ఒక్కొక్కరిది ఒక్కో విజయగాథ..
ప్రతి ఒక్క ఎస్సై కళ్లల్లో ఆనందం
పీవోపీ సందర్భంగా ఆవిష్కృతమైన విజయోత్సాహం
ఎంతోమంది కలలను తమ భుజాలపై మోశారు.. ఎందరో ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచారు. సమాజ భద్రతకు తామున్నామంటూ ప్రతినబూనారు. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందానికి కారణమయ్యారు. జీవిత భాగస్వాములు సగర్వంగా తలలు ఎత్తుకునేలా చేశారు. సొంతవారి కళ్లల్లో ఆనందబాష్పాలయ్యారు. చిట్టి పాపాయిల సంతోషానికి అవధుల్లేకుండా చేశారు. పాసింగ్ ఔట్ పరేడ్ పూర్తి చేసుకుని ఎస్సైలుగా నియమితులైన ఎందరో విజయగాథలు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆవిష్కృతమయ్యాయి. వారిలో కొందరిని ’సాక్షి’ పలకరించింది..
32 ఏళ్ల వయసులో...
ఒడిలో పాపాయికి చనుబాలు మాన్పించి.. 32ఏళ్ల వయసులో గ్రౌండ్ బాటపట్టారు. అనుక్షణం తనను తాను నిరూపించుకోవాలని వందకు రెండొందల రెట్లు కష్టపడ్డారు. మైదానంలో శివంగిలా దూకారు. మెదడుకు పదును పెట్టారు. పోలీసు శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్‌డోర్ విభాగాల్లో ఔరా అనిపించి టాపర్‌గా నిలిచి పాసింగ్ ఔట్ పరేడ్ కమాండెంట్‌గా నిలిచారు భాగ్యశ్రీ పల్లి. భద్రాచలంలోని సార΄ాక గ్రామానికి చెందిన భాగ్యశ్రీ చాలా పేదరికం నుంచి వచ్చారు. తండ్రి నాగేశ్వరరావు ఇప్పటికీ పెళ్లిళ్లకు వంటలు చేస్తుంటారు. తల్లి దుర్గ. భర్త పవన్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి. చదువు మాత్రమే పేదరికాన్ని దూరం చేస్తుందని నమ్మి చదువుపై శ్రద్ధ పెట్టారు. గతంలో గ్రూప్–4 ఉద్యోగం చేస్తూ సమాజానికి నేరుగా ఏదైనా సాయం చేయాలన్న తలంపుతో ఎస్సై కోసం సన్నద్ధమయ్యారు. ఆ సమయంలో ఎన్నో కష్టాలకు ఎదురొడ్డారు. భర్త ప్రోద్బలంతో ఇదంతా సాధ్యమైందని చెబుతున్నారు. శిక్షణలో ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని, ఫీల్డ్‌లో ఎంతో కష్టపడతానని పేర్కొన్నారు.
ఇద్దరు పిల్లల తల్లిగా..
ఇంట్లో ఏడు నెలల చిన్నారి.. మరో పాపకు రెండున్నర సంవత్సరాలు.. వారి ఆలనా పాలనా చూసుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆ తల్లి వారిని అమ్మమ్మ వద్ద వద్ద వదిలి తన కలలను నెరవేర్చుకునేందుకు అడుగు బయటపెట్టింది. ఆమే మణిమాల. సివిల్ సర్వీసెస్ సాధించాలనేది తన కోరిక. కానీ ఇంతలో ఎస్సై నోటిఫికేషన్ రావడంతో ఎలాగైనా ఆ జాబ్ కొట్టాలనే ఆకాంక్షతో బయల్దేరారు. ఎట్టకేలకు తన గమ్యాన్ని చేరుకుని, హౌరా అనిపించుకుంటున్నారు. ఈవెంట్స్ కోసం కష్టనష్టాలకోర్చి నిరూపించుకున్నారు. నాన్న పేరు నాగళ్ల శ్రీనివాసరావు. అంబర్‌పేటలోని సీపీఎల్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. భర్త డి.వెంకటనాగేశ్వరరావు కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తమ్ముడు అశోక్ ఇటీవల ఏఈఈగా ఎంపికయ్యాడు. అక్కా తమ్ముళ్లు కలిసే చదువుకునేవారు. శిక్షణ పూర్తి చేసుకుని పీవోపీలో పాల్గొని తల్లిదండ్రులు, భర్త కళ్లల్లో ఆనందం చూశారు. తండ్రి శ్రీనివాసరావు, స్నేహితురాలు సృజన తనకు స్ఫూర్తి అని ఆమె చెప్పుకొచ్చారు. ఒక మహిళగా ఆర్థిక స్వావలంబన ఉండటం చాలా ముఖ్యమని, తన విధి నిర్వహణలో భాగంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు కృషి చేస్తానని వివరించారామె.
27 సార్లు ప్రయత్నించి..!
నవీ¯Œ కుమార్ మానుపూరి.. సూర్యాపేట జిల్లా తాళ్లసింగారం గ్రామం. తల్లిదండ్రులు సంగయ్య, ఉపేంద్ర. తండ్రి చేనేత కార్మికుడు. ముగ్గురు కుమారుల్లో రెండో వ్యక్తి నవీన్ . చిన్నప్పటి నుంచి యూనిఫాం వేసుకొని ఆఫీసర్ హోదాలో గౌరవం పోందాలనేది అతడి కోరిక. ఆర్మీలో చేరేందుకు పట్టుదలతో ఎంతో కృషి చేశాడు. కమాండెంట్ అధికారి హోదా కోసం 27 సార్లు విఫలప్రయత్నం చేశాడు. ప్రతిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి రిజెక్ట్ అవుతుండేవాడు. కానీ పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడాడు. చివరకు ఎస్సైగా ఎంపికై.. బుధవారం జరిగిన ΄ాసింగ్ పరేడ్‌లో పాల్గొన్నాడు. పీవోపీ సమయంలో తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీళ్లు చూసినప్పుడు నా ఆనందం మాటల్లో చెప్పలేనిదంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
– వివేకానంద తంగెళ్లపల్లి, సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment