జూలై 6, 2020న ప్రత్యేక డీఎస్సీ అభ్యర్థికినియామక పత్రం అందజేస్తున్న డీఈఓ శామ్యూల్
అనంతపురం విద్య: ఐఈడీఎస్‌ఎస్ (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది డిసేబుల్డ్ ఆఫ్ సెకండరీ స్టేజ్)– ప్రత్యేక డీఎస్సీ–2019ని తొలిసారిగా విడుదల చేశారు. రాత పరీక్ష నిర్వహించి 2019 నవంబర్‌లో ఫలితాలు విడుదల చేశారు. 100 మార్కుల రాత పరీక్షలో ఓపెన్ కేటగిరీ వారికి 60 మార్కులు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 40 మార్కులు కట్ ఆఫ్‌గా నిర్ణయించారు. మొత్తం 55 పోస్టులకు 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. 2019 జూన్ 30న రాత పరీక్ష నిర్వహించి 45 పోస్టులను భర్తీ చేశారు.
అర్హత మార్కులు రాకపోయినా ఉద్యోగాలు
ఓసీ కేటగిరీకి మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. అర్హతగా నిర్ణయించిన 60 మార్కులు వచ్చిన వారు కేవలం 6గురే ఉన్నారు. తక్కిన 20 పోస్టులు ఓపెన్ కేటగిరి పోస్టుల్లో అర్హులు లేకపోతే వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలి. కానీ అధికారులు మాత్రం అర్హత మార్కులు తక్కువగా వచ్చినప్పటికీ మొత్తం 26 పోస్టులను భర్తీ చేశారు. ఇతర కేటగిరీ వారికి ఓపెన్ కేటగిరీ వారీగా పరిగణించి నియామకాలు చేసేశారు.
అంతా ఇష్టానుసారం
♦నవంబర్, 2019లో తొలుత ప్రకటించిన ఫలితాల్లో ‘టెట్’లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇస్తామని పేర్కొన్నారు. వెయిటేజీతో కలిపి డీఎస్సీ ఫలితాలు ప్రకటించారు.
♦తాజాగా ‘టెట్’ మార్కులు తొలగించి డీఎస్సీ మార్కులను ప్రామాణికంగా తీసుకున్నారు.
♦సమగ్రశిక్ష సహిత విభాగం కింద పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు స్పెషల్ డీఎస్సీలో 5 మార్కులు వెయిటేజీ ప్రకటించారు. అయితే డీఎస్సీలో అర్హత మార్కులు వచ్చినప్పుడే వెయిటేజీ మార్కులు కలపాలి.
♦డీఎస్సీలో అర్హత మార్కులు రాకున్నప్పటికీ వెయిటేజీ మార్కులు కలిపి 5గురు అభ్యర్థులకు పోస్టింగ్ కల్పించారు. దీంతో రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరి అభ్యర్థులు ఐదుగురికి ఉద్యోగాలు దక్కని పరిస్థితి నెలకొంది.
♦ఏ కేటగిరీలో మిగిలిపోయిన పోస్టులను ఆ కేటగిరీ వారితోనే భర్తీ చేయాలి. సదరు కేటగిరీలో అర్హులు లేకపోతే.. వచ్చే డీఎస్సీలో అదే కేటగిరీలో బ్యాక్‌లాగ్ పోస్టుల కింద భర్తీ చేయాలి.
♦ నిర్దేశించిన అర్హత మార్కులను నోటిఫికేషన్‌లో పేర్కొనకుండా రాత పరీక్ష నిర్వహించి ఉంటే డీఎస్సీలో ఒక మార్కు వచ్చినా.. 5 మార్కుల వెయిటేజీ కల్పించవచ్చు. కానీ డీఎస్సీ నోటిఫికేషన్‌లో కేటగిరి వారీగా అర్హత మార్కులు పేర్కొన్నారు.
♦అయినా నియామకాల్లో ఇష్టానురీతిగా నిబంధనలు విస్మరించి వెయిటేజీ కల్పించి అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
నోటిఫికేషన్‌లో నిబంధనలకు నీళ్లొదిలారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు పాతర వేశారు. రోస్టర్ పాయింట్లు పక్కన పెట్టేశారు. ఒక కేటగిరి వారిని మరో కేటగిరీలో కలిపారు. మెరిట్ టు మెరిట్‌ను పూర్తిగా విస్మరించి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారు. వెరసి స్పెషల్ డీఎస్సీ నియామకాలన్నీ గందరగోళంగా సాగాయి. ఉన్నతాధికారుల అడ్డగోలు నిర్ణయాలతో 25 మంది ఉద్యోగాలకు దూరమయ్యారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తా
రోస్టర్ పాయింట్ల నిర్ధారణ, అభ్యర్థుల ఎంపిక మా పరిధిలో లేని అంశం. తప్పిదాలు జరిగి ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. అర్హులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం.
– కె.శామ్యూల్, డీఈఓ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment