ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే | Seven New Judges Appointed For Telangana High court | Sakshi
Sakshi News home page

Telangana: ఏడుగురు జడ్జిల నియామకానికి ఓకే

Published Thu, Oct 14 2021 2:15 AM | Last Updated on Thu, Oct 14 2021 2:56 AM

Seven New Judges Appointed For Telangana High court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జ్యుడీషియల్‌ అధికారులు పెరుగు శ్రీసుధ, చిళ్లకూర్‌ సుమలత, గురిజాల రాధారాణి, మున్నూరి లక్ష్మణ్, నూన్సావత్‌ తుకారాంజీ, అద్దుల వెంకటేశ్వరరెడ్డి, ఐటీఏటీ సభ్యురాలు పటోళ్ల మాధవిదేవిలకు పదోన్నతి కల్పిస్తూ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో ప్రస్తుతం సీజే కాకుండా పది మంది న్యాయమూర్తులు ఉన్నారు. ఈ ఏడుగురి నియామకంతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరనుంది. కొత్తగా నియమితులైన నలుగురు మహిళా న్యాయమూర్తులతో మొత్తం మహిళా జడ్జిల సంఖ్య 5కు చేరింది. హైకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య 5కు చేరడం ఇదే తొలిసారి.

పోస్టుల సంఖ్య పెంచాక..
తెలంగాణ హైకోర్టులో జడ్జి పోస్టుల సంఖ్య 24గా ఉండేది. ఇటీవలే పోస్టుల సంఖ్యను 42కి పెంచారు. ప్రస్తుతం కేవలం 10 మంది న్యాయమూర్తులే ఉండగా.. మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా నియామకంతో న్యాయమూర్తుల సంఖ్య 17కు చేరింది. జిల్లా జడ్జిల నుంచి సీనియారిటీ ఆధారంగా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. కానీ, చాలా ఏళ్లుగా పదోన్నతులు ఇవ్వలేదు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పడ్డాక ప్రతిపాదన వచ్చినా అమల్లోకి రాలేదు. తాజాగా జడ్జి పోస్టుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో పదోన్నతులతో కొత్త నియామకాలు చేపట్టారు. న్యాయవాదుల నుంచి కూడా న్యాయమూర్తులుగా ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. ఇదిలాఉండగా, ప్రస్తుతం హైకోర్టులో 2.32 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త జడ్జిలు బాధ్యతలు స్వీకరించిన తరువాత కేసుల విచారణ వేగం పెరగనుంది.   

కొత్త న్యాయమూర్తులు వీరే.. 
పి.శ్రీసుధ: 1967, జూన్‌ 6న జన్మించారు. తొలుత నిజామాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా 2002లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ స్థాయిలో పనిచేసిన ఆమె ప్రస్తుతం కో–ఆపరేటివ్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా ఉన్నారు. 

డాక్టర్‌ సి.సుమలత: 1972, ఫిబ్రవరి 5న నెల్లూరు జిల్లాలో జన్మించారు. 2006లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. 

డాక్టర్‌ జి.రాధారాణి: 1963, జూన్‌ 29న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చీఫ్‌ జడ్జిగా ఉన్నారు. 

ఎం.లక్ష్మణ్‌: వికారాబాద్‌ జిల్లాకు చెందిన ఈయన 1965, డిసెంబర్‌ 24న జన్మించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తు తం లేబర్‌ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. 

ఎన్‌.తుకారాంజీ: 1973, ఫిబ్రవరి 24న జన్మిం చారు. 2007లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యా రు. ప్రస్తుతం హైదరాబాద్‌ క్రిమినల్‌ కోర్టుల మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జిగా ఉన్నారు. 

ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి: 1961, ఏప్రిల్‌ 1న జన్మించారు. 1994లో జడ్జిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం సిటీ సివిల్‌ ఆవరణలోని స్మాల్‌ కాజెస్‌ చీఫ్‌ జడ్జిగా పనిచేస్తున్నారు. 

పి.మాధవిదేవి: ఆదాయ పన్నుశాఖ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఐటీఏటీ) జ్యుడిషియల్‌ సభ్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement