగిరీల్లో అభ్యర్థులు లేరు. ఇందులో ఎస్ఏ ఇంగ్లిష్ ఒక పోస్టు (వీహెచ్ మహిళ), సంస్కృతంలో రెండు పోస్టులు (ఓసీ మహిళ, ఎస్సీ మహిళ), ఎస్ఏ గణితంలో ఒక పోస్టు (హెచ్‌హెచ్ మహిళ), ఎస్ఏ గణితం ఉర్దూ మీడియంలో మూడు పోస్టులు (మహిళ), ఎస్ఏ ఫిజికల్సైన్స్లో ఒక పోస్టు (వీహెచ్ మహిళ)కు అభ్యర్థులు లేరు. పీఈటీ పోస్టులకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందలేదని డీఈఓ తెలిపారు. నేడు సర్టిఫికెట్ల పరిశీలన సెలక్షన్ జాబితాలోని అభ్యర్థుల సెల్ఫోన్లకు రాష్ట్ర అధికారుల నుంచి ఇప్పటికే మెసేజ్‌లు వెళ్లాయి. వారికి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్థానిక గిల్డ్‌ఆఫ్ సర్వీస్ స్కూల్ (ఇంగ్లిష్ మీడియం, రైతు బజారు వీధి)లో సర్టిఫికెట్లు పరిశీలన ఉంటుందని డీఈఓ తెలిపారు. స్టడీకి సంబంధించి అన్ని సర్టిఫికెట్లు ఒరిజనల్‌తో పాటు రెండు సెట్ల జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని సూచించారు. ఓ సీడీలో సర్టిఫికెట్లు స్కాన్ చేసి తీసుకురావాలన్నారు. ఏదైనా కారణాల వల్ల తొలిరోజు హాజరుకాలేకపోయిన అభ్యర్థులకు శనివారం కూడా సర్టిఫికెట్లు పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు. -
ఆ ఐదూ నకిలీనే!
► డీఈఓ కార్యాలయూనికి చేరిన ఐదుగురి బధిరుల ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ► కుల ధ్రువీకరణపై నాన్చుడి ధోరణి ► తహశీల్దార్ కార్యాలయాల గడప దాటని నివేదికలు ► ఆందోళన చెందుతున్న అభ్యర్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-14 ఎంపిక జాబితాలోని ‘నకిలీల’ పుట్ట పగులుతోంది. ఇటీవలే 14 మందిని నకిలీలుగా తేల్చిన అధికారులు.. వారిని ఎంపిక జాబితా నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో ఎనిమిది మంది చేరారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల 8 మంది బోగస్ స్టడీ సర్టిఫికెట్లు, నలుగురు మాజీ సైనిక కోటా కింద, ఒకరు స్థానిక, మరొకరిని విద్యార్హత ధ్రువీకరణలో తేడా వల్ల తొలగించారు. ఐదూ నకిలీనే... బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థుల విషయం మరోసారి చర్చనీయాంశం కానుంది. 2008 డీఎస్సీని నకిలీ బధిరులు కుదిపేశారు. ఈసారీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బధిరుల కోటా కింద ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. అదికూడా వైకల్యం 70 శాతానికి పైబడిన అభ్యర్థులే అర్హులు. ఈ డీఎస్సీలో సుమారు 20 మంది బధిరుల కోటా కింద ఎంపికయ్యారు. ధ్రువీకరణ పత్రాలపై నివేదికలు ఒక్కొక్కటిగా డీఈఓ కార్యాలయానికి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఐదుగురు అభ్యర్థుల ధ్రువీకరణపత్రాలు వచ్చాయి. ఈ ఐదుగురూ అనర్హులుగా తేలింది. వీరికి 30-50 శాతం మాత్రమే వైకల్యమున్నట్లు తెలిసింది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తహశీల్దార్లు కుల ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన నివేదికలు తహశీల్దార్ కార్యాలయాల గడప దాటడం లేదు. నాన్చుడు ధోరణి అవలంబిస్తుండటంతో విద్యాశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గుత్తి నుంచి ఇద్దరు అభ్యర్థులు రెసిడెన్షియల్, యల్లనూరు నుంచి ఒకరు, బుక్కపట్నం నుంచి మరో అభ్యర్థి కుల ధ్రువీకరణ, అనంతపురం నుంచి ఒక అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్‌పై నివేదికలు కోరుతూ విద్యాశాఖ అధికారులు లేఖలు రాశారు. వీటిలో గుత్తి నుంచి రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు వచ్చాయి. ఇవి అర్హత కల్గినవిగా తెలిసింది. అనంతపురం నుంచి ఓ అభ్యర్థి స్టడీ సర్టిఫికెట్ బోగస్ అని నివేదిక వచ్చింది. ఇక యల్లనూరు, బుక్కపట్నం తహశీల్దార్ కార్యాలయాల నుంచి కుల ధ్రువీకరణపత్రాల నివేదికలు రావాల్సి ఉంది. ఈ రెండింటిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు వెంట పడుతున్నా.. రెవెన్యూ అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో జాబితాలో తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అనర్హులను తొలగిస్తే తమకు అవకాశం వస్తుందనే ఆశతో రోజూ డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 22 మంది బోగస్ బోగస్ అభ్యర్థుల జాబితా 22కు చేరింది. ఇటీవల 14 మంది జాబితాను అధికారులు ప్రకటించారు. తాజాగా మరో ఎనిమిది బోగస్‌గా తేలింది. ఐదుగురు బధిరుల సర్టిఫికెట్లు, ఒకరు బోగస్ స్టడీ సర్టిఫికెట్, ఇద్దరు బోగస్ కుల ధ్రువీకరణపత్రాలు జత చేసినట్లు తెలిసింది. అయితే.. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులు అధికారంగా వెల్లడించాల్సి ఉంది. -
ప్చ్..! డీఎస్సీకి ఎంపికైన ఓసీ అభ్యర్థులు ఇద్దరే!
శ్రీకాకుళం : డీఎస్సీ-14లో ఓసీ కేటగిరీలో జిల్లా నుంచి ఇద్దరు అభ్యర్థులే ఎంపికయ్యారు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం 420 ఎస్జీటీ, పండిట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించగా...ఇందులో 320 పోస్టులకు మాత్రమే అర్హులుండగా.. వంద బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. 320 పోస్టుల్లో సుమారు 140 వరకు ఓసీ కేటగిరీ పోస్టులు ఉండగా, ఇందులో ఏడుగురు మాత్రమే అగ్రకులాలవారు ఎంపికయ్యారు. వీరిలో జిల్లాకు చెందినవారు ఇద్దరే కావడం విశేషం. హిందీ పండిట్ పోస్టుల్లో మాత్రం ఐదుగురు ఎంపికవ్వగా .. వీరంతా ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. కారణాలను పరిశీలిస్తే జిల్లాలో ఉన్న వారిలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ, తెలగ, ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన రెడ్డి, కమ్మ, క్షత్రియులు మాత్రమే అగ్రకులాలకు చెందినవారు. జిల్లా జనాభాలో వీరిశాతం 15 వరకు ఉంది. వీరి నుంచి ఎంపికైనవారు తక్కువగా ఉన్నారు. పోస్టుల భర్తీలో మరింత జాప్యం! రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5 నాటికి డీఎస్సీ-14లోని ఎస్జీటీ తెలుగు పండిట్ పోస్టులను భర్తీలు చేస్తామని చెప్పినప్పటికీ దీనిలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని పరిశీలన పూర్తిచేసి, అభ్యంతరాలు స్వీకరించి అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించే గడువు షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. అయితే నేటికీ తుది జాబితా విడుదల కాకపోవడంతో భర్తీల్లో మరో 15, 20 రోజులు పట్టే అవకాశాలున్నాయి. వికలాంగుల కేటగిరీ నుంచి ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనను హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు పంపించారు. వారు తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26 వ తేదీలోగా రావాలని ఆదేశించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. భర్తీ కాకుండా ఉండిపోయిన మాజీ సైనిక కేటగిరీలో ఓసీ అభ్యర్థులు డీఎస్సీ-14లో భర్తీ కాకుండా ఉండిపోయిన నాలుగు మాజీ సైనిక కేటగిరీ పోస్టులను ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీచేయనున్నారు. మిగిలిన కేటగిరీల పోస్టులకు అర్హులు లేకుంటే బ్యాక్‌లాగ్‌గా ఉండిపోతాయి. అయితే మాజీ సైనిక కేటగిరీకి అభ్యర్థులు లభించని పక్షంలో ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఓసీ అభ్యర్థులతో ఈ నాలుగు పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిశ్చయించారు. జాబితాలు మారుతాయా? ఇప్పటికే అర్హుల జాబితా విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయగా ఈ జాబితాలు మారుతాయనే సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మాజీ సైనిక కేటగిరీని ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసిన పక్షంలో జాబితా మారే అవకాశాలుంటాయి. ఓసీ కేటగిరీ ఎంపికలు పూర్తయిన తరువాత ఉన్న అభ్యర్థుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, వికలాంగ అభ్యర్థులను ఆయా కేటగిరీలకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా మాజీ సైనిక కేటగిరీ కోసం ఓసీ కేటగిరీ తరువాత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తే మిగిలిన కేటగిరీల అభ్యర్థుల పేర్లు మారే అవకాశాలున్నాయి. అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి. -
ఇదేం పద్ధతి?
