సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. తాజాగా తెలంగాణ పోలీసు అకాడమీలో కరోనా కలకలం రేపుతోంది. అకాడమీలోని 180 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్‌పీఏ) డైరెక్టర్ వీకేసింగ్ ధ్రువీకరించారు. కాగా, పోలీస్ అకాడమీలో 200 మందికి పైగా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కరోనా సోకిన వారిలో ఓ డీఐజీ ర్యాంకు అధికారి, ఒక అడిషనల్ ఎస్పీ, 4 డీఎస్పీ, 8 సీఐ స్థాయి అధికారులు సహా వందమంది శిక్షణ ఎస్‌ఐలు, 80 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అకాడమీలో 1100మందికిపైగా ఎస్‌ఐలు, 600 మందికిపైగా కానిస్టేబుళ్లతో సహా మొత్తం 1900 మంది శిక్షణ పొందుతున్నారని సమాచారం.(కరోనా కాలంలో ఈ పండ్లు తింటే బేఫికర్! )
దాంతో రాష్ట్ర పోలీస్ అకాడమీలో భయాందోళనలు నెలకొన్నాయి. మరొకవైపు పోలీస్ అకాడమీలో శిక్షణ కొనసాగుతుండటంతో క్యాడెట్ల తల్లి తండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. త్వరలోనే అకాడమీలో ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. కాగా, తొలుత అకాడమీలో పనిచేసే వంట మనిషి కరోనా సోకినట్టుగా సమాచారం. మరోవైపు రాష్ట్రంలో శనివారం సాయంత్రం వరకు 13,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం 243 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment