ఎఫ్‌ఎస్‌ఎల్ అధికారికి జాతీయ అవార్డు
-
ఇన్‌డోర్ విభాగంలో ప్రకటించిన బీపీఆర్ అండ్ డీ
సాక్షి, సిటీబ్యూరో :
హైదరాబాద్‌లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్న నెల్లూరు జిల్లా చిల్లకూరుకు చెందిన తరువు సురేష్ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (బీపీఆర్ అండ్ డీ) దీన్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా పోలీసులకు శిక్షణ ఇవ్వడంలో కీలకపాత్ర పోషిస్తున్న నిపుణుల్ని ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు. దేశ వ్యాప్తంగా 153 మందిని అవార్డుల కోసం ఎంపిక చేసిన బీపీఆర్ అండ్ డీ ఈ నెల 21న జాబితా విడుదల చేసింది. ఇన్‌డోర్ శిక్షణ అంశంలో రాష్ట్రం నుంచి సురేష్‌కు ఈ అవార్డ్ లభించింది. సురేష్ గతంలో వరుసగా ఐదేళ్ల పాటు అఖిల భారత ఫోరెన్సిక్ సైన్స్ కాన్ఫరెన్స్‌ల్లో అవార్డులు అందుకున్నారు. నేరాల దర్యాప్తునకు అవసరమైన కీలక భౌతిక సాక్ష్యాలను అందించడంలో సేవలు అందించి వాటికి ఎంపికయ్యారు. సురేష్ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోని క్లూస్ టీమ్‌లో సుదీర్ఘకాలం సైంటిఫిక్ ఆఫీసర్‌గా పని చేశారు. ఆపై కర్నూలు రీజనల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో పోలీసు అకాడెమీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2009లో పుణేలోని జర్మన్ బేకరీలో బాంబు పేలుడు చోటు చేసుకున్న సందర్భంలో హైదరాబాద్ నుంచి వెళ్లిన సురేష్ అక్కడి ఘటనా స్థలి నుంచి ఎన్నో కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తునకు సహకరించారు. అలిపిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడి, గుంటూరులోని మంగళగిరిలో చోటు చేసుకున్న కల్తీ మద్యం విషాదం, నగరంలోని అలూకాస్ దుకాణంలో జరిగిన భారీ చోరీ, 2005లో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి తదితర సందర్భాల్లో సురేష్ ఇచ్చిన భౌతిక సాక్ష్యాలు కేసులు ఓ కొలిక్కి రావడానికి ఎంతో ఉపకరించాయి. 2002లో చాదర్‌ఘాట్‌లో దొరికిన 10 పైపు బాంబులు, 2005లో పాతబస్తీ నుంచి రికవరీ చేసిన 10 కేజీల సెల్‌ఫోన్ బాంబు, 2007లో మక్కా మసీదులో దొరికిన పేలని బాంబులను నిర్వీర్యం చేయడంలో సురేష్ కీలకపాత్ర పోషించారు.