పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో డీఆర్‌డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణ కోసం క్షిపణులతోపాటు అనేక ఇతర టెక్నాలజీలు, పరికరాలను పోలీసులు, ఇతర పారామిలటరీ బలగాలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఆర్‌డీవో డైరెక్టర్, కేంద రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పేలుడు పదార్థాల గుర్తింపునకు అభివృద్ధి చేసిన కిట్లు మొదలుకొని, గుంపులను చెదరగొట్టేందుకు పనికొచ్చే మిరపకాయ బాంబుల వరకూ వేటినైనా పోలీసులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పోలీస్ వెంకటస్వామి కథలతోపాటు నేర విచారణ విషయంలో మార్గదర్శకుడైన ప్రొఫెసర్ ఎస్.వేణుగోపాలరావు శతజయంతి వేడుకల్లో సతీశ్‌రెడ్డి ‘డిఫెన్స్ టెక్నాలజీలు పోలీసు సంస్కరణలకు ఎలా ఉపయోగపడతాయి?’అన్న అంశంపై మాట్లాడారు.
గత కొన్నేళ్లుగా డీఆర్‌డీవో పారామిలటరీ బలగాల అవసరాలను తీర్చే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని.. క్షిపణులను మినహాయిస్తే మిగిలిన చాలా టెక్నాలజీలను దేశీయ అవసరాల కోసం వాడుకోవచ్చని ఆయన తెలిపారు. రెండు కిలోమీటర్ల పరిధిలో గుంపుపై నిఘా ఉంచేందుకు నేత్ర పేరుతో ప్రత్యేకమైన డ్రోన్ ఉందని, తాము అభివృద్ధి చేసిన పేలుడు పదార్థాల గుర్తింపు కిట్ టెక్నాలజీని అమెరికా కూడా వాడుతోందని తెలిపారు.
ఇవి మాత్రమే కాకుండా అననుకూల పరిస్థితుల్లో పనిచేసే సైనికుల కోసం తాము ఎన్నో ఇతర టెక్నాలజీలను అభివృద్ధి చేశామని, బుల్లెట్‌ప్రూఫ్ హెల్మెట్, బాడీ సూట్, దోమల మందు, అతి తక్కువ పదార్థంతో రోజుకు సరిపడా పోషకాలను ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి అనేక సాంకేతిక పరిజ్ఞానాలను స్థానిక పోలీసులు, ఇతర పారామిలటరీ బలగాలు వాడుకోవచ్చని స్పష్టం చేశారు. సైబర్ సెక్యూరిటీ సమస్యను అధిగమించేందుకు పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ సంతోష్ మెహ్రా, అడిషనల్ డైరెక్టర్లు టి.వి.శశిధర్‌రెడ్డి, డాక్టర్ ఎన్.అనితా ఎవాంజెలిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment