కార్యక్రమంలో మాట్లాడుతున్న చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్. చిత్రంలో డీజీపీ మహేందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పోలీసు, న్యాయవ్యవస్థలు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల వంటివని హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో రాజాబహద్దూర్ వెంకటరామిరెడ్డి (ఆర్‌బీవీఆర్‌ఆర్) తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 2019 కొత్త ఎస్సై(సివిల్) బ్యాచ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ, పోలీస్ విధుల్లో వ్యత్యాసమున్నా లక్ష్యం ఒక్కటేనన్నారు. పోలీసు అధికారులు సమాజం పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులతో వచ్చే ప్రజలతో సహనంతో వ్యవహరించాలన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న నేరాలపై శాస్త్రీయ దృక్పథం పెంచుకోవాలన్నారు. ప్రాథమిక హక్కులతోపాటు, చట్టాలన్నింటిపైనా పట్టు సాధించాలని సూచించారు. బృంద స్ఫూర్తి, స్మార్ట్‌వర్క్, సిటిజన్ ఫ్రెండ్లీ విధానాలకనుగుణంగా విధులు నిర్వహించాలన్నారు. ముడిరాళ్లను వజ్రాలుగా సానబెట్టే అవకాశం టీఎస్‌పీఏకి వచ్చిందని పోలీసు అకాడమీ డైరెక్టర్ వినయ్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని ట్రైనీ ఎస్సైలకు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్ బి.నవీన్‌కుమార్.. టీఎస్‌పీఏ నిబంధనలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జానకీషర్మిల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment