సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఉదంతం జరిగినప్పుడు స్పందిస్తే అది రియాక్టివ్ పోలీసింగ్... అసలు ఎలాంటి ఉదంతం చోటు చేసుకోకుండా దాన్ని ముందే గుర్తించి నిరోధిస్తే అది ప్రొయాక్టివ్ పోలీసింగ్... రెండో తరహా విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు విభాగంలో అడుగు పెట్టడానికి ముందే అభ్యర్థులకు దీంతో పాటు ఇతర విధానాలను బోధించాలని స్పష్టం చేశారు. దీనికోసం తెలంగాణ పోలీసు అకాడెమీ కేంద్రంగా సాగే పోలీసు శిక్షణ విధానంలో అవసరమైన మార్పుచేర్పులకు ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసింగ్‌లో సమకాలీన అవసరాలకు తగ్గట్టు శిక్షణలో చేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభంకానున్న 18 వేల మంది శిక్షణ మాడ్యుల్‌లో ఈ కొత్త పాఠాలు చేరనున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు చెందిన తుది ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఆపై గరిష్టంగా నెల రోజుల్లోనే వీరికి శిక్షణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు కొత్త పాఠాలకు తుది రూపు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తోంది.
సమూల మార్పులతో...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్‌లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. సంప్రదాయ పోలీసు విధానాలకు అదనంగా గడిచిన ఐదేళ్లలో ఎన్నో కొత్త అంశాలు వచ్చిచేరాయి. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఉపకరించే ఓ కొత్త అంశాన్ని పోలీసు విభాగం ప్రవేశపెట్టిన ప్రతిసారీ సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తోంది. దీనికోసం కమిషనరేట్లు, జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చేందుకు కొందరిని ఎంచుకుంటోంది. ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ పేరుతో కార్యక్రమాలు చేపట్టి వీరికి డీజీపీ కార్యాలయం కేంద్రంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పూర్తి చేసుకుని వెళ్తున్న ఈ ట్రైనర్లు తమ పరిధిలో ఉన్న ఇతర సిబ్బంది, అధికారులకు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి అవసరం లేకుండా ఇకపై పోలీసు విభాగంలో అడుగుపెట్టే వారికి ట్రైనింగ్‌లోనే సమకాలీనంగా అందుబాటులోకి వచ్చిన అంశాలు, విధానాలను బోధించనున్నారు.
కొత్త పాఠాల్లో భాగంగా ప్రోయాక్టివ్ పోలీసింగ్‌తో పాటు యూనిఫామ్డ్ సర్వీస్ డెలివరీకి కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ప్రకారం హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లలో ఏ తరహా స్పందన, సేవలు ఉంటున్నాయో... ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలంలో ఉన్న ఠాణాలోనూ అదే విధంగా ఉండాలి. ఈ అంశాన్ని శిక్షణ సమయం నుంచే బోధించనున్నారు. ప్రజలకు మరింత సన్నిహితం కావడానికి, పోలీసు విధులు, దర్యాప్తుల్లో సహకరించడానికి, నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి హాక్–ఐ, టీఎస్ కాప్ వంటి వివిధ రకాలైన అధికారిక యాప్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి చెందిన అంశాలతోనూ ఓ పాఠం రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో కమ్యూనిటీ పోలీసింగ్ అనేక అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. సాధారణ ప్రజలకూ పోలీసింగ్‌లో భాగస్వామ్యం కల్పించే ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం అమలులోకి తీసువచ్చింది. దీని నిర్వహణా అంశాలను బోధించనున్నారు.
16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి..
ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు... పోలీసుస్టేషన్‌లో ఉండే వివిధ విభాగాలకు పని విభజన చేస్తూ 16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల ప్రాధాన్యం, కమ్యూనిటీ కెమెరాలు, నేను సైతం ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మరో పాఠ్యాంశం ఉండనుంది. రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్స్ ఏర్పాటు చేసిన తర్వాత గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి నేతృత్వం వహించేది కానిస్టేబుల్ స్థాయి అధికారులే. వీరి ప్రవర్తన, తీరుతెన్నులే ఫిర్యాదుదారులకు ఊరట, పోలీసు విభాగంపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలోనే రిసెప్షన్ నిర్వహణలో మెళకువల్నీ ట్రైనింగ్‌లోనే నేర్పాలని నిర్ణయించారు. పోలీసు శిక్షణలో కొత్తగా చేరుస్తున్న అంశాలు కేవలం పాఠాలుగానే ఉండకుండా ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటోంది. ట్రైనింగ్ మాడ్యుల్‌లోకి చేరే కొత్త పాఠాల్లో ఆయా విధానాల వల్ల ఇప్పటికే వచ్చిన ఫలితాలను అభ్యర్థులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని కేస్ స్టడీస్‌తో పాటు తగ్గిన నేరాల శాతం తదితరాలనూ ప్రత్యక్ష ఉదాహరణలుగా పాఠంలో చేరుస్తున్నారు. ఈ సిలబస్‌తో శిక్షణ పూర్తి చేసుకునే తొలి బ్యాచ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి మార్పుచేర్పులు చేయాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది.
కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు
Published Thu, May 23 2019 2:29 AM | Last Updated on Thu, May 23 2019 2:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment