Police Training Centre
-
సవాళ్లకు అనుగుణంగా శిక్షణలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి, పోలీస్ విధుల ఆధారంగా నూతన కానిస్టేబుళ్ల శిక్షణలో పలు మార్పు లు చేసినట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, శిక్షణ విభాగం డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాలు, మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్ శిక్షణలో అదనంగా చేర్చినట్టు వెల్లడించారు. లింగ వివక్షకు తావులేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో బిస్త్ పలు అంశాలను పంచుకున్నారు. సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 పోలీస్ శిక్షణ కేంద్రాల నుంచి 8,047 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్నారు. వీరిలో 4,116 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 3,685 మంది ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ సిలబస్‌లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం. సైబర్ నేర విధానం (మోడస్ అపరెండీ) ఎలా ఉంటుంది, ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం. యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్‌లో పాల్గొనడం, దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చాం. సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇన్‌డోర్‌తో పాటు ఔట్‌డోర్ శిక్షణలో సెల్ఫ్ డిఫెన్స్‌కు ప్రాధాన్యత పెంచాం. పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్ కానిస్టేబుళ్లకు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. నేర దర్యాప్తు, కేసుల నమోదు, క్షేత్రస్థాయి విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి, పై అధికారి వచ్చే వరకు క్రైం సీన్‌ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చాం. ఈ బ్యాచ్‌లో 5,470 మంది గ్రాడ్యుయేట్లు, 1,361 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 15 మంది ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారున్నారు. -
‘అధికారులు వేధిస్తున్నారని మాకు చెప్పేది.. ఇది హత్యే’
విజయనగరం: విజయనగరం జిల్లాలో ఎస్సై ట్రైనింగ్ లో ఉన్న కోడూరు మండలం సాలెంపాలెం గ్రామానికి చెందిన భవాని అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వేధిస్తున్నారని ఆమె తమతో చెప్పేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎస్సై ఆత్యహత్య చేసుకున్న విషయం తెలియడంతో స్వగ్రామమైన కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భవాని తన తల్లి అన్నలతో నివసిస్తోంది. శిక్షణ కోసం వెళ్తున్నట్లు ఇంటివద్ద తల్లికి చెప్పి వెళ్లిన భవాని ఇలా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. భవాని స్వగ్రామమైన సాలెంపాలెంలో బంధువులు, గ్రామస్తులు భవానిని హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, దోషులను శిక్షించి వారి కుటంబసభ్యులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చదవండి: 6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే ! -
టీఎస్ఎస్పీ అభ్యర్థులకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కొలువులకు ఎంపికై, దాదాపు ఏడాది నుంచి శిక్షణ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. నవంబర్ 9 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. ఈ మేరకు తొలుత ఈ నెల 26 నుంచి కరోనా పరీక్షలకు హాజరుకావాలని అభ్యర్థుల మొబైళ్లకు టీఎస్ఎస్పీ నుంచి సంక్షిప్త సందేశాలు వచ్చాయి. దీంతో 3,963 మంది అభ్యర్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. షెడ్యూల్ ప్రకారం.. అంబర్‌పేట, మేడ్చల్, కరీంనగర్, పోలీసు ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)ల్లో తొలుత వీరికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వస్తే శిక్షణ కేంద్రాలకు, పాజిటివ్ వస్తే అక్కడే తాత్కాలిక క్వారంటైన్లో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. వీరి శిక్షణ కోసం ఇప్పటికే మొదటి, మూడవ, ఏడవ, ఎనిమిదవ, 10వ, 13వ, 17వ బెటాలియన్లతోపాటు పీటీసీ వరంగల్, పీటీసీ మేడ్చల్‌తో కలిపి మొత్తం పది కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఏడాది నిరీక్షణ ఫలితం.. వాస్తవానికి 2018లో సివిల్, ఆర్మ్డ్ రిజర్వుడ్(ఏఆర్), టీఎస్ఎస్పీ విభాగాల్లోని దాదాపు 16వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ విడుదలైంది. 2019 సెప్టెంబర్ నాటికి పరీక్షలు, ఫలితాల విడుదల పూర్తయ్యాయి. సివిల్, ఏఆర్ విభాగాలకు ఎంపికైన అభ్యర్థులకు 2020 జనవరి 17న శిక్షణ మొదలైంది. మౌలిక సదుపాయాలు సరిపడా లేకపోవడం, మార్చిలో కరోనా లాక్డౌన్ కారణంగా టీఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఈలోగా సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల తొమ్మిది నెలల శిక్షణ పూర్తయ్యింది. వారికి పోస్టింగులు కూడా దాదాపు ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలో ఏడాది తరువాత తమకు ఎట్టకేలకు శిక్షణకు పిలుపురావడంపై టీఎస్ఎస్పీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షణకు ఇంకా ఎనిమిది రోజులే ఉండటంతో అభ్యర్థులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ఉన్నతాధికారులు సూచించారు. -
చైనాపై ట్రైనింగ్ కాలేజీ కీలక నిర్ణయం!
సాక్షి, కరీంనగర్: చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఆ దేశ వస్తువులను నిషేదించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రాగన్ దేశపు వస్తువులు, మొబైల్ అప్లికేషన్లను బహిష్కరించింది. తమ కాలేజీలో శిక్షణలో ఉన్న ట్రైనీ పోలీసులకు ఈ మేరకు సూచనలిచ్చింది. గల్వాన్ ఘటన నేపథ్యంలోనే ఈమ కాలేజీలో ఉన్న ట్రైనీ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల, ఎస్ఐలు చైనాకు చెందిన వస్తువులు, యాప్స్‌ని బాయ్‌కాట్ చేశారని కాలేజీ ప్రిన్సిపల్ జి.చంద్రమోహన్ శనివారం తెలిపారు. దీనికి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని, అందరం స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయమని అన్నారు. (చదవండి: రుగ్వేద కాలం నుంచే అంటురోగాలు) చైనా ఉత్పత్తులపై ఆధారపడకుండా భారత్ స్వశక్తిగా ఎదగాలని ఆయన ఆకాక్షించారు. కాగా, కాలేజీ ప్రవేశద్వారం వద్ద ‘ఈ కాలేజీలో చైనా యాప్‌లు, ఉత్పత్తులు నిషేదించబడ్డాయి’ అని బ్యానర్ కూడా పెట్టారు. ఇక్కడ 880 మంది ట్రైనీలు, 150 మంది సిబ్బంది ఉన్నారు. కాగా, జూన్ 15 రాత్రి చైనాతో జరిగిన ఘర్షణల్లో కల్నల్ సంతోష్‌బాబుతో సహా 21 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఇక చైనా యాప్స్‌లో పాపులరైన టిక్‌టాక్‌ను డిలీట్ చేయాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే యూజర్లకు శుక్రవారం పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది చైనీస్ యాప్స్‌ను వాడుతున్నట్టు వెల్లడైంది. (వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్) -
వైరల్ : భలే గమ్మత్తుగా పోలీస్ ట్రైనింగ్
పోలీస్ ట్రైనింగ్‌లో శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోజులో 18 గంటల పాటు వివిధ రకాల ట్రైనింగ్ సెషన్స్‌లో పాల్గొనడంతో ఒళ్లు నొప్పులు పుట్టడం ఖాయం. ఎంతైనా అలాంటి కఠిన శిక్షణ ఉంటేనే కదా.. వారు శారీరకంగానూ, మానసికంగానూ ధృడంగా తయారయ్యేది. తాజాగా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో ట్రైనీ పోలీసులకు శిక్షణ ఇస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(వైరల్: వీళ్లు మనసు దోచుకున్న దొంగలు!) వివరాలు.. మహ్మద్ రఫీ.. తెలంగాణ పోలీసుశాఖలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్న రఫీ ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తున్నాడు. పోలీసైన రఫీకి బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహ్మద్ రఫీ పాటలంటే ప్రాణం.. ట్రైనీ పోలీసులకు శిక్షణ కఠినంగా అనిపించకుండా ఉండేదుకు రఫీ పాటలు పాడుతూ శిక్షణ నిర్వహిస్తుంటాడు . తాజాగా 1970లో వచ్చిన హమ్‌జోలీ సినిమా నుంచి రఫీ పాడిన 'దల్ గయా దిన్.. హో గయి శామ్' పాటను పాడుతూనే శిక్షణ నిర్వహించాడు. ఈ వీడియోనూ ఇండియన్ పోలీస్ సర్వీస్ అసోసియేషన్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..' ఇవి శిక్షణకు సంబంధించి మా రఫీ చేస్తున్న పాటలు.. ఒకరేమో పోలీస్.. మరొకరేమో లెజండరీ సింగర్..ఇద్దరు పేర్లు కామన్‌గా ఉన్నా.. మా రఫీ కూడా పాటలు బాగా పాడుతాడు. ట్రైనీ పోలీసులకు శిక్షణ అందిస్తూనే వారికి ఇంటి బెంగను, శారీరక శ్రమను మరిచిపోయేలా చేస్తాడు.. నిజంగా ఇది అతనికున్న గొప్ప అభిరుచి' అంటూ క్యాప్షన్ జత చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. -
రాష్ట్రంలో ప్రత్యేక పోలీస్ శిక్షణ కేంద్రం
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమల్లో భాగంగా ఏపీలో ప్రత్యేక పోలీస్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల(ఏపీపీ) భర్తీ పరీక్షా ఫలితాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్‌కుమార్, డీజీపీ డి.గౌతమ్ సవాంగ్, ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(ఏపీఎస్ఎల్పీఆర్) చైర్మన్ అమిత్ గార్గ్‌తో కలిసి హోంమంత్రి మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో విడుదల చేశారు. పోలీస్ శిక్షణా సంస్థ ఏపీకి చాలా అవసరమనే విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకెళ్లారని సుచరిత వెల్లడించారు. దిశ బిల్లు చట్ట రూపం దాల్చే ప్రక్రియ ఆగలేదని పేర్కొన్నారు. ఈ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాలను నివృత్తి చేశామని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగులను వెయిటింగ్లో(వీఆర్) పెడుతున్నారని, జీతాలు ఇవ్వడం లేదంటూ కొన్ని మీడియా సంస్థలు, కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ విమర్శించారు. అందరికీ పోస్టింగ్లిస్తున్నామని గుర్తు చేశారు. 50 శాతానికి పైగా మహిళలే.. రాష్ట్రంలో ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 50 ఏపీపీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను హోం మంత్రి విడుదల చేశారు. మొత్తం 50 పోస్టులకుగాను 49 మందిని ఎంపిక చేశారు. జోన్–4లో ఆర్థోపెడికల్లీ హ్యాండీకాప్డ్(మహిళ) కేటగిరీ కింద కేటాయించిన పోస్టుకు అర్హతలు గల అభ్యర్థి లేకపోవడంతో దానిని భర్తీ చేయలేదు. మొత్తం పోస్టుల్లో 50 శాతానికి మహిళలే ఎంపికవడం విశేషం. ఎం.లావణ్య 281.50 మార్కులు, సీహెచ్ చంద్రకిషోర్ 277.3 శాతం మార్కులు, తేజశేఖర్ 251 మార్కులతో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
డిసెంబర్ నుంచి కానిస్టేబుల్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ద్వారా ఎన్నికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు డిసెంబర్ తొలి వారంలో శిక్షణ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఉమ్మడి 10 జిల్లాల్లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీ (పీటీసీ)ల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. 18,428 వేల పోస్టుల భర్తీలో భాగంగా ఎస్సై 1,272, కానిస్టేబుల్ 17,156 పోస్టుల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎస్సైల శిక్షణ ప్రారంభమైంది. అయితే కానిస్టేబుళ్లందరికీ ఒకేసారి శిక్షణ ఇవ్వడం తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరిలో కొందరిని ఆంధ్రప్రదేశ్‌లోని ట్రైనింగ్ కాలేజీలకు పంపాలని నిర్ణయిం చారు. ఈ మేరకు ఏపీ పోలీసు శాఖతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఎంత మంది అభ్యర్థులని ఏపీకి పంపుతారన్న దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. -
డంపింగ్ యార్డుల్లా పోలీస్ శిక్షణ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శిక్షణ కేవలం తంతులా మారిందని, దేశం, రాష్ట్రాల్లోని వివిధ పోలీసు శిక్షణ కేంద్రాలు డంపింగ్ యార్డుల్లా మారాయని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ) డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణ ఒక తంతులా మారింది. దేశంలోని పోలీసు ట్రైనింగ్ అకాడమీలు డంపింగ్ యార్డుల్లా మారాయి. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీఎన్పీఏ) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న ఐపీఎస్‌లలో కూడా అంకితభావం కొరవడటం బాధాకరం. ప్రస్తుత శిక్షణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడట్లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పనికొచ్చేలా పోలీసు శిక్షణను సంస్కరించాలి. దేశంలో బ్రిటిష్ కాలం నాటి పోలీసు విధానాల్లో మార్పులు రావాలి. డబ్బులు, పరపతి ఉన్న వారితో పోలీసులు స్నేహంగా మెదులుతున్నారు. విధి నిర్వహణలో నిత్యం వందలాది మంది ప్రాణాలర్పిస్తున్నా.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకభావం కారణంగా పోలీసులపై సదభిప్రాయం కలగట్లేదు. ఈ విషయంలో మార్పురావాలి. అందుకే పోలీసు శిక్షణలో సమూల సంస్కరణలు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ప్రజలకు అనుకూలంగా లేదు. జైలులో ఉంటున్న ఖైదీల్లో 90 శాతం పేదవారే, 70 శాతం శరణార్థులు ఉన్నారు. వారు ఎందుకు అరెస్టయి జైల్లో ఉన్నారో తెలుసుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారు. శిక్షణలో ఒకలా.. విధుల్లో మరోలా.. ‘శిక్షణలో పోలీసులు నేర్చుకున్న దానికి, విధుల్లో చేరాక చేస్తున్న దానికి సంబంధం ఉండట్లేదు. ప్రజల బాధలు తెలిసేలా.. శిక్షణ సమయంలోనే అనాథ, వృద్ధ, షెల్టర్‌హోమ్‌లు సందర్శించేలా చూస్తున్నాం. ఇంటెలిజెన్స్, ఏసీబీ ఇతర శాఖల అధికారులతో తరగతులు నిర్వహిస్తాం. అంకితభావంతో పనిచేసే పోలీసులను తయారు చేయడం మా సంకల్పం. అందుకే ప్రతి పోలీసు అ«ధికారికి శిక్షణ కాలం నుంచే అబ్జర్వేషన్ రిపోర్ట్ ప్రవేశపెట్టనున్నాం. భవిష్యత్తులో పోస్టింగులు, బదిలీల్లో ఇదే ప్రామాణికం కానుంది. దీనికి డీజీపీ కూడా సుముఖత వ్యక్తం చేశారు. పోలీసులు చట్టానికి మాత్రమే జవాబుదారీగా ఉండాలి. సమాజంలో పోలీసు కావాలంటే దేహదారుఢ్యమే ముఖ్యం కాదు.. శారీరక లోపాలున్నా నిజాయతీగా పనిచేయొచ్చు. ఇటీవల నిర్వహించిన సర్వేలో తెలంగాణ అవినీతిలో ముందు ఉండటం బాధాకరం. పోలీసులు సమర్థంగా పనిచేస్తే ఇలాంటివి జరగవు. నేషనల్ పోలీస్ అకాడమీనే కాదు.. దేశంలో ఎవరూ చేయలేని నూతన సంస్కరణలను టీఎస్‌పీఏలో తీసుకొస్తాం. చట్టాలు, ఆయుధ, శారీరక, ఆత్మరక్షణ శిక్షణే కాదు.. ప్రజలకు సేవలు చేసేందుకు దోహదపడేలా ప్రయోగశాలగా మారుస్తాం. వ్యవస్థను మార్చలేను.. కానీ శిక్షణ విధానాన్ని మార్చగలను. ఈ నెల 24 నుంచి ఎస్సైలకు శిక్షణ ప్రారంభమవుతుంది’అని వీకే సింగ్ వివరించారు. -
కాబోయే పోలీసులకు కొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్ : ఏదైనా ఉదంతం జరిగినప్పుడు స్పందిస్తే అది రియాక్టివ్ పోలీసింగ్... అసలు ఎలాంటి ఉదంతం చోటు చేసుకోకుండా దాన్ని ముందే గుర్తించి నిరోధిస్తే అది ప్రొయాక్టివ్ పోలీసింగ్... రెండో తరహా విధానానికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీసు విభాగంలో అడుగు పెట్టడానికి ముందే అభ్యర్థులకు దీంతో పాటు ఇతర విధానాలను బోధించాలని స్పష్టం చేశారు. దీనికోసం తెలంగాణ పోలీసు అకాడెమీ కేంద్రంగా సాగే పోలీసు శిక్షణ విధానంలో అవసరమైన మార్పుచేర్పులకు ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీసింగ్‌లో సమకాలీన అవసరాలకు తగ్గట్టు శిక్షణలో చేర్పులు చేయడానికి డీజీపీ కార్యాలయం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో ప్రారంభంకానున్న 18 వేల మంది శిక్షణ మాడ్యుల్లో ఈ కొత్త పాఠాలు చేరనున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు చెందిన తుది ఫలితాలు జూన్ మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఆపై గరిష్టంగా నెల రోజుల్లోనే వీరికి శిక్షణ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపు కొత్త పాఠాలకు తుది రూపు ఇవ్వడానికి ప్రత్యేక కమిటీ కసరత్తు చేస్తోంది. సమూల మార్పులతో... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసింగ్‌లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. సంప్రదాయ పోలీసు విధానాలకు అదనంగా గడిచిన ఐదేళ్లలో ఎన్నో కొత్త అంశాలు వచ్చిచేరాయి. ప్రజలకు మెరుగైన సేవలందించటానికి ఉపకరించే ఓ కొత్త అంశాన్ని పోలీసు విభాగం ప్రవేశపెట్టిన ప్రతిసారీ సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇస్తోంది. దీనికోసం కమిషనరేట్లు, జిల్లాల వారీగా శిక్షణ ఇచ్చేందుకు కొందరిని ఎంచుకుంటోంది. ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ పేరుతో కార్యక్రమాలు చేపట్టి వీరికి డీజీపీ కార్యాలయం కేంద్రంగా తర్ఫీదు ఇస్తున్నారు. ఇది పూర్తి చేసుకుని వెళ్తున్న ఈ ట్రైనర్లు తమ పరిధిలో ఉన్న ఇతర సిబ్బంది, అధికారులకు విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి అవసరం లేకుండా ఇకపై పోలీసు విభాగంలో అడుగుపెట్టే వారికి ట్రైనింగ్‌లోనే సమకాలీనంగా అందుబాటులోకి వచ్చిన అంశాలు, విధానాలను బోధించనున్నారు. కొత్త పాఠాల్లో భాగంగా ప్రోయాక్టివ్ పోలీసింగ్‌తో పాటు యూనిఫామ్డ్ సర్వీస్ డెలివరీకి కీలక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీని ప్రకారం హైదరాబాద్‌లోని పోలీసుస్టేషన్లలో ఏ తరహా స్పందన, సేవలు ఉంటున్నాయో... ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల మండలంలో ఉన్న ఠాణాలోనూ అదే విధంగా ఉండాలి. ఈ అంశాన్ని శిక్షణ సమయం నుంచే బోధించనున్నారు. ప్రజలకు మరింత సన్నిహితం కావడానికి, పోలీసు విధులు, దర్యాప్తుల్లో సహకరించడానికి, నేరాల నిరోధం, కేసులు కొలిక్కి తీసుకురావడానికి హాక్–ఐ, టీఎస్ కాప్ వంటి వివిధ రకాలైన అధికారిక యాప్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటికి చెందిన అంశాలతోనూ ఓ పాఠం రూపొందిస్తున్నారు. ఇటీవల కాలంలో కమ్యూనిటీ పోలీసింగ్ అనేక అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. సాధారణ ప్రజలకూ పోలీసింగ్‌లో భాగస్వామ్యం కల్పించే ఈ విధానాన్ని ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం అమలులోకి తీసువచ్చింది. దీని నిర్వహణా అంశాలను బోధించనున్నారు. 16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి.. ఎస్పీ స్థాయి అధికారి నుంచి కానిస్టేబుల్ వరకు... పోలీసుస్టేషన్లో ఉండే వివిధ విభాగాలకు పని విభజన చేస్తూ 16 రకాలైన వర్టికల్స్‌ను రూపొందించి అమలు చేస్తున్నారు. దీంతో పాటు సీసీ కెమెరాల ప్రాధాన్యం, కమ్యూనిటీ కెమెరాలు, నేను సైతం ప్రాజెక్టు కింద ఏర్పాటు చేయించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ మరో పాఠ్యాంశం ఉండనుంది. రాష్ట్రంలోని పోలీసుస్టేషన్లలో రిసెప్షన్స్ ఏర్పాటు చేసిన తర్వాత గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వీటికి నేతృత్వం వహించేది కానిస్టేబుల్ స్థాయి అధికారులే. వీరి ప్రవర్తన, తీరుతెన్నులే ఫిర్యాదుదారులకు ఊరట, పోలీసు విభాగంపై ఓ అభిప్రాయాన్ని ఏర్పరుస్తాయి. ఈ నేపథ్యంలోనే రిసెప్షన్ నిర్వహణలో మెళకువల్నీ ట్రైనింగ్‌లోనే నేర్పాలని నిర్ణయించారు. పోలీసు శిక్షణలో కొత్తగా చేరుస్తున్న అంశాలు కేవలం పాఠాలుగానే ఉండకుండా ప్రత్యేక కమిటీ చర్యలు తీసుకుంటోంది. ట్రైనింగ్ మాడ్యుల్‌లోకి చేరే కొత్త పాఠాల్లో ఆయా విధానాల వల్ల ఇప్పటికే వచ్చిన ఫలితాలను అభ్యర్థులకు వివరించనున్నారు. ఇందులో భాగంగా కొన్ని కేస్ స్టడీస్‌తో పాటు తగ్గిన నేరాల శాతం తదితరాలనూ ప్రత్యక్ష ఉదాహరణలుగా పాఠంలో చేరుస్తున్నారు. ఈ సిలబస్‌తో శిక్షణ పూర్తి చేసుకునే తొలి బ్యాచ్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి మార్పుచేర్పులు చేయాలని డీజీపీ కార్యాలయం భావిస్తోంది. -
ఏకంగా జడ్జీ సీటులో కూర్చొని.. అడ్డంగా బుక్కయ్యాడు!
భోపాల్ : సెల్ఫీలపై మోహంతో కొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నా.. జనాల్లో మార్పు రావడం లేదు. సమయం, సందర్భం లేకుండా సెల్ఫీలు తీసుకుంటూ.. ఇతరులను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. వారు కూడా ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా న్యాయమూర్తి కుర్చీలో కూర్చొని సెల్ఫీలు దిగిన ట్రైనీ కానిస్టేబుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ అవతార్ రావత్ అనే వ్యక్తి ఉమారియా పోలీస్ అకాడమీలో ట్రైనీగా ఉన్నాడు. శనివారం రోజు జిల్లా కోర్టుకు వెళ్లిన రావత్.. కోర్టు ప్రాగణంలోని న్యాయమూర్తి గది తెరచి ఉండటంతో అందులోకి వెళ్లాడు. న్యాయమూర్తి సీటులో కూర్చొని సెల్ఫీలు దిగసాగాడు. రావత్ సెల్ఫీలు దిగడాన్ని గమనించిన గుమస్తా శక్తిసింగ్ ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో కొత్వాలి పోలీసులు రావత్‌పై కేసు నమోదు చేశారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ఏ నోటిఫికేషన్ ఇచ్చినా చిక్కులే
సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి నీళ్లు, నిధులు, నియామకాలే ప్రామాణికమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలీసుల శిక్షణ శిబిరంలో మంత్రి శనివారం మాట్లాడారు. ఉద్యోగుల ని యామకానికి రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నా యని తెలిపారు. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టుల ద్వారా న్యాయపరమైన చిక్కులు వస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా వాటిని అధిగమించి నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీలో పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో 6 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, తెలంగాణ వచ్చాక నాలుగేళ్లలో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు కేటీఆర్ వివరించారు. న్యాయపరమైన చిక్కులు లేకుంటే ఈ పాటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ అయ్యేవన్నారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది ఉద్యోగులు ఉండగా ప్రైవేటు రంగంలో నాలుగేళ్లలో లక్షన్నర ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో సమర్ధత చాటుకుని ఉద్యోగాలు సాధించాలని మంత్రి కోరారు. తెలంగాణలో ఉద్యోగుల నియామకాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. తెలంగాణ టీ–సాట్ ద్వారా వైద్య, విద్య రంగాలకు సంబంధించి నిపుణ చానల్ ద్వారా ఉచితంగా నాణ్యమైన విద్యా విషయాలను నిరుద్యోగులకు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని యువకులు ఈ చానల్‌ను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్యాక్షనిస్టుల పాత ఆయుధాలు నిర్వీర్యం
కర్నూలు: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో ఫ్యాక్షనిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న 1,575 తుపాకులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1976 నుంచి 2009 వరకు పలు కేసుల్లో ఎస్బీబీఎల్ గన్స్ 260, ఎస్బీఎంఎల్ గన్స్ 256, బీబీఎల్ గన్స్ 78, పిస్టల్స్ 522, రివాల్వర్లు 364, రైఫిల్స్ 93, స్టెన్ గన్స్, తపంచ, ఎయిర్ గన్స్, ఎయిర్ పిస్టల్స్.. మొత్తం 1,575 తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆయుధాల సీజ్ 1998లో ఎక్కువ జరిగిందని వివరించారు. పై అధికారుల అనుమతితో పాత ఆయుధాలను రోడ్డు రోలర్‌తో తొక్కించి పూర్తిగా నాశనం చేశామని, తర్వాత కాల్చి ఇక్కడే గుంతలో పూడ్చి పెట్టినట్లు చెప్పారు. మరో 12 పాత ఆయుధాలను నిర్వీర్యం కమిటీ ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ ప్రదర్శన నిమిత్తం ఉంచామన్నారు. -
అమ్మ గుర్తొస్తే చిన్నపిల్లాడే...
– సాక్షి ప్రతినిధి, విజయనగరం గుబురు మీసాలతో పులిలా కనిపించే ఆయనకు అమ్మపై ఎనలేనంత ప్రేమ ఉంది. ఆమెను తలచుకుంటే చాలు కన్నీటి పర్యంతమయ్యేంత అనురాగం ఉంది. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడగల సత్తా ఉంది. చేపట్టిన పనుల్లో తన ముద్ర కనిపించాలనే తపన ఉంది. యాభై ఎనిమిదేళ్ల వయసులోనూ ఎవరికీ వెరవని తెగువ ఉంది. ఇప్పటికీ విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తగల సత్తా ఉంది. పోలీసుశాఖలో అడుగుపెట్టేవారెందరినో తీర్చిదిద్దగల అసమాన ప్రతిభ ఉంది. ఆయనే విజయనగరం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ (పీటీసీపీ) కె.రాజశిఖామణి. విభిన్న మలుపులు, ఎన్నో విశేషాలతో నిండిన ఆయన వ్యక్తి గత జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఆ విశేషాలు మీ కోసం.. సాక్షి: మీ స్వస్తలం, చదువు గురించి? పీటీసీపీ: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరిపాడు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. ఆ ఊళ్లో అప్పట్లో చదువుకున్నది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మా నాన్న కాకుమాని కోటయ్య, మరొకరు మా చిన్నాయన ప్రసాద్. ఇద్దరూ బీఏ చదివారు. నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తర్వాత ఒంగోలుకు బదిలీ అయ్యారు. నేను, తమ్ముడు రాజశేఖర్ అక్కడే పుట్టాం. ఇద్దరం ఫుట్‌బాల్ బాగా ఆడేవాళ్లం. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ(ఏబీఎం) హైస్కూల్లో చదువుకున్నాం. ముఫ్పై ఎకరాల్లో ఉండే ఆ హైస్కూల్లో మూడు ఫుట్‌బాల్ కోర్టులు, బాస్కెట్ బాల్, బేస్‌బాల్ కోర్టులుండేవి. అందువల్ల వాటన్నిటిలోనూ ప్రావీణ్యం తెచ్చుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్ ఆడేవాడ్ని, తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్శిటీ చాంపియన్‌గా నిలిచాను. సాక్షి: పోలీస్ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టడానికి కారణం? పీటీసీపీ: అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకునేవారు. కానీ వారికి చెప్పకుండానే పోలీస్ అయిపోయాను. చిన్నప్పుడు ఎన్టీఆర్, కృష్ణ సినిమాలు ఇంట్లో తెలియకుండా బాగా చూసేవాడిని. ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే వెళ్లి సాయం చేయడం అనేది ఆ సినిమాల ప్రభావమే. నాకు ఏడో తరగతి నుంచే పోలీస్ అవ్వాలనుండేది. స్కౌట్స్‌లో చేరాను. మొద ట్లో ఆర్మీలో చేరాలనుకునేవాణ్ని. దాని కోసం బీఎస్సీ నుంచి ఎకనామిక్స్లోకి మార్చమని ప్రిన్సిపల్‌ను అడిగాను, కుదరదంటే చదువు మానేస్తానన్నాను. అలా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీలో ఉండగా ఎన్సీసీ ద్వారా రిపబ్లిక్ డే పరేడ్స్లో పాల్గొన్నాను. మిల్కా సింగ్ స్టోరీ చదివి నేనూ అలా అయిపోవాలని ఆర్మీలో వంటవాడి పోస్టుకు దరఖాస్తు చేసేశాను. ఎంపికయ్యాను కానీ వద్దని అందరూ వారించడంతో చేరలేదు. తర్వాత పోలీస్ సెలక్షన్స్‌కు వెళ్లాను. 2.50 నిమిషాల్లో 800 మీటర్లు పరిగెత్తమంటే 2 నిమిషాల్లోనే పరుగెత్తి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాను. ఇంటర్వూ్యకు కూడా గెడ్డం, మీసాలతో వెళ్లాను. సెలక్టర్లు అడిగితే ఉద్యోగం వస్తే తీస్తానని సమాధానం చెప్పాను. నువ్ ఏం చేస్తావ్ అని అడిగితే ఏదైనా చేస్తానన్నాను. సర్టిఫికెట్లు కూడా చూడకుండా ఉద్యోగం ఇచ్చారు. సాక్షి: ఇంటెలిజెన్స్ వైపు ఎందుకెళ్లారు? పీటీసీపీ: పోలీస్ శిక్షణ కోసం 1981లో అనంతపురంలో అడుగుపెట్టాను. వెళ్లగానే గుండు చేసేశారు. అక్కడ శిక్షణ సరిపోయేది కాదు. అదనంగా మరో పదికిలోమీటర్లు పరిగెత్తేసేవాడిని, ఐదొందల పుషప్స్ తీసేసేవాడిని. తర్వాత తొలిపోస్టింగ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చింది. అది నాకు నచ్చలేదు. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఇంటెలిజెన్స్‌కు పంపించమని అడిగాను. సెలక్షన్ పెడితే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా రెండవ స్థానం సాధించాను. ఉన్నతాధికారి రత్నారెడ్డి నన్ను ఎంపిక చేశారు. తర్వాత శిక్షణ కోసం ఎల్బీ స్టేడియానికి వెళితే అక్కడ కోచ్ నన్ను ‘పనికిరావు పో’ అన్నారు. రెండు నెలలు అతని కోచింగ్ చూసి నోట్స్ రాసుకుని, దానికి రెండింతలు చేసేశాను. తర్వాత కాకినాడ మూడవ బెటాలియన్‌కు శిక్షణ కోసం ఉత్తర్వులు వచ్చాయి. అక్కడికి వెళ్లాక జీతం అంతా తిండికే ఖర్చుచేసి, నాన్నకు ఫోన్ చేసి నెల నెలా రూ.1500 పంపమనేవాడ్ని. రోజుకు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేసేవాడ్ని. 1982లో 1500 మీటర్లు 4 నిమిషాల్లో పరిగెత్తాను. ఇంత వరకూ ఈ రికార్డ్‌ను ఎవరూ క్రాస్ చేయలేదు. సాక్షి: కమాండోగా ఎలా మారారు: పీటీసీపీ: ఇంటెలిజెన్స్‌లో ఉండగా ఒకసారి హెవీ వెయిట్ ఎత్తడంతో ఎముకకు దెబ్బతగిలి రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. కోలుకున్నాక స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం కమాండో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాను. ఎన్ఎస్జీకి వెళ్లిపోయాను. తొలి బ్యాచ్‌లో అన్ని రాష్ట్రాల నుంచి 140 మంది ఉంటే వారిలో నేనే ఫస్ట్ వచ్చాను. సాక్షి: పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? పీటీసీపీ: నా భార్య ప్రశాంతి గృహిణి. మా అబ్బాయి రాజ్‌భరత్ ఇంజినీర్. కుమార్తె అంకిత్‌రాజ్ బాడ్మింటన్ క్రీడాకారిణి. మా అమ్మాయి పేరుమీదనే అంకిత్ స్పోర్ట్స్ అకాడమీని ఐదేళ్ల క్రితం స్థాపించాం. ఎంతో మంది ఐపీఎస్‌లకు పరీక్షలు నిర్వహించిన అనుభవం నాది. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నాను. ఉద్యోగ విరమణ తర్వాత సొంతూరుకు వెళ్లి అకాడమీ బాగోగులు చూసుకుంటాను. సాక్షి: పీఎం, సీఎంల వద్ద పనిచేసిన అనుభవం? పీటీసీపీ: 1985 నుంచి 1989 వరకూ ఎన్‌టి రామారావు వద్ద, అంతకుముందు చెన్నారెడ్డి వద్ద కొంతకాలం చేశాను. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాదే. నన్ను ఆయన పేరుపెట్టి పిలిచేవారు. మైసూరా రెడ్డి దగ్గర చాలా కాలం పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు వారితో చర్చలు జరపడానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు కమాండోలతో పాటు నేను ఎలాంటి ఆయుధం లేకుండా వెళ్లాను. మావోయిస్టులకు వెళ్లి రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. గతేడాది విజయనగరం పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీపై వచ్చాను. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులకు తోడు నా శ్రమను జోడించి రూ.కోట్ల విలువైన పనులు చేయించాను. ఇప్పుడు నా దగ్గర 620 మంది శిక్షణ తీసుకుంటున్నారు. సాక్షి: మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను? పీటీసీపీ: మా ఇంటికి బాస్ మా అమ్మే. ఆమె పేరు విమల. చాలా స్ట్రిక్ట్. నాన్నయినా, నేనయినా ఎవరైనా అమ్మ చెబితే ఎస్ బాస్ అనాల్సిందే. బీఎస్సీ నర్శింగ్ చదివిన ఆమె మా ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. మేం ఎప్పుడూ ఆస్పత్రికి పోలేదు. ఏం వచ్చినా అమ్మచేతిలోనే తగ్గిపోయేది. సాయంత్రం 6 గంటలు దాటే సరికి ఇంటికి వచ్చేయాల్సిందే. ఏడు గంటలకే పడుకోవడం, తెల్లవారుజామున 4గంటలకే నిద్ర లేవడం ఆమెవల్లే అలవాటైంది. ఆహార అలవాట్లు, విశ్రాంతి తీసుకోవడం నా ఆరోగ్య రహస్యం. 68 ఏళ్ల వయసులో అమ్మ అనారోగ్యం పాలైనప్పుడు ఏడుపొచ్చేసింది. ఇప్పుడు కూడా తలచుకుంటుంటే...(ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ) చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా నాకేదైనా అనారోగ్యంగా ఉన్నా, మనసు బాగోలేకపోయినా వెంటనే ఊరు నుంచి అమ్మను పిలిపించుకునేవాడిని. అమ్మంటే అంత ఇష్టం. అనారోగ్యమే అమ్మను మా నుంచి దూరం చేసింది. కానీ ఆమె జ్ఞాపకాలు నాతోనే ఎప్పుడూ ఉంటాయి. ఆఫీస్‌లో నా కళ్లెదురుగా ఉన్న మా అమ్మ ఫొటోను చూస్తున్నప్పుడల్లా ఆమె ఒడిలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నా వరకూ చివరి రోజుల్లో అమ్మా, నాన్నలను కష్టపెట్టకుండా బాగా చూసుకున్నాను. నేనే కాదు ఎవరైనా అలానే చూసుకోవాలి. వారి తర్వాతే కదా ఏదైనా, ఎవరైనా.! -
గోల్ కొట్టారు
♦ క్రమశిక్షణ.. శ్రమ ఫలం ♦ ఎస్సైలుగా ఎంపికైన పేదింటి బిడ్డలు ♦ ఆనందంలో తల్లిదండ్రులు విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని ఎంచుకున్నారు. లక్ష్యం గట్టిదైతే అందుకు తగ్గ శ్రమ అలా ఉండాల్సిందే. ‘నీ లక్ష్యం ఏంటో చెప్పు నీవెలా కష్టపడాలో చెబుతా’అన్న నానుడితో ముందడుగు వేశారు. ఒకే దృష్టి.. ఒకే ధ్వాసతో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యా న్ని సైతం మరవలేదు. వారు ఎస్సైలుగా ఎంపికై అటు తల్లిదండ్రులు, స్నేహితులకు పుట్టెడు ఆనందాన్ని తెచ్చిపెట్టారు. నిలువ నీడలేని కుటుంబం నుంచి.. తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా : సురేష్ ధరూరు: నిరుపేద కుటుంబానికి చెందిన సురేష్ ఎస్ఐగా ఎంపికయ్యాడు. మండలంలోని అల్వాలపాడుకు చెందిన రైతు కుటుంబానికి చెందిన సవారప్ప, మాణిక్యమ్మ దంపతుల కుమారుడు సురేష్ నాలుగు నెలల క్రితం సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై హైదరాబాద్‌లోని అంబర్‌పేట పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. మరో ఐదునెలలు గడిస్తే పోలీస్‌స్టేషన్‌లో విధులు చేపట్టాల్సిన సమయంలోనే ఎస్ఐ ఫలితాలు రావడంతో అందులో ఉత్తీర్ణత సాధించాడు. సురేష్‌కు అన్నయ్య అమరేష్‌తో పాటు ఒక చెల్లి ఉన్నారు. నాలుగెకరాల వ్యవసాయ పొలం ఉంది. సీడ్‌పత్తి, మరో రెండెకరాల్లో వరిపంటను సాగు చేస్తూ తల్లిదండ్రులు, అన్నయ్యలు సురేష్‌ను చదివిస్తూ వచ్చారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోనే సాగింది. డిగ్రీని పూర్తి చేసి హైదరాబాద్‌లో ఎంసీఏ చేస్తూనే పోటీ పరీక్షలకు హాజరయ్యాడు. క్రిందిస్థాయిలో ఉద్యోగాలు చేపడితే అక్కడితోనే ఆగిపోతామని, ఉన్నత స్థాయిలో ఉండి నలుగురికి ఉపయోగపడతానన్నారు. చికన్ సెంటర్ ఆధారంతో.. ఎస్ఐగా ఎంపికైన అబ్దుల్ ఖాదర్ దేవరకద్ర: పట్టణంలో చికెన్ సెంటర్‌ను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్న ఎమ్‌డి. హాసన్ పెద్ద కుమారుడు ఎమ్‌డి.అబ్దుల్ ఖాదర్ ఎస్ఐ ఎస్ఐగా ఎంపికయ్యాడు. మండలంలోని మీనుగోనిపల్లి గ్రామానికి చెందిన హసన్ ఆయన భార్య అమినాబేగంలో దేవరకద్రలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. తాను కష్టపడుతూ కొడుకులను ఉన్నత స్థాయికి తీసుకురావడానికి చేసిన కృషి ఫలితంగానే పెద్దకొడుకు ఎస్ఐగా ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఆనందాలు మిన్నంటాయి. దేవరకద్ర నుంచే చదువుకు శ్రీకారం... అబ్దుల్ ఖాదర్ దేవరకద్రలోని శ్రీవాణీ శిశుమందిర్ పాఠశాలలో 1 నుంచి 5 వ తరగతి వరకు చదివాడు. తరువాత 6, 7 తరగతులు కాకతీయ ఉన్నత పాఠశాల, 8 నుంచి 10 వరకు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత శ్రీచైతన్య కళాశాల హైదరాబాద్‌లో ఇంటర్లో ఎంపీసీ చేసిన తరువాత మహబూబ్‌నగర్ సమీపంలోని జేపీఎన్‌సీలో 2013లో ఈసీఈ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తరువాత ఏడాదిన్నర పాటు ప్రైవేట్‌లో ఉద్యోగం చేసిన దాన్ని వదిలి వేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాశాడు. రైతు నుంచి.. నాగర్‌కర్నూల్ క్రైం: నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తి గ్రామానికి చెందిన చింతలపల్లి కృష్ణయ్య, పార్వతమ్మలకు ఇద్దరు సంతానం. శ్రీకాంత్ రెండో కుమారుడు. వీరికున్న నాలుగెకరాల్లో సాగుచేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. మొదటి కుమారుడు రాజశేఖర్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా శ్రీకాంత్ ఓ అడుగు ముందుకేసి బీటెక్, ఎంబీఏ పూర్తి చేశాడు. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా హైదరాబాద్‌లోనే ఉంటూ చదువుకున్నాడు. ట్యూషన్ చెబుతూనే ఖర్చులకు సంపాదించుకున్న శ్రీకాంత్ కష్టమేంటో తెలుసుకున్నాడు. చదువు ఉచితం.. ఉన్నత ఉద్యోగం నారాయణపేట రూరల్: నిరుపేద కుటుంబంలో పుట్టిన చదువుకోడానికి పైసా ఖర్చు పెట్టలేదు.. ప్రతిభ ఆధారంగా ఉచితంగానే విద్యాభ్యాసం చేసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు అరుణ్‌కుమార్. నారాయణపేట మండలం జాజాపూర్‌కు చెందిన మంగలి నారాయణ వృత్తి రిత్యా గ్రామంలో హేయిర్ కటింగ్ దుకాణం నడుపుతుంటాడు. భార్య లక్ష్మి నిరక్షరాస్యురాలు. ముగ్గురు సంతానం కాగా వారిలో చిన్నబ్బాయి రాజేష్ టీటీసీ పూర్తిచేయగా, రెండవ వ్యక్తి ప్రకాష్ బీటెక్ చదువుకున్నాడు. అందరికన్న పెద్ద కుమారుడు అరుణ్‌కుమార్ ఎస్ఐ ఉద్యోగం సాధించాడు. మొదట కానిస్టెబుల్ ఎంపికైన అరుణ్ ఎస్ఐలో 369 మార్కులతో సీటు సంపాదించాడు. -
పోలీస్ శిక్షణకు నకిరేకల్ రూరల్ సీఐ ఎంపిక
నకిరేకల్ : ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే పోలీస్ శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి నకిరేకల్ సీఐ విశ్వప్రసాద్ ఎంపికయ్యారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్వెస్టిగేషన్, రోడ్డు ప్రమాదాలు అనే అంశంపై వారం రోజుల పాటు ప్యారిస్‌లో జరిగే శిక్షణలో విశ్వప్రసాద్ పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 10 మంది పోలీస్ అధికారులను ఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నకిరేకల్ సీఐ విశ్వ ప్రసాద్ ఒక్కరికి అవకాశం దక్కింది. శిక్షణకు ఎంపికైన విశ్వప్రసాద్ ప్యారిస్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా నకిరేకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. -
శిక్షణ కష్టం.. అధిగమిస్తే సుఖం
► భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా సత్తుపల్లిరూరల్: ‘‘బెటాలియన్‌లో శిక్షణ కొద్దిగా కష్టంగా ఉంటుంది. దీనిని అధిగమిస్తే అంతా సుఖమే.. మీ భవిష్యత్తంతా బంగా రమే’’ అని, భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా అన్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన 195 మందికి శిక్షణ కార్యక్రమం సత్తుపల్లి మండలం గంగారంలోని 15వ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ ఆవరణలో జరుగుతోంది. ఈ శిక్షణ కార్యక్రమంలో సోమవారం ముఖ్య అతిథిగా ఎస్పీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కష్టంతో కూడుకున్న శిక్షణను అధిగమించాలని కోరారు. ‘‘ఈ ఉద్యోగం రాక ముందు మీరు ఎలా ఉన్నప్పటికీ.. ఈ ఉద్యోగంలో చేరిన తరువాత మాత్రం మీ ప్రవర్తన సక్రమంగా ఉండా లి. క్రమశిక్షణతో ఉండాలి. ఎదుటి వారితో చాలా మర్యాదగా ప్రవర్తించాలి. తెలివితేటలతో ఉండాలి’’ అన్నారు. కార్యక్రమంలో కల్లూరు ఏఎస్పీ బల్లా రాజేష్, గంగారం 15వ ప్రత్యేక పోలీస్ కమాండెంట్ బి.రామ్‌ప్రకాష్, డీఎస్పీ చత్రియనాయక్ పాల్గొన్నారు. -
కానిస్టేబుళ్ల శిక్షణకు ఏర్పాట్లు పూర్తి
శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ శ్రీనివాస్ ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతన కానిస్టేబుళ్లకు తొమ్మిది నెలల పాటు అందిం చే శిక్షణకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయ న శిక్షణ కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. 277 మంది జిల్లా అభ్యర్థులను హైదరాబాద్, వరంగల్ జి ల్లాలకు ప్రత్యేక బస్సులలో తరలించినట్లు తెలిపారు. జిల్లాలో శిక్షణ పొందేందుకు గాను సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ విభాగంలో ఎంపికైన 250 మంది అభ్యర్థులు ఇక్కడికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. మే 1న ఉదయం 11 గంటలకు కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాశ్ చేతుల మీదుగా శిక్షణ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి కంప్యూటరీకరణతో అభ్యర్థులను తీర్చిదిద్ధేలా బోధన వ్యవస్థ అందుబాటులో ఉందని చెప్పారు. అభ్యర్థులు ఎటువంటి రిమార్కు లేకుండా క్రమశిక్షణతో శిక్షణ పూర్తిచేసుకోవాలన్నారు. వృత్తినైపుణ్యాలు, క్రమశిక్షణ, దేహదారుఢ్యం, ప్రజలతో స్నేహసంబంధాలు, పోలీసు విధులు, చట్టంలోని అంశాలు తదితర విభా గాల్లో శిక్షణ ఉంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పనసారెడ్డి, శిక్షణ కేంద్రం డీఎస్పీ సీతా రాములు, ఆర్ఐ బి. జేమ్స్, సురేంద్ర, టూటౌన్ సీఐ వెంకటస్వామి, బోథ్ సీఐ జయరాం,పాల్గొన్నారు. -
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కోసం స్థల పరిశీలన
డాక్యుమెంట్లను డీఎస్పీకి అందజేసిన తహశీల్దార్ రుద్రంపూర్: కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 11వ వార్డు సమీపంలోని సర్వే నంబర్ 20లో 70.30 ఎకరాల స్థలాన్ని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు కేటాయిస్తూ తహశీల్దార్ అశోక్‌చక్రవర్తి డీఎస్పీ బి.సురేందర్‌రావుకు డాక్యుమెంట్లు అందజేశారు. సంబంధిత స్థలాన్ని డీఎస్పీ బుధవారం పరిశీలించారు. ఈ స్థలం యాంటి నక్సల్ స్క్వాడ్ క్యాంప్‌తో పాటు రీజినల్ ట్రైనింగ్ సెంటర్‌కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ చుట్టూ ఉన్న పొలాలు, కాలనీ దారి, సమ్మక్క–సారలమ్మ గద్దెలను సందర్శించారు. సర్వేయర్, తహశీల్దార్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ స్థలానికి తూర్పున నాగయ్యగడ్డ, పడమర సమ్మక్క–సారలమ్మ గద్దెలు, అంబేద్కర్ కాలనీ, దక్షిణం: గరీబ్‌పేటకు వెళ్లే రోడ్డు, ఉత్తరం వనందాస్ గడ్డ, చిట్టిరామవరం పొలాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ స్థలంలో ఎవరివైనా పంట పొలాలు ఉంటే తమకు చూపించాలని, డాక్యుమెంట్లను పరిశీలించిన పిదప వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని తహశీల్దార్, డీఎస్పీ సూచించారు. ఈ ట్రైనింగ్ సెంటర్లో సుమారు 2000 మంది వరకు ఉద్యోగులు ఉండే అవకాశం ఉందన్నారు. చుట్టుపక్కల మరికొన్ని కార్యాలయాలు వస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. డీఎస్పీ, తహశీల్దార్ వెంట టూ టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, వార్డు కౌన్సిలర్లు పాటి మోహన్‌రావు, మోరే భాస్కర్, గరీబ్‌పేట సర్పంచ్ బాణోత్ రాములు, ఆర్ఐ భవాని, సర్వేయర్ పవన్‌కుమార్ పాల్గొన్నారు. -
రెడీ... స్టడీ.... ఫైర్!
