telangana police academy
-
మాటల్లేవ్.. అయినవాళ్లతో ఆనంద భాష్పాలు తప్ప! (ఫొటోలు)
-
ఎస్.ఐ యామ్ ఆన్ డ్యూటీ
ఎంతోమంది కలలను తమ భుజాలపై మోశారు.. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. సమాజ భద్రతకు తామున్నామంటూ ప్రతినబూనారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు. జీవిత భాగస్వాములు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేశారు. సొంతవారి కళ్లల్లో ఆనందబాష్పాలయ్యారు. చిట్టి పాపాయిల సంతోషానికి అవధుల్లేకుండా చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకుని ఎస్సైలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. వారిలో కొందరిని ’సాక్షి’ పలకరించింది..32 ఏళ్ల వయసులో...ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్‌డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్‌గా నిలిచి పాసింగ్ ఔట్ పరేడ్ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సార΄ాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.ఇద్దరు పిల్లల తల్లిగా..ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్ సర్వీసెస్ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్‌పేటలోని సీపీఎల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.27 సార్లు ప్రయత్నించి..! నవీ¯Œ కుమార్ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర. తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్ హోదాలో గౌరవం పోందాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు. కమాండెంట్ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. బుధవారం జరిగిన ΄ాసింగ్ పరేడ్‌లో పాల్గొన్నాడు. పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు. – వివేకానంద తంగెళ్లపల్లి, సాక్షి, హైదరాబాద్ -
పోలీస్ అకాడమీ సంచాలకుడిగా సందీప్ బాధ్యతలు
బండ్లగూడ: రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడామీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ శాండిల్య.. అకాడమీ సంచాలకుడిగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సందీప్ శాండిల్య ఈనెల 3న జరిగిన పోలీస్ ఉన్నతాధికారుల బదిలీల ఉత్తర్వులను అనుసరించి రైల్వే, రోడ్ సేఫ్టీ విభాగం నుంచి బదిలీపై వచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. -
వీకే సింగ్ వీఆర్ఎస్కు టీ సర్కార్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్(వీకే సింగ్) వీఆర్ఎస్కు తెలంగాణ సర్కార్ బ్రేక్ వేసింది. రెండు కేసుల్లో శాఖపరమైన పెండింగ్‌లో ఉన్న కారణంగా వీఆర్ఎస్ను రద్దు చేస్తున్నట్లు వీకే సింగ్‌కు ప్రభుత్వం తెలిపింది. కాగా జూన్ 26న వీకే సింగ్ వీఆర్ఎస్ అభ్యర్థన పెట్టుకున్నారు. అయితే వీకే సింగ్ పెట్టుకున్న వీఆర్ఎస్ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్టు అక్టోబర్ 2న తెలంగాణ సర్కార్ ఆయనకు నోటీస్ పంపించింది. ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2న ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. (చదవండి : డీజీపీగా పదోన్నతి ఇవ్వకుంటే రాజీనామా) అయితే కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాగా వీకే సింగ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే జూన్ 26న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్ఎస్ పెట్టుకున్న కొద్దిరోజుల్లోనే ఆయనను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్టేట్ పోలీస్ అకాడమీ నుంచి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ వీకే సింగ్‌కు అప్పట్లో ప్రభుత్వం ఆదేశించింది. కానీ దీనికి ఒప్పుకోని వీకే సింగ్ రాజీనామాకు కూడా సిద్దపడ్డారు. -
పోలీస్ అకాడమీలో 180 పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)లో అటెండర్ నుంచి ఐపీఎస్ ర్యాంకు దాకా 180 మందికి పాజిటివ్ రావడంతో సిబ్బంది, కేడెట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 20న అకాడమీలో పనిచేసే ఓ అటెండర్‌కు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఏకంగా 180 మందికి కరోనా రావడంతో ఆందోళన నెలకొంది. వీరిలో 100 మంది శిక్షణ ఎస్సైలు, 80 మంది ఇతర సిబ్బంది ఉన్నారని డైరెక్టర్ వీకే సింగ్ తెలిపారు. సగం మందికి ఎలాంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. అందరికీ అకాడమీలోనే ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. బయటి నుంచి వచ్చే సిబ్బంది ద్వారానే కరోనా సోకినట్లుగా చెబుతున్నారు. -
కరోనా ఎఫెక్ట్! వీకే సింగ్‌పై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్, ఏడీజీ వీకేసింగ్‌పై బదిలీ వేటు పడింది. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు పోలీస్ రిక్రూట్మెంట్ చైర్మన్‌గా ఉన్న వీవీ శ్రీనివాస్‌రావుకు టీఎస్పీఏ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. (చదవండి: రాజకీయాల్లో చేరను: వీకే సింగ్) కారణాలివేనా కాగా, తనకు ప్రి మెచ్యూర్ రిటైర్మెంట్ కావాలని ఈనెల 24న కేంద్ర హోం మంత్రికి వీకే సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదని ప్రభుత్వంపై కినుక వహించారు. తన సేవలకు తగిన గుర్తింపు లేదంటూ వీకే సింగ్ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పోలీసు అకాడెమీలో 180 మందికి కరోనా సోకినట్టుగా వీకే సింగ్ నేడు ధ్రువీకరించారు. అయితే, ప్రభుత్వ ప్రకటన వెలువడకముందే కేసుల విషయాన్ని బహిర్గతం చేయడం కూడా వీకే సింగ్ బదిలీకి కారణం కావొచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక పోలీస్ అకాడమీలో మొత్తం 200 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. (చదవండి: తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం) -
తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం
-
తెలంగాణ పోలీసు అకాడమీలో 180 మందికి కరోనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేపుతోంది. అకాడమీలోని 180 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్ వీకేసింగ్ ధ్రువీకరించారు. కాగా, పోలీస్ అకాడమీలో 200 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వారిలో ఓ డీఐజీ ర్యాంకు అధికారి, ఒక అడిషనల్ ఎస్పీ, 4 డీఎస్పీ, 8 సీఐ స్థాయి అధికారులు సహా వందమంది శిక్షణ ఎస్ఐలు, 80 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అకాడమీలో 1100మందికిపైగా ఎస్ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లతో సహా మొత్తం 1900 మంది శిక్షణ పొందుతున్నారని సమాచారం.(కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్! ) దాంతో రాష్ట్ర పోలీస్ అకాడమీలో భయాందోళనలు నెలకొన్నాయి. మరొకవైపు పోలీస్ అకాడమీలో శిక్షణ కొనసాగుతుండటంతో క్యాడెట్ల తల్లి తండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. త్వరలోనే అకాడమీలో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాగా, తొలుత అకాడమీలో పనిచేసే వంట మనిషి కరోనా సోకినట్టుగా సమాచారం. మరోవైపు రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 13,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 243 మంది మృతిచెందారు. -
పోలీస్ క్యాడెట్లకు ముందే శిక్షణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న కేడెట్లకు ఈసారి నిర్ణీత సమయానికి ముందే శిక్షణ పూర్తి కానుంది. కరోనా దెబ్బకు సెమిస్టర్ సెలవులు లేకుండా నిరంతరాయంగా శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. లాక్డౌన్ విధించిన తరువాత క్యాడెట్లు ఇంతవరకూ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు. క్యాడెట్లు కరోనా బారిన పడకుండా దాదాపు 105 రోజులుగా అందరినీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)తోపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. ఎవరికీ ఔటింగ్ ఇవ్వడం లేదు. క్యాడెట్లను చూసేందుకు అకాడమీలోకి వారి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కూడా అనుమతించడం లేదు. మరీ అత్యవసరమైతే తప్ప బయటికి పంపడం లేదు. ఒకవేళ వెళ్లినా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో వారంతా కేవలం ఫోన్లతోనే కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఈసారి క్యాడెట్లందరికీ శిక్షణ ముందే ముగియనుందన్న వార్త కాస్త ఊరటనిస్తోంది. మొదటి సెమిస్టర్ సెలవులు రద్దు.. రాష్ట్రంలో జనవరి 18న టీఎస్‌పీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీటీసీలలో దాదాపు 17,200 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. వీరికి అప్పట్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వీలుండేది. మార్చి 8, 9వ తేదీల్లో క్యాడెట్లకు సెలవులు ఇచ్చారు. తరువాత అనుకోకుండా 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి క్యాడెట్లకు కరోనా సోకకుండా ఔటింగులు ఆపేశారు. కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు. వీరికి రెండు సెమిస్టర్లలో సిలబస్ పూర్తి అవుతుంది. మే నెలలో 4,5,6,7 తేదీల్లో తొలిసెమిస్టర్ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, బయటికి వెళితే.. కేడెట్ల ఆరోగ్యానికి ముప్పు ఉండటంతో సెలవులు రద్దు చేశారు. మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. వీరికి శిక్షణ ముగిసి పాసింగ్ ఔట్ పరేడ్ (పీవోపీ) అక్టోబరు 12న జరగాలి. సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వలేదు కాబట్టి పీవోపీ మరో వారం ముందుకు జరిగి అక్టోబరు 4 లేదా 5వ తేదీల్లో జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. జ్వరం, జలుబుతో పలువురు.. అకాడమీల్లో పలువురు క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారు. నగరంలోని యూ సుఫ్‌గూడలో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుల్ క్యాడెట్లు 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరంతా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా వీరిని ప్రత్యేక బ్యారెక్‌లలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు టీఎస్‌పీఏలోనూ 50 మందికిపైగా క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది. టీఎస్‌పీఏలో కరోనా అనుమానితులకు గోల్గొండ, సరోజినీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయిస్తున్నారు. -
రాజీనామా చేసిన వీకే సింగ్
సాక్షి, హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి వినోయ్‌కుమార్ సింగ్ (వీకేసింగ్) తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఆయన బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా వీకే సింగ్ విధులు నిర్వర్తిస్తున్నారు. తన రాజీనామాను కేంద్ర హోం శాఖ మంత్రికి పంపించారు. కాగా, కొద్ది రోజుల క్రితమే తన రాజీనామా గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని అర్హతలున్న తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని, అలాకాని పక్షంలో తాను రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ ప్రభుత్వానికి లేఖ ద్వారా విన్నవించారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్ 30న వీకే సింగ్ సర్వీసు ముగియనుంది. అయితే తనకు అక్టోబర్ 2 ప్రీ రిటైర్మెంట్ ఇవ్వాలని ఆయన తన లేఖలో కోరారు. జైళ్లశాఖ డీజీగా పనిచేసిన ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. -
సానుకూల ధోరణితో విధులను స్వీకరించాలి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతీ పనిని సానుకూల ధోరణితో స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో (టీఎస్పీఏ) బుధవారం జరిగిన ట్రైనీ ఇన్స్పెక్టర్లు, ఏఎస్ఐల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి ధనిక, పేద తేడా లేకుండా సేవలను అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. మన అధికారాలు సామాన్య ప్రజల సేవలకు ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ జితేందర్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్, అకాడమీ జాయింట్ డైరెక్టర్ కె.రమేష్ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చట్టాలపై అవగాహనతోనే సమర్థ పోలీసింగ్
రాజేంద్రనగర్: నిరంతరం శిక్షణ, చట్టాలపై సంపూర్ణ అవగాహనతోనే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పైజాన్‌ముస్తఫా అన్నారు. రాజ్యాంగం, మానవ హక్కులు, పోలీసింగ్ అనే అంశంపై హిమాయత్‌సాగర్‌లోని రాజా రామ్బహద్దూర్ వెంటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో సోమవారం ‘కె.ఎస్.వ్యాస్ 24వ స్మారక ఉపన్యాస’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫైజన్ ముస్తఫా మాట్లాడుతూ పలు రాష్ట్రాల్లోని పోలీసులు అతితక్కువ బడ్జెట్ కేటాయింపుల వల్ల సరైన శిక్షణ లేక ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు. దేశంలో పోలీసు విభాగాల్లో సుమారు ఐదున్నర లక్షల ఖాళీలున్నాయన్నారు. మొత్తం పోలీస్ వ్యవస్థలో 86% కానిస్టేబుళ్ల స్థాయి సిబ్బంది ఉండగా, 13% మంది ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ క్యాడర్ వారు ఉన్నారని తెలిపారు. పోలీసు సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్, ఎస్సైలకు నిరంతరం మానవ హక్కులు, న్యాయ, చట్ట పరమైన అంశాలపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసు అధికారులకు, యువతకు ఇప్పటికీ దివంగత వ్యాస్ రోల్ మోడల్‌గా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ వి.కె.సింగ్, దివంగత వ్యాస్ కుమారుడు సీసీ ఎల్ఏ అడిషనల్ కమిషనర్ కేఎస్ శ్రీవత్స తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్ నుంచి కానిస్టేబుల్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా ఎన్నికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ తొలి వారంలో శిక్షణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉమ్మడి 10 జిల్లాల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)ల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 18,428 వేల పోస్టుల భర్తీలో భాగంగా ఎస్సై 1,272, కానిస్టేబుల్ 17,156 పోస్టుల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సైల శిక్షణ ప్రారంభమైంది. అయితే కానిస్టేబుళ్లందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వడం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరిలో కొందరిని ఆంధ్రప్రదేశ్‌లోని ట్రైనింగ్ కాలేజీలకు పంపాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఎంత మంది అభ్యర్థులని ఏపీకి పంపుతారన్న దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. -
పోలీసు, న్యాయవ్యవస్థ నాణేనికి రెండు ముఖాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు, న్యాయవ్యవస్థలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 2019 కొత్త ఎస్సై(సివిల్) బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ, పోలీస్ విధుల్లో వ్యత్యాసమున్నా లక్ష్యం ఒక్కటేనన్నారు. పోలీసు అధికారులు సమాజం పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులతో వచ్చే ప్రజలతో సహనంతో వ్యవహరించాలన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులతోపాటు, చట్టాలన్నింటిపైనా పట్టు సాధించాలని సూచించారు. బృంద స్ఫూర్తి, స్మార్ట్‌వర్క్, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాలకనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ముడిరాళ్లను వజ్రాలుగా సానబెట్టే అవకాశం టీఎస్‌పీఏకి వచ్చిందని పోలీసు అకాడమీ డైరెక్టర్ వినయ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రైనీ ఎస్సైలకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్‌కుమార్.. టీఎస్పీఏ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జానకీషర్మిల తదితరులు పాల్గొన్నారు. -
కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఉదంతం జరిగినప్పుడు స్పందిస్తే అది రియాక్టివ్ పోలీసింగ్... అసలు ఎలాంటి ఉదంతం చోటు చేసుకోకుండా దాన్ని ముందే గుర్తించి నిరోధిస్తే అది ప్రొయాక్టివ్ పోలీసింగ్... రెండో తరహా విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు విభాగంలో అడుగు పెట్టడానికి ముందే అభ్యర్థులకు దీంతో పాటు ఇతర విధానాలను బోధించాలని స్పష్టం చేశారు. దీనికోసం తెలంగాణ పోలీసు అకాడెమీ కేంద్రంగా సాగే పోలీసు శిక్షణ విధానంలో అవసరమైన మార్పుచేర్పులకు ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసింగ్‌లో సమకాలీన అవసరాలకు తగ్గట్టు శిక్షణలో చేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభంకానున్న 18 వేల మంది శిక్షణ మాడ్యుల్లో ఈ కొత్త పాఠాలు చేరనున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు చెందిన తుది ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఆపై గరిష్టంగా నెల రోజుల్లోనే వీరికి శిక్షణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు కొత్త పాఠాలకు తుది రూపు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తోంది. సమూల మార్పులతో... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్‌లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. సంప్రదాయ పోలీసు విధానాలకు అదనంగా గడిచిన ఐదేళ్లలో ఎన్నో కొత్త అంశాలు వచ్చిచేరాయి. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఉపకరించే ఓ కొత్త అంశాన్ని పోలీసు విభాగం ప్రవేశపెట్టిన ప్రతిసారీ సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తోంది. దీనికోసం కమిషనరేట్లు, జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చేందుకు కొందరిని ఎంచుకుంటోంది. ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ పేరుతో కార్యక్రమాలు చేపట్టి వీరికి డీజీపీ కార్యాలయం కేంద్రంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పూర్తి చేసుకుని వెళ్తున్న ఈ ట్రైనర్లు తమ పరిధిలో ఉన్న ఇతర సిబ్బంది, అధికారులకు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి అవసరం లేకుండా ఇకపై పోలీసు విభాగంలో అడుగుపెట్టే వారికి ట్రైనింగ్‌లోనే సమకాలీనంగా అందుబాటులోకి వచ్చిన అంశాలు, విధానాలను బోధించనున్నారు. కొత్త పాఠాల్లో భాగంగా ప్రోయాక్టివ్ పోలీసింగ్‌తో పాటు యూనిఫామ్డ్ సర్వీస్ డెలివరీకి కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ప్రకారం హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లలో ఏ తరహా స్పందన, సేవలు ఉంటున్నాయో... ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలంలో ఉన్న ఠాణాలోనూ అదే విధంగా ఉండాలి. ఈ అంశాన్ని శిక్షణ సమయం నుంచే బోధించనున్నారు. ప్రజలకు మరింత సన్నిహితం కావడానికి, పోలీసు విధులు, దర్యాప్తుల్లో సహకరించడానికి, నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి హాక్–ఐ, టీఎస్ కాప్ వంటి వివిధ రకాలైన అధికారిక యాప్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి చెందిన అంశాలతోనూ ఓ పాఠం రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో కమ్యూనిటీ పోలీసింగ్ అనేక అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. సాధారణ ప్రజలకూ పోలీసింగ్‌లో భాగస్వామ్యం కల్పించే ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం అమలులోకి తీసువచ్చింది. దీని నిర్వహణా అంశాలను బోధించనున్నారు. 16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి.. ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు... పోలీసుస్టేషన్లో ఉండే వివిధ విభాగాలకు పని విభజన చేస్తూ 16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల ప్రాధాన్యం, కమ్యూనిటీ కెమెరాలు, నేను సైతం ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మరో పాఠ్యాంశం ఉండనుంది. రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్స్ ఏర్పాటు చేసిన తర్వాత గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి నేతృత్వం వహించేది కానిస్టేబుల్ స్థాయి అధికారులే. వీరి ప్రవర్తన, తీరుతెన్నులే ఫిర్యాదుదారులకు ఊరట, పోలీసు విభాగంపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలోనే రిసెప్షన్ నిర్వహణలో మెళకువల్నీ ట్రైనింగ్‌లోనే నేర్పాలని నిర్ణయించారు. పోలీసు శిక్షణలో కొత్తగా చేరుస్తున్న అంశాలు కేవలం పాఠాలుగానే ఉండకుండా ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటోంది. ట్రైనింగ్ మాడ్యుల్‌లోకి చేరే కొత్త పాఠాల్లో ఆయా విధానాల వల్ల ఇప్పటికే వచ్చిన ఫలితాలను అభ్యర్థులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని కేస్ స్టడీస్‌తో పాటు తగ్గిన నేరాల శాతం తదితరాలనూ ప్రత్యక్ష ఉదాహరణలుగా పాఠంలో చేరుస్తున్నారు. ఈ సిలబస్‌తో శిక్షణ పూర్తి చేసుకునే తొలి బ్యాచ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి మార్పుచేర్పులు చేయాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది. -
పోలీసుల అవసరాలకు డీఆర్డీవో కృషి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ కోసం క్షిపణులతోపాటు అనేక ఇతర టెక్నాలజీలు, పరికరాలను పోలీసులు, ఇతర పారామిలటరీ బలగాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్డీవో డైరెక్టర్, కేంద రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేలుడు పదార్థాల గుర్తింపునకు అభివృద్ధి చేసిన కిట్లు మొదలుకొని, గుంపులను చెదరగొట్టేందుకు పనికొచ్చే మిరపకాయ బాంబుల వరకూ వేటినైనా పోలీసులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోలీస్ వెంకటస్వామి కథలతోపాటు నేర విచారణ విషయంలో మార్గదర్శకుడైన ప్రొఫెసర్ ఎస్.వేణుగోపాలరావు శతజయంతి వేడుకల్లో సతీశ్‌రెడ్డి ‘డిఫెన్స్ టెక్నాలజీలు పోలీసు సంస్కరణలకు ఎలా ఉపయోగపడతాయి?’అన్న అంశంపై మాట్లాడారు. గత కొన్నేళ్లుగా డీఆర్డీవో పారామిలటరీ బలగాల అవసరాలను తీర్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని.. క్షిపణులను మినహాయిస్తే మిగిలిన చాలా టెక్నాలజీలను దేశీయ అవసరాల కోసం వాడుకోవచ్చని ఆయన తెలిపారు. రెండు కిలోమీటర్ల పరిధిలో గుంపుపై నిఘా ఉంచేందుకు నేత్ర పేరుతో ప్రత్యేకమైన డ్రోన్ ఉందని, తాము అభివృద్ధి చేసిన పేలుడు పదార్థాల గుర్తింపు కిట్ టెక్నాలజీని అమెరికా కూడా వాడుతోందని తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా అననుకూల పరిస్థితుల్లో పనిచేసే సైనికుల కోసం తాము ఎన్నో ఇతర టెక్నాలజీలను అభివృద్ధి చేశామని, బుల్లెట్‌ప్రూఫ్ హెల్మెట్, బాడీ సూట్, దోమల మందు, అతి తక్కువ పదార్థంతో రోజుకు సరిపడా పోషకాలను ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను స్థానిక పోలీసులు, ఇతర పారామిలటరీ బలగాలు వాడుకోవచ్చని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ సమస్యను అధిగమించేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ మెహ్రా, అడిషనల్ డైరెక్టర్లు టి.వి.శశిధర్‌రెడ్డి, డాక్టర్ ఎన్.అనితా ఎవాంజెలిన్ తదితరులు పాల్గొన్నారు. -
చేతన.. ఇక పోలీసు ‘పాఠం’!
సాక్షి, హైదరాబాద్: చిన్నారి చేతన కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసు పాఠ్యాంశంగా చేర్చాలని నగర పోలీసు విభాగం ప్రతిపాదించింది. ఈ కేస్ స్టడీని తెలంగాణ పోలీసు అకాడమీ(టీఎస్పీఏ)తోపాటు నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్పీఏ)కి పంపాలని నిర్ణయించారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి చిన్నారిని నైన రాణి అనే మహిళ సోమవారం ఉదయం 11 గంటలకు కిడ్నాప్ చేయగా పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోగా కేసును ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారుల స్పందన, సమన్వయం తదితరాలతో ఈ పాఠ్యాంశం రూపొందనుంది. చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు, కీలక ఆధారాలు అందించిన సీసీ కెమెరాలు, దర్యాప్తు అధికారులు అనుసరించిన విధానం తదితరాలతో సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ఇందులో నిపుణుల సాయంతో మార్పులు, చేర్పులు చేయించి పాఠ్యాంశంగా మారుస్తారు. పోలీసుల స్పందనతో స్ఫూర్తి పొందిన చిన్నారి తల్లి విజయ తన కుమార్తెకు సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన పేరు పెడుతున్నట్లు ప్రకటించడాన్నీ ఈ పాఠ్యాంశంలో చేర్చనున్నారు. చిన్నారి చేతన కేసు పోలీసుల పనితీరుకు మాత్రమే కాకుండా బాధితుల విషయంలో సత్వరంగా, సరైన సమయంలో స్పందించి ఫలితాలు సాధిస్తే పోలీసులపై ఏర్పడే అభిప్రాయానికీ నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. దీన్ని టీఎస్‌పీఏలో ఓ కేస్ స్టడీగా ప్రవేశపెట్టాల్సిందిగా డీజీపీకి లేఖ రాయనున్నారు. ఆయన అనుమతితో టీఎస్‌పీఏతోపాటు జిల్లాల్లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లలోనూ ప్రవేశపెట్టే దీన్ని శిక్షణ, మధ్యంతర శిక్షణల్లో ఉండే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు అభ్యసిస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసి అనుమతి పొందితే ఐపీఎస్ అధికారులు శిక్షణ తీసుకునే శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోనూ చేతన కేసు పాఠ్యాంశంగా మారుతుంది. చిన్నారి ఆచూకీ కోసం హైదరాబాద్, బీదర్ పోలీసులు సమన్వయంతో పనిచేయడంతోపాటు ఉమ్మడిగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహించిన విషయం విదితమే. 68 గంటల్లో అరెస్టు... 32 గంటల్లో బెయిల్ చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన నైన రాణికి నాంపల్లి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శిశువును కిడ్నాప్ చేసిన తర్వాత ఈమెను పట్టుకోవడానికి 68 గంటల సమయం పట్టింది. అయితే, అరెస్టు చేసిన 32 గంటల్లోనే నిందితురాలికి బెయిల్ లభించడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ పి.శివశంకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘నైన రాణి శిశువును పెంచుకోవడానికి మాత్రమే కిడ్నాప్ చేసింది. ఈ విషయంతోపాటు ఉదంతం పూర్వాపరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి నేర నిరూపణలో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్(టీఐడీ) పరేడ్ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఈమె బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’అని అన్నారు. -
'నా కెరీర్లో అవే పెను సవాళ్లు'
సాక్షి, హైదరాబాద్ : 35 ఏళ్లు పనిచేసిన డిపార్ట్మెంట్ను వీడిపోతున్నందుకు తనకు చాలా బాధగా ఉందన్నారు తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్ శర్మ. ఆదివారం ఉదయం తెలంగాణ పోలీసు అకాడమీలో ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు హాజరై ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ అనంతరం తొలి డీజీపీగా సేవలందించిన అనురాగ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. 'దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు పనిచేసిన పోలీస్ శాఖను వీడుతున్నందుకు బాధగా ఉంది. నా సర్వీస్‌లో ముఖ్యంగా 1992లో పాతబస్తీ డీసీపీగా సేవలందించినప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. సౌత్ జోన్లో డీసీపీగా పనిచేయడం కూడా నా కెరీర్లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ. అయితే తెలంగాణ ఏర్పడ్డాక అన్ని సవాళ్లను అధిగమించేలా పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. లా అండ్ అర్డర్‌ను అదుపులో పెట్టేందుకు మాకు ఎంతో సహకరించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. హోంగార్డు నుంచి ఐజీ వరకు రాష్ట్ర పోలీసింగ్‌ను ప్రపంచ వ్యాప్తంగా చాటామని' అనురాగ్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. కాగా, మాజీ డీజీపీ అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహదారుగా తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. -
పోలీస్ అకాడమీలో ట్రైనీ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, హైరాబాద్: పోలీస్ అకాడమీలో నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ ఆదివారం ఉదయం చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన నవీన, మిర్యాలగూడకు చెందిన మాధవి స్నేహితురాళ్లు. అయితే... ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని నవీన స్నేహితురాలు మాధవి మిర్యాలగూడలో శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మనస్థాపానికి గురైన నవీన పోలీస్ అకాడమీలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2016లో పోలీస్ శాఖకు ఎంపికైన నవీన ప్రస్తుతం నార్సింగిలోని తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. నవీన తండ్రి నర్సింహ కూతురు ఆత్మహత్యపై స్పందించాడు. నవీన, మాధవిలు ప్రాణస్నేహితులని, ఒకే రకమైన దుస్తులు, చెప్పులు ధరించేవారని, ఎప్పుడు ఒకేలా ఉండేవారని చెప్పాడు. మాధవి ఆత్మహత్యతో మనస్తాపం చెందే నవీన ఈ దారుణానికి పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. దసరా పండుగకు ఇంటికి వచ్చిన నవీన తమతో చాలా సంతోషంగా గడిపిన నవీన ఇకలేదంటూ రోదించాడు. అయితే నవీన ఆత్మహత్యలో పోలీసు అధికారులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని నార్సింగ్ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి 2.45 గంటల ప్రాంతంలో ఉస్మానియా మార్చురీకి తరలించారు. అంతేకాదు మృతికి గల కారణాలపై టీఎస్పీఏ అధికారులు పెదవి విప్పడంలేదు. -
ఎఫ్ఎస్ఎల్ అధికారికి జాతీయ అవార్డు
ఇన్డోర్ విభాగంలో ప్రకటించిన బీపీఆర్ అండ్ డీ సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్‌లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్న నెల్లూరు జిల్లా చిల్లకూరుకు చెందిన తరువు సురేష్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (బీపీఆర్ అండ్ డీ) దీన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పోలీసులకు శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్న నిపుణుల్ని ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా 153 మందిని అవార్డుల కోసం ఎంపిక చేసిన బీపీఆర్ అండ్ డీ ఈ నెల 21న జాబితా విడుదల చేసింది. ఇన్డోర్ శిక్షణ అంశంలో రాష్ట్రం నుంచి సురేష్‌కు ఈ అవార్డ్ లభించింది. సురేష్ గతంలో వరుసగా ఐదేళ్ల పాటు అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ కాన్ఫరెన్స్‌ల్లో అవార్డులు అందుకున్నారు. నేరాల దర్యాప్తునకు అవసరమైన కీలక భౌతిక సాక్ష్యాలను అందించడంలో సేవలు అందించి వాటికి ఎంపికయ్యారు. సురేష్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని క్లూస్ టీమ్‌లో సుదీర్ఘకాలం సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆపై కర్నూలు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఇన్చార్జ్గా వ్యవహరించారు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పోలీసు అకాడెమీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2009లో పుణేలోని జర్మన్ బేకరీలో బాంబు పేలుడు చోటు చేసుకున్న సందర్భంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన సురేష్ అక్కడి ఘటనా స్థలి నుంచి ఎన్నో కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తునకు సహకరించారు. అలిపిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి, గుంటూరులోని మంగళగిరిలో చోటు చేసుకున్న కల్తీ మద్యం విషాదం, నగరంలోని అలూకాస్ దుకాణంలో జరిగిన భారీ చోరీ, 2005లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి తదితర సందర్భాల్లో సురేష్ ఇచ్చిన భౌతిక సాక్ష్యాలు కేసులు ఓ కొలిక్కి రావడానికి ఎంతో ఉపకరించాయి. 2002లో చాదర్‌ఘాట్‌లో దొరికిన 10 పైపు బాంబులు, 2005లో పాతబస్తీ నుంచి రికవరీ చేసిన 10 కేజీల సెల్‌ఫోన్ బాంబు, 2007లో మక్కా మసీదులో దొరికిన పేలని బాంబులను నిర్వీర్యం చేయడంలో సురేష్ కీలకపాత్ర పోషించారు.