సాక్షి, అనంతపురం : రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఎస్సీ- 2013 నోటిఫికేషన్ కథ కంచికి చేరేటట్లు కనిపిస్తోంది. విభజన సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో, నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందోనని నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. డీఎస్సీతో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ల విషయంలోనూ ఇదే విధమైన ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది కాలంగా వేలాది రూపాయలు వెచ్చిస్తూ కోచింగ్ తీసుకుంటున్నామని, ఇప్పుడు నోటిఫికేషన్లు రాకపోతే తమ సంగతేంటని నిరుద్యోగులు వాపోతున్నారు. ఆగస్టు మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రభుత్వం ఇంతకుముందు ప్రకటించింది. నవంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొంది.
అయితే.. జూలై 30న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడడంతో నోటిఫికేషన్ సంగతి మరుగునపడిపోయింది. జిల్లాలో డీఎస్సీ కోసం 1,002 ఉపాధ్యాయ పోస్టులను అధికారులు నోటిఫై చేశారు. వీటికి నోటిఫికేషన్ వస్తే సుమారు 25 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసే అవకాశముంది. కాగా.. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సెప్టెంబర్‌లో జిల్లాలో దాదాపు 15 వేల మంది దరఖాస్తు చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో టెట్‌ను నిరవధికంగా వాయిదా వేశారు. ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇప్పటికీ స్పష్టం చేయడంలేదు.
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఏనాటికో?
జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీతో పాటు ఏపీపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షల కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1,2,4తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తుంటారు.
ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో మూడు విడతలుగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్, వైద్యశాఖలోని పోస్టులను గుర్తించారు. వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకిసన్నాహాలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర విభజన ప్రకటన వెలువడింది. దీంతో నోటిఫికేషన్లు జారీ చేయలేమని ఏపీపీఎస్సీ అధికారులు చేతులెత్తేశారు. అసలు ఇప్పట్లో నోటిఫికేషన్లు వస్తాయా? రాష్ట్ర విభజన తర్వాతేనా అన్న ప్రశ్నలు అభ్యర్థులను వేధిస్తున్నాయి. గుర్తించిన మేరకు పోస్టులుంటాయా అన్న అనుమానం కూడా తలెత్తుతోంది.
సంతోషం ఆవిరైపోయింది
2008లో డీఈడీ పూర్తి చేశా. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా. జూలైలో నోటిఫికేషన్ వస్తుందని తెలియగానే ఎంతో సంతోషపడ్డా. అయితే... తెలంగాణ ప్రకటనతో నా సంతోషం ఆవిరైపోయింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే కాకుండా.. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
- డి.లక్ష్మినారాయణ, అనంతపురం
ఎదురుచూస్తున్నా
2008లో డీఈడీ పూర్తి చేశా. 2012లో డీఎస్సీ రాశా. కొద్దిపాటిలో పోస్ట్ మిస్సయ్యింది. ఈ ఏడాది జూలైలో నోటిఫికేషన్ వస్తుందని తెలిసి.. వేలకు వేలు పెట్టి కోచింగ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు చూస్తే నోటిఫికేషన్ వస్తుందో, లేదో తెలియడం లేదు.
- పి.చైతన్య, నిరుద్యోగ ఉపాధ్యాయ
అభ్యర్థిని, అనంతపురం