స్నాచర్ల భరతం పట్టేందుకు యాంటీ స్నాచర్స్ టీమ్ మరింత పదును తేలుతోంది. చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు కఠోర శిక్షణ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. ఈ మేరకు బుధవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ టీమ్స్‌కు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ దిశానిర్దేశం చేశారు. వారి ప్రతిభా పాఠవాలను పరిశీలించారు. హైదరాబాద్ : చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు పట్టుకొని తీరుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వనస్థలిపురం ఆటోనగర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు చైన్‌స్నాచర్లు చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నేపథ్యంలో ‘ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్’కు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన బుధవారం దిశా నిర్దేశం చేశారు. చైన్‌స్నాచర్ల కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందిచడంపై పాఠాలు చెప్పారు. ఫీల్డ్‌లో వారికి ఉన్న సందేహాలనూ నివృత్తి చేశారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్లో సీసీటీమ్స్ చేసిన బైక్ విన్యాసాలు, రివాల్వర్ వాడే తీరు కళ్లకు కట్టింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంతో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే హింస తీవ్రత పెరిగింది. ఓయూలో సుమిత్ర అనే మహిళ మరణించింది. చాలా మంది మహిళలు గాయపడ్డారు. అందుకే శ్రుతిమించుతున్న చైన్స్నాచర్లను నిలువరించాలంటే వారి తరహాలోనే పోలీసు టీమ్స్ ఉండాలని భావించాం. ఫీల్డ్‌లోనే గుర్తిస్తే చైన్ స్నాచింగ్‌లను తగ్గించవచ్చనే ఆలోచనల నుంచి యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ కార్యరూపం దాల్చింది’’ అని ఆనందర్ అన్నారు. ఐదంచెల ప్రణాళికతో చెక్... ‘‘చైన్ స్నాచింగ్ జరిగిన తర్వాత అరగంట, గంటకు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అప్పటికే మూడు నాలుగు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయో గుర్తించి అందుకు అనుగుణంగా 110 మందితో 55 సీసీటీమ్స్ రెడీ చేశాం. చైన్ స్నాచర్లను పట్టుకునే మెళకువలతో పాటు బైక్‌ను వేగంగా నడపడం, నియంత్రించడంపై శిక్షణ ఇప్పించాం. ఒకవేళ స్నాచర్లు ఆయుధాలతో దాడికి యత్నిస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు ఎలా జరపాలో కూడా ప్రత్యేక తర్ఫీదునిచ్చాం’’ అని కమిషనర్ చెప్పారు. అంతరాష్ట్ర చైన్‌స్నాచర్ల ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ఏడు ప్రత్యేక బృందాలు రెడీ చేశాం. స్నాచర్లను పట్టుకునేందుకు ఆ బృందాలు వారణాసి, మహారాష్ట్రలకు వెళ్లాయి. ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్ల వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. స్థానిక స్నాచింగ్ ముఠాలపై నిఘా వేసేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే గొలుసు దొంగల పూర్తి సమాచారం సేకరించాం. ఆఫీసు రికార్డుల్లో పూర్తిగా అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యాం. సీసీటీమ్స్, లోకల్ పోలీసు అధికారుల ఫోన్లో చైన్‌స్నాచర్ల ఫొటోలతో పాటు వివరాలు ఉండేలా యాప్ రెడీ చేస్తున్నాం. గతంలో మాదిరిగా రోటీన్ చెకప్ కాకండా స్థానిక పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనాల తనిఖీలు చేసేలా చూస్తున్నాం. డైనమిక్ బీట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోని పార్కింగ్ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నాం. స్నాచింగ్స్‌పె ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఇతర నేరాలు కూడా జరిగే విధానాన్ని వివరిస్తూ రెడీ చేసిన పోస్టర్లను అన్ని ప్రాంతాల్లో అతికించేలా చొరవ తీసుకుంటున్నామని కమిషనర్ ఆనంద్ చెప్పారు. అది దుష్ర్పచారం వనస్థలిపురం ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను పట్టుకునే క్రమంలో సీసీటీమ్ సభ్యులు త్వరితగతిన స్పందించలేదు. అయితే వారు చూపిన తెగువ భేష్. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. అయితే ఆటోనగర్ ఘటన డెకాయిట్ ఆపరేషన్ అని వస్తున్నదంతా దుష్ర్పచారమే, ఏది ఏమైనా చైన్ స్నాచర్లకు పోలీసు పవరేంటో చూపెడతాం. వారికి ఫీల్డ్‌లోనే బుద్ధి చెప్తాం. రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలను అడ్డుకున్నట్టే చెన్స్నాచర్లకు ముకుతాడు వేస్తాం. త్వరలోనే మంచి ఫలితాలు కనబడతాయి. - ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
వరంగల్ జిల్లాలో దొంగల బీభత్సం
వరంగల్ : వరంగల్ జిల్లాలో దొంగలు మంగళవారం తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. ఏకంగా పోలీస్ క్వార్టర్స్‌నే దుండగులు టార్గెట్ చేశారు. పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ క్వార్టర్స్‌లోని అయిదు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. భారీగా నగదు, నగలు అహరించుకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దొంగల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. -
పోలీసులుకాబోయి మావోయిస్టులైతే....
రాంచి: పోలీసులు కావాలనుకొని మావోయిస్టులైతే...శాంతి భద్రతల పరిరక్షణ కోసం తుపాకులు పట్టుకోవాల్సినవారే వాటికి విఘాతం కలిగించేందుకు తుపాకులు పట్టుకొంటే ఆ పరిణామాలు ఎలా ఉంటాయి? జార్ఖండ్ సాయుధ పోలీసు (జేఏపీ) దళంలో చేరాలనుకొని నాలుగేళ్ల క్రితం పరీక్షలు రాసి వాటి ఫలితాలు ఇప్పటికీరాక విసిగి వేసారిన నిరుద్యోగ అభ్యర్థులు మావోయిస్టులుగా మారిపోతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తుపాకులు పట్టుకుంటామని హెచ్చరిస్తున్నారు. జార్ఖండ్ ఆర్మ్డ్ పోలీసులోని తొమ్మిది బటాలియన్లలోని మొత్తం 1020 ఖాళీ పోస్టులకు 2011 సంవత్సరంలో పరీక్షలు జరిగాయి. మొదటి రెండు ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను పిలిచి ఫైనల్ పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఇప్పటి వరకు ఆ పరీక్షల ఫలితాలను నేటి వరకు వెలువరించలేదు. అభ్యర్థులు హైకోర్టుకెళ్లగా వెంటనే ఫలితాలను వెల్లడించాల్సిందిగా కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. వారు పోలీసు ఉన్నతాధికారులను, ప్రభుత్వాధికారులను ఎవరిని కలుసుకున్న ఎవరూ ఎలాంటి సాయం చేయలేక పోయారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్ దాస్‌ను కలుసుకునేందుకు వారు గత నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్న వారికి ఆయన దర్శన భాగ్యం కలగలేదు. దాంతోవారు ఆదివారం నాడు రాంచీలోని పోలీసు అదనపు డెరైక్టర్ జనరల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఇక తాము ఆత్మాహుతికి పాల్పడడమో, మావోయిస్టుల్లో చేరిపోవడమో తప్ప మరో మార్గం లేదని వారు వాపోతున్నారు. ‘నేను ఓ చిన్న దుకాణంలో పని చేస్తున్నాను. నెలకు మూడువేల రూపాయలిస్తారు. నా తండ్రికి గుండె జబ్బు. తల్లి శ్వాసకోస వ్యాధితో బాధ పడుతోంది. నాకొచ్చే డబ్బు వారి మందులకే సరిపోతాయి. డబ్బులేక పస్తులుండే రోజులెన్నో’ అని ఓ అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘నా సంపాదన అంతంత మాత్రమే. చెల్లి పెళ్లి చేయాలి. చేతిలో చిల్లిగవ్వా లేదు. మా అందరి పరిస్థితి దాదాపు ఒకేలా ఉంది. పోలీసు ఉద్యోగం పట్ల మాకున్న ఆశలన్నీ అడుగంటుతున్నాయి. మావోయిస్టుల్లో చేరి తుపాకులు పట్టుకోవాలనే ఆలోచనలు రేగుతున్నాయి’ అని ధన్‌బాద్ నుంచి వచ్చిన మరో అభ్యర్థి వ్యాఖ్యానించారు. ఈ విషయమై పోలీసు ఏడీజీ కమల్ నారాయణ్ చౌబేను మీడియా ప్రతినిధులు కలిసి వివరణ కోరగా, అభ్యర్థుల ఎంపికకు ముగ్గురు సీనియర్ అధికారులతో మూడు స్క్రీనింగ్ క మిటీలు వేశామని, అందులో ఓ కమిటీకి నాయకత్వం వహిస్తున్న అమర్జిత్ బలిహార్ మావోల కాల్పుల్లో మరణించాడని, దాంతో ఆ కమిటీ పని అర్ధాంతరంగా నిలిచిపోవడమే ఆలస్యానికి కారణమని ఆయన చెప్పారు. -
సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం
సంగారెడ్డి క్రైం: ‘సమాజంలో పోలీసులకు ప్రత్యేక స్థానం ఉంది, పోలీసు ఉద్యోగంలో ప్రజలకు న్యాయం చేయడం వల్ల సంతృప్తి కల్గుతుంది’ అని రాష్ట్ర డీఐజీ (అడ్మిన్) కల్పనా నాయక్ అన్నారు. సంగారెడ్డి మండలం చిద్రుప్పలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శుక్రవారం ఎస్‌సిటిపిసి (స్టైఫండ్ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్)ల 2014 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన డీఐజీ కల్పనా నాయక్‌ను జిల్లా ఎస్పీ డా.ిశెమూిషీ బాజ్‌పాయ్ సాదరంగా ఆహ్వానించారు. 9 నెలల పాటు పోలీసు శిక్షణ పూర్తి చేసుకొని ప్రజాసేవ కోసం వెళ్తున్న 58 మంది ఎస్‌సిటిపిసి (ఏఆర్)లతో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి ఉద్యోగ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా డీఐజీ కల్పనా నాయక్ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగంలో కుటుంబ రక్షణతో పాటు ప్రజల రక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. 87 మంది ఎస్సిటిపిసిలలో ఇన్డోర్, అవుట్డోర్ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన 58 మందిని అభినందించారు. ట్రైనింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. అత్యుత్తమంగా పోలీసు శిక్షణ ఇచ్చిన జిల్లా ఎస్పీ డా.శెమూషీ బాజ్‌పాయ్, ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, డీటీసీ సిబ్బందిని ఆమె అభినందించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపును మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి (డీజీపీ) అనురాగ్‌శర్మ, ట్రైనింగ్ ఐజీపీ రాజీవ్త్రన్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ (ఆపరేషన్స్) జ్యోతిప్రకాష్, జిల్లా శిక్షణ కేంద్రం డీఎస్పీ వెంకట్‌రెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ కె.ఎన్.విజయ్‌కుమార్, మెదక్ డీఎస్పీ రాజరత్నం, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, సంగారెడ్డి డీఎస్పీ ఎం.తిరుపతన్న, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సునీత తదితరులు పాల్గొన్నారు. -
హైద్రాబాద్ పోలీస్ అకాడమీలో సంబురం!
-
ఉరకలెత్తే ఉత్సాహంతో.. మరింత ముందుకు!
-
రోజుకొకరు ఆస్పత్రిపాలు!
ఒంగోలు: ప్రకాశం జిల్లా పొలీస్ ట్రైనింగ్ కళాశాలకు జబ్బు చేసింది. వారం రోజులుగా ట్రైనీ కానిస్టేబుల్స్ రోజుకొకరు చొప్పున ఆసుపత్రి పాలవుతున్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సృహతప్పి పడిపోయారు. వీరిని స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసు శిక్షణను తట్టుకోలేక ట్రైనీ కానిస్టేబుళ్లు స్పృహ తప్పిపడిపోయారా? లేక సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల పడిపోయారా? అన్నది తెలియడంలేదు. ఏది ఏమైనా ఇలా రోజుకొకరు ఆస్పత్రిపాలు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. తమమీదకు ఎక్కడ వస్తుందోనని వారు భయపడుతున్నారు. -
నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నా : వెంకట్
‘‘ఓ ఐఏయస్ అధికారి ముఖ్యమంతి అయితే ఎలా ఉంటుంది? యువతరం తలుచుకుంటే... సమాజంలో ఎలాంటి మార్పు తేగలరు? ఈ ప్రశ్నలకు సమాధానంగా మా ‘ఆ ఐదుగురు’ సినిమా ఉంటుంది’’ అని వెంకట్ అన్నారు. వెంకట్ ప్రత్యేక పాత్రలో రూపొందిన చిత్రం ‘ఆ ఐదుగురు’. అనిల్ జేసన్ గూడూరుని దర్శకునిగా పరిచయం చేస్తూ... సరితా పట్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేమ్‌కుమార్ పట్రా సమర్పిస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో వెంకట్ విలేకరులతో ముచ్చటించారు. ‘‘ఇందులో నేను 40 మంది యువకులకు శిక్షణ ఇచ్చే పోలీస్ అధికారిని. నా శిక్షణ నుంచి బయటకొచ్చిన ఓ ఐదుగురు సమాజంలో ఎలాంటి చైతన్యాన్ని తెచ్చారన్నదే ఈ సినిమా ఇతివృత్తం. నా కెరీర్లో పోలీస్‌గా కనిపించడం ఇదే ప్రథమం. ఈ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీలో రవికుమార్ అనే ఎస్.ఐ దగ్గర నిజంగానే పోలీస్ శిక్షణ తీసుకున్నాను. కథ నచ్చడంతో పోలీసులు కూడా ఈ సినిమాకు ఎంతో సహకరించారు. 35 మంది నిజమైన పోలీసు మధ్య శిక్షణ తీసుకోవడం నిజంగా మరచిపోలేను. పోలీస్ పాత్రలో సహజత్వం కోసం ఎంతో కష్టపడ్డాను. వారి జీవన శైలిని అధ్యయనం చేశాను. డూప్ లేకుండా పోరాటాలు కూడా చేశాను. ఈ కారణంగా బలమైన దెబ్బలు తగిలి కొన్నాళ్లు షూటింగ్ కూడా నిలిచిపోయింది. ఇదంతా సినిమాపై ఇష్టంతో చేసిందే. ఈ సినిమాలోని ప్రతి పాత్రలో హీరోయిజం ఉంటుంది’’ అని వెంకట్ చెప్పారు. కథ నచ్చితే మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధమని, ‘ఈగ’లో సుదీప్‌లా విలన్ పాత్రలు చేయడానికి కూడా తాను రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా వెంకట్ వెల్లడించారు. చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం లేదని, కలిసి నటించడానికి అందరూ ముందుకొస్తే మంచి కథలొస్తాయని వెంకట్ పేర్కొన్నారు. చిన్న సినిమాలకు పరిశ్రమలో స్థానం లేకుండా పోతోందని, ఈ విషయమై పవన్‌కల్యాణ్‌ని కలవాలనుకుంటున్నానని, ఈ సమస్యను ఆయన మాత్రమే పరిష్కరించగలరని వెంకట్ అభిప్రాయపడ్డారు. -
జాతి కుక్కలతో ఉగ్రవాదుల వేట!
బీజింగ్:ఇప్పటి వరకూ పోలీసులకు కొన్ని సందర్భాల్లోనే సాయపడే కుక్కలు ఇక నుంచి టెర్రరిస్టుల వేటకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని జాతి కుక్కలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ తరహా ప్రణాళికతో ఉగ్రవాదులకు అడ్డుకట్టవేయడానికి మన పొరుగుదేశం చైనా తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన 650 కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పలు కుక్కలు పోలీస్ పెట్రోలింగ్ లో భాగస్వామ్యమయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. గత కొన్నాళ్లుగా చైనాలోని పలుచోట్ల ఉగ్రవాద దాడులు ఎక్కువ కావడం వల్లనే కుక్కలకు శిక్షణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. బీజింగ్ లోని రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి ప్రణాళిక రచించే సమయంలో తిప్పికొట్టేందుకు ఇదొక విధానమన్నారు. ఈ మధ్య కాలంలో చైనాలోని అత్యధిక జనాభా గల నగర, పట్టణ ప్రాంతాల్లోనూ, రవాణా స్థావరాల్లోనూ ఉగ్రవాద దాడులు తీవ్రమైన సంగతి తెలిసిందే. -
బండ్లమోటుకు పూర్వవైభవం..?
బండ్లమోటు... ఒకప్పుడు మినీ విశాఖపట్నంగా పేరుండేది. సుమారు 500 ఎకరాల్లో 600 మంది ఉద్యోగులతో నెలకొల్పిన హిందూస్థాన్ జింక్ ఫ్యాక్టరీ ఉజ్వలంగా వెలుగొందుతూ నిత్యం కళకళలాడుతూ ఉండేది. భారతదేశంలో రాజస్థాన్ తర్వాత అపారమైన సీసపు గనులున్న ఈ ప్రాంతంలో హిందూస్థాన్ కంపెనీ వారు అటవీ భూమిని లీజుకు తీసుకుని జింక్ ఫ్యాక్టరీ పెట్టారు. అయితే ఉత్పత్తి వ్యయం ఎక్కువై ధర గిట్టుబాటు కాక నష్టాలు రావడంతో పదేళ్ల కిందట ఫ్యాక్టరీని మూసివేశారు. దీంతో ఆ ప్రాంతంలో హడావుడి అంతా ఒక్కసారిగా అదృశ్యమై కళావిహీనంగా మారింది. నూతన రాష్ట్రం ఆవిర్భావం నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ, పరిశ్రమలు గానీ పెట్టడానికి ఈ ప్రాంతం అనువైనది. వినుకొండ/బొల్లాపల్లి, న్యూస్‌లైన్: ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణంతో మినీ వైజాగ్‌గా గుర్తింపు పొందిన ఈ ప్రాంతం పదేళ్లుగా కళావిహీనంగా మారింది. నూతన రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సుమారు 500 ఎకరాలతో, అన్ని వసతులున్న ఈ అటవీ ప్రాంతంలో ఏదేని కేంద్ర ప్రభుత్వ సంస్థ గాని, లేదా పరిశ్రమ గాని ఏర్పాటుచేస్తే బండ్లమోటుకు పూర్వ వైభవం వస్తుందని వారు ఆకాంక్షిస్తున్నారు. భారత ప్రభుత్వ రంగ ఉద్యోగులతో గతంలో ఒక వెలుగు వెలిగి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాంతం పలు ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అనువైనదిగా భావిస్తున్నారు. గతంలో పోలీసు శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. నూతన రాష్ట్రం ఆవిర్భావం జరగనుండడంతో పలు ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు జిల్లాలో అనువైన ప్రాంతాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. అధిక విస్తీర్ణం కలిగి ఉన