ఇదేం పద్ధతి?
అనంతపురం ఎడ్యుకేషన్ :డీఎస్సీ-14కు దరఖాస్తు చేసే క్రమంలో కొందరు అభ్యర్థులు తప్పుడు పద్ధతులను అవలంబిస్తున్నారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను చేపట్టాల్సిన వీరే.. ఆమోదయోగ్యం కాని పద్ధతుల్లో వెళుతుండడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. డీఎస్సీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత హార్ట్‌కాపీలను అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాల్లో అందజేయాల్సి ఉంటోంది.
కొందరు అభ్యర్థులు స్టడీ సర్టిఫికెట్లు అందజేసే క్రమంలో ఆయా స్కూళ్ల హెచ్‌ఎంల సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఇటీవల చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వజ్రకరూరు మండలానికి చెందిన ఓ అభ్యర్థి స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. హార్ట్‌కాపీలు అందజేసేందుకు జూనియర్ కళాశాలలోని కేంద్రానికి వచ్చాడు. 1-4 తరగతి వరకు ఒక స్టడీ సర్టిఫికెట్, 6-10వ తరగతి వరకు మరో స్టడీ సర్టిఫికెట్ జమ చేశాడు.
5వ తరగతి మాత్రం కనబరచలేదు. దరఖాస్తు పరిశీలించిన సిబ్బంది 5వ తరగతి ప్రైవేట్‌గా చదివినట్లు నమోదు చేస్తామని సూచించారు. దీంతో సదరు అభ్యర్థి ‘లేదు లేదు.. 5వ తరగతి కూడా అదే పాఠశాలలో చదివా’నంటూ సర్టిఫికెట్‌లో కనబరిచిన స్కూల్ గురించి ప్రస్తావించాడు. మరి ఇందులో ఎందుకు ప్రస్తావించలేదని, సంబంధిత పాఠశాల హెచ్‌ఎంతో రాయించుకుని రావాలని సిబ్బందిలో ఒకరు సూచించారు.అయితే.. ఆ అభ్యర్థి సిబ్బంది ఎదుటనే ఇదివరకే ఇచ్చిన సర్టిఫికెట్ వెనక్కు తీసుకుని అందులో కరెక్షన్ (4వ తరగతి ఉండేది 5వ తరగతి) చేసి ఇచ్చాడు.
అదేంటి?! హెచ్‌ఎం చేయాల్సిన పనిని నువ్వే చేస్తున్నావంటూ ప్రశ్నించగా.. అందుకు ఆ అభ్యర్థి ‘అవునా...’ అంటూ ఓ స్టడీ పేపరులో 1-5 వరకు చదివినట్లు రాసి ఆయనే సంతకం చేసి, పాఠశాల సీలు కూడా వేసి ఇచ్చాడు. ‘భవిష్యత్తులో కాబోయే టీచరు..మీరే ఇలా చేస్తే ఎలా అంటూ’ ఓ ఉపాధ్యాయుడు ప్రశ్నించారు. అంతే అప్పటికే కాకమీద ఉన్న ఆ అభ్యర్థి నోటివెంట బూతుపురాణం వచ్చింది. ఇందుకు కోపోద్రిక్తుడైన ఆ ఉపాధ్యాయుడు చేయి చేసుకున్నారు. ఇద్దరి మధ్య పెద్దఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని పంచాయితీ చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన వారే అనవసరంగా రచ్చ చేశారనే ఆరోపణలూ బలంగా ఉన్నాయి. చివరకు ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. తనను కులం పేరుతో దూషించి దాడి చేశాడంటూ సదరు నిరుద్యోగ అభ్యర్థి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
విద్యాశాఖ సిబ్బంది, కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా నిరుద్యోగ అభ్యర్థి పక్షానే నిలబడడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. చివరకు సదరు ఉపాధ్యాయుడే కొంత డబ్బు చెల్లించి రాజీ చేసుకోవాల్సి వచ్చింది. సర్టిఫికెట్ ఫోర్జరీ చేసిన వైనంపై ప్రశ్నించిన పాపానికి తన జేబుకే చిల్లుపడిందంటూ సదరు ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం.