శ్రీకాకుళం : డీఎస్సీ-14లో ఓసీ కేటగిరీలో జిల్లా నుంచి ఇద్దరు అభ్యర్థులే ఎంపికయ్యారు. ఈ విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం 420 ఎస్జీటీ, పండిట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించగా...ఇందులో 320 పోస్టులకు మాత్రమే అర్హులుండగా.. వంద బ్యాక్‌లాగ్‌గా ఉండిపోయాయి. 320 పోస్టుల్లో సుమారు 140 వరకు ఓసీ కేటగిరీ పోస్టులు ఉండగా, ఇందులో ఏడుగురు మాత్రమే అగ్రకులాలవారు ఎంపికయ్యారు. వీరిలో జిల్లాకు చెందినవారు ఇద్దరే కావడం విశేషం. హిందీ పండిట్ పోస్టుల్లో మాత్రం ఐదుగురు ఎంపికవ్వగా .. వీరంతా ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చినవారు కావడం గమనార్హం.
కారణాలను పరిశీలిస్తే జిల్లాలో ఉన్న వారిలో ఆర్యవైశ్య, బ్రాహ్మణ, తెలగ, ఇతర జిల్లాల నుంచి వలస వచ్చిన రెడ్డి, కమ్మ, క్షత్రియులు మాత్రమే అగ్రకులాలకు చెందినవారు. జిల్లా జనాభాలో వీరిశాతం 15 వరకు ఉంది. వీరి నుంచి ఎంపికైనవారు తక్కువగా ఉన్నారు.
పోస్టుల భర్తీలో మరింత జాప్యం!
రాష్ట్ర ప్రభుత్వం మార్చి 5 నాటికి డీఎస్సీ-14లోని ఎస్జీటీ తెలుగు పండిట్ పోస్టులను భర్తీలు చేస్తామని చెప్పినప్పటికీ దీనిలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే తుది జాబితా విడుదల చేయాల్సి ఉంది. దీని పరిశీలన పూర్తిచేసి, అభ్యంతరాలు స్వీకరించి అభ్యర్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించే గడువు షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. అయితే నేటికీ తుది జాబితా విడుదల కాకపోవడంతో భర్తీల్లో మరో 15, 20 రోజులు పట్టే అవకాశాలున్నాయి.
వికలాంగుల కేటగిరీ నుంచి ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలనను హైదరాబాద్, విశాఖపట్నంలోని ఆస్పత్రులకు పంపించారు. వారు తమ ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26 వ తేదీలోగా రావాలని ఆదేశించినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తికాలేదు. భర్తీ కాకుండా ఉండిపోయిన మాజీ సైనిక కేటగిరీలో ఓసీ అభ్యర్థులు
డీఎస్సీ-14లో భర్తీ కాకుండా ఉండిపోయిన నాలుగు మాజీ సైనిక కేటగిరీ పోస్టులను ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీచేయనున్నారు. మిగిలిన కేటగిరీల పోస్టులకు అర్హులు లేకుంటే బ్యాక్‌లాగ్‌గా ఉండిపోతాయి. అయితే మాజీ సైనిక కేటగిరీకి అభ్యర్థులు లభించని పక్షంలో ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఓసీ అభ్యర్థులతో ఈ నాలుగు పోస్టులను భర్తీ చేయాలని అధికారులు నిశ్చయించారు.
జాబితాలు మారుతాయా?
ఇప్పటికే అర్హుల జాబితా విడుదల చేసి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయగా ఈ జాబితాలు మారుతాయనే సందేహాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మాజీ సైనిక కేటగిరీని ఓసీ కేటగిరీ అభ్యర్థులతో భర్తీ చేసిన పక్షంలో జాబితా మారే అవకాశాలుంటాయి. ఓసీ కేటగిరీ ఎంపికలు పూర్తయిన తరువాత ఉన్న అభ్యర్థుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, వికలాంగ అభ్యర్థులను ఆయా కేటగిరీలకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా మాజీ సైనిక కేటగిరీ కోసం ఓసీ కేటగిరీ తరువాత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తే మిగిలిన కేటగిరీల అభ్యర్థుల పేర్లు మారే అవకాశాలున్నాయి. అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
ప్చ్..! డీఎస్సీకి ఎంపికైన ఓసీ అభ్యర్థులు ఇద్దరే!
Published Tue, Mar 1 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM
Advertisement
Advertisement