అనంతపురం ఎడ్యుకేషన్ :డీఎస్సీ-14కు దరఖాస్తు చేసే క్రమంలో కొందరు అభ్యర్థులు తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టాల్సిన వీరే.. ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లో వెళుతుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. డీఎస్సీకి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్ట్కాపీలను అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో అందజేయాల్సి ఉంటోంది. కొందరు అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్లు అందజేసే క్రమంలో ఆయా స్కూళ్ల హెచ్ఎంల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు మండలానికి చెందిన ఓ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. హార్ట్‌కాపీలు అందజేసేందుకు జూనియర్ కళాశాలలోని కేంద్రానికి వచ్చాడు. 1-4 తరగతి వరకు ఒక స్టడీ సర్టిఫికెట్, 6-10వ తరగతి వరకు మరో స్టడీ సర్టిఫికెట్ జమ చేశాడు. 5వ తరగతి మాత్రం కనబరచలేదు. దరఖాస్తు పరిశీలించిన సిబ్బంది 5వ తరగతి ప్రైవేట్‌గా చదివినట్లు నమోదు చేస్తామని సూచించారు. దీంతో సదరు అభ్యర్థి ‘లేదు లేదు.. 5వ తరగతి కూడా అదే పాఠశాలలో చదివా’నంటూ సర్టిఫికెట్లో కనబరిచిన స్కూల్ గురించి ప్రస్తావించాడు. మరి ఇందులో ఎందుకు ప్రస్తావించలేదని, సంబంధిత పాఠశాల హెచ్ఎంతో రాయించుకుని రావాలని సిబ్బందిలో ఒకరు సూచించారు.అయితే.. ఆ అభ్యర్థి సిబ్బంది ఎదుటనే ఇదివరకే ఇచ్చిన సర్టిఫికెట్ వెనక్కు తీసుకుని అందులో కరెక్షన్ (4వ తరగతి ఉండేది 5వ తరగతి) చేసి ఇచ్చాడు. అదేంటి?! హెచ్ఎం చేయాల్సిన పనిని నువ్వే చేస్తున్నావంటూ ప్రశ్నించగా.. అందుకు ఆ అభ్యర్థి ‘అవునా...’ అంటూ ఓ స్టడీ పేపరులో 1-5 వరకు చదివినట్లు రాసి ఆయనే సంతకం చేసి, పాఠశాల సీలు కూడా వేసి ఇచ్చాడు. ‘భవిష్యత్తులో కాబోయే టీచరు..మీరే ఇలా చేస్తే ఎలా అంటూ’ ఓ ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. అంతే అప్పటికే కాకమీద ఉన్న ఆ అభ్యర్థి నోటివెంట బూతుపురాణం వచ్చింది. ఇందుకు కోపోద్రిక్తుడైన ఆ ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నారు. ఇద్దరి మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పంచాయితీ చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన వారే అనవసరంగా రచ్చ చేశారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనను కులం పేరుతో దూషించి దాడి చేశాడంటూ సదరు నిరుద్యోగ అభ్యర్థి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విద్యాశాఖ సిబ్బంది, కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా నిరుద్యోగ అభ్యర్థి పక్షానే నిలబడడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. చివరకు సదరు ఉపాధ్యాయుడే కొంత డబ్బు చెల్లించి రాజీ చేసుకోవాల్సి వచ్చింది. సర్టిఫికెట్ ఫోర్జరీ చేసిన వైనంపై ప్రశ్నించిన పాపానికి తన జేబుకే చిల్లుపడిందంటూ సదరు ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. -
డీఎస్సీ అర్హత సాధించే దాకా విశ్రమించం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : డీఎస్సీకి అర్హత సాధించే వరకు తామూ విశ్రమించబోమని 2012-14 డీఎడ్ విద్యార్థుల డీఎస్సీ అర్హత సాధన కమిటీ నాయకులు స్పష్టం చేశారు. సెప్టెంబర్‌లో జరిగే డీఎస్సీకి అవకాశం కల్పించాలంటూ సోమవారం కలెక్టరేట్ ఎదుట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డీఎడ్ విద్యార్థులతో ఎస్ఎస్బీఎన్ కళాశాల నుంచి సప్తగిరి సర్కిల్, సంగమేష్‌నగర్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. ధర్నానుద్దేశించి కమిటీ జిల్లా అధ్యక్షుడు గణేనాయక్, ఉపాధ్యక్షుడు మను మాట్లాడుతూ 2012లో జూలైలో జరగాల్సిన కౌన్సెలింగ్ ఆలస్యం కావడంతో ఈ ఏడాది మేలో పూర్తి కావాల్సిన కోర్సు ఆలస్యమైందన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు మూడు రోజుల ముందు తమ కోర్సు పూర్తవుతుందని, అయినా డీఎస్సీకి అనుమతించకపోవడం దారుణమన్నారు. తప్పు ప్రభుత్వం చేసి శిక్ష మాకు వేస్తారా అంటూ ప్రశ్నించారు. టెట్ రద్దు చేస్తామని గతంలో ప్రకటించి.. ఇప్పుడేమో రాబోవు డీఎస్సీ నోటిఫికేషన్లో టెట్ పాస్ అయిన వారే అర్హులని చెబుతున్నారన్నారు. ఆరు నెలలకోసారి జరపాల్సిన టెట్ ఏడాది కావస్తున్నా జరపడం లేదన్నారు. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు 23న సమావేశమై భవిష్యత్ కార్యచరణ రూపొందిస్తామన్నారు. దాదాపు గంట పాటు ధర్నా సాగింది. అనంతరం ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజావాణిలో కలెక్టరేట్ ఏఓ శివరామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కమిటీ కార్యదర్శులు మల్లికార్జున, పెద్దయ్య, తిరుపతయ్య, అశోక్, ప్రధాన కార్యదర్శి సూర్యశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆందోళనకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం మద్దతు డీఎడ్ విద్యార్థుల ఆందోళనకు వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హనుంతరెడ్డి, గోపీనాథ్, రంగనాయకులు మద్దతు తెలిపారు. చింతాసోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ డీఎడ్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ తీరు మారాలన్నారు. 2012-14 డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. టెట్ క్వాలిఫై కాని వారు డీఎస్సీకి అనర్హులంటూ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం అనాలోచిత చర్యగా పేర్కొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోటా సత్యం, ఇతర నాయకులు ఆందోళనకు మద్దతు తెలిపారు. -
డీఎస్సీ-14లో మాకూ ఛాన్స్ ఇవ్వాలి
బాలాజీ చెరువు(కాకినాడ) : త్వరలో వెలువడనున్న డీఎస్సీ-14లో తమకూ అవకాశం కల్పించాలంటూ సోమవారం డీఎడ్(డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్) ద్వితీయ సంవత్సర అభ్యర్థులు నినాదాలు చేశారు. ముందుగా వారు మెయిన్‌రోడ్డులోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, కార్యాలయ ఏడీ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం విద్యార్థులందరూ అక్కడి నుంచి ర్యాలీగా మసీదు సెంటర్ నుంచి బాలాజీ చెరువు మీదుగా జీజీహెచ్ నుంచి కలెక్టరేట్‌కు చేరుకుని అక్కడ నినాదాలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి 2008 డీఎస్సీ పోస్టుల్లో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థులకు అవకాశం కల్పించారని, అదే పద్ధతి 2012లోనూ కొనసాగించారన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని అన్నారు. అనంతరం యూటీఏఫ్ భవనంలో డీఎడ్ ద్వితీయ సంవత్సర అభ్యర్థుల సంఘ అధ్యక్షుడిగా నక్కా పాండురంగారావు, ఉపాధ్యక్షుడిగా కె.రాజు, ప్రధాన కార్యదర్శిగా ఎం.శివసాయిప్రసాద్, కోశాధికారిగా ముమ్మిడి సతీష్, కార్యదర్శిగా బి.హరీష్, కార్యవర్గ సభ్యులుగా పి.అప్పలసూరి, డి.మురళీకృష్ణ, రవితేజ, సతీష్‌కుమార్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి సుబ్బరాజు, పీఆర్టీయూ అధ్యక్ష, కార్యదర్శులు పి.వి.వి సత్యనారాయణ,చింతాడ ప్రదీప్‌కుమార్‌తో పాటు దాదాపు రెండువేల మంది డీఎడ్ విద్యార్థులు పాల్గొన్నారు.