చేతన (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: చిన్నారి చేతన కిడ్నాప్ ఉదంతాన్ని పోలీసు పాఠ్యాంశంగా చేర్చాలని నగర పోలీసు విభాగం ప్రతిపాదించింది. ఈ కేస్ స్టడీని తెలంగాణ పోలీసు అకాడమీ(టీఎస్‌పీఏ)తోపాటు నేషనల్ పోలీసు అకాడమీ(ఎన్‌పీఏ)కి పంపాలని నిర్ణయించారు. సుల్తాన్‌బజార్ ప్రసూతి ఆస్పత్రి నుంచి చిన్నారిని నైన రాణి అనే మహిళ సోమవారం ఉదయం 11 గంటలకు కిడ్నాప్ చేయగా పోలీసులు రంగంలోకి దిగి 48 గంటల్లోగా కేసును ఛేదించి చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారుల స్పందన, సమన్వయం తదితరాలతో ఈ పాఠ్యాంశం రూపొందనుంది. చిన్నారిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు, కీలక ఆధారాలు అందించిన సీసీ కెమెరాలు, దర్యాప్తు అధికారులు అనుసరించిన విధానం తదితరాలతో సమగ్ర నివేదికను రూపొందించనున్నారు. ఇందులో నిపుణుల సాయంతో మార్పులు, చేర్పులు చేయించి పాఠ్యాంశంగా మారుస్తారు.
పోలీసుల స్పందనతో స్ఫూర్తి పొందిన చిన్నారి తల్లి విజయ తన కుమార్తెకు సుల్తాన్‌బజార్ ఏసీపీ చేతన పేరు పెడుతున్నట్లు ప్రకటించడాన్నీ ఈ పాఠ్యాంశంలో చేర్చనున్నారు. చిన్నారి చేతన కేసు పోలీసుల పనితీరుకు మాత్రమే కాకుండా బాధితుల విషయంలో సత్వరంగా, సరైన సమయంలో స్పందించి ఫలితాలు సాధిస్తే పోలీసులపై ఏర్పడే అభిప్రాయానికీ నిదర్శనమని అధికారులు చెప్తున్నారు. దీన్ని టీఎస్‌పీఏలో ఓ కేస్ స్టడీగా ప్రవేశపెట్టాల్సిందిగా డీజీపీకి లేఖ రాయనున్నారు. ఆయన అనుమతితో టీఎస్‌పీఏతోపాటు జిల్లాల్లోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లలోనూ ప్రవేశపెట్టే దీన్ని శిక్షణ, మధ్యంతర శిక్షణల్లో ఉండే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు అభ్యసిస్తారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసి అనుమతి పొందితే ఐపీఎస్ అధికారులు శిక్షణ తీసుకునే శివరాంపల్లిలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడమీలోనూ చేతన కేసు పాఠ్యాంశంగా మారుతుంది. చిన్నారి ఆచూకీ కోసం హైదరాబాద్, బీదర్ పోలీసులు సమన్వయంతో పనిచేయడంతోపాటు ఉమ్మడిగా కార్డన్ సెర్చ్‌లు నిర్వహించిన విషయం విదితమే.
68 గంటల్లో అరెస్టు... 32 గంటల్లో బెయిల్
చిన్నారి చేతనను కిడ్నాప్ చేసిన నైన రాణికి నాంపల్లి న్యాయస్థానం శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. శిశువును కిడ్నాప్ చేసిన తర్వాత ఈమెను పట్టుకోవడానికి 68 గంటల సమయం పట్టింది. అయితే, అరెస్టు చేసిన 32 గంటల్లోనే నిందితురాలికి బెయిల్ లభించడం గమనార్హం. దీనిపై సుల్తాన్‌బజార్ ఇన్‌స్పెక్టర్ పి.శివశంకర్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘నైన రాణి శిశువును పెంచుకోవడానికి మాత్రమే కిడ్నాప్ చేసింది. ఈ విషయంతోపాటు ఉదంతం పూర్వాపరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాం. ఈ నేపథ్యంలోనే ఆమెకు బెయిల్ మంజూరైంది. ఈ కేసుకు సంబంధించి నేర నిరూపణలో కీలకమైన టెస్ట్ ఐడెంటిఫికేషన్(టీఐడీ) పరేడ్ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం ఈమె బెయిల్ రద్దు చేయాల్సిందిగా కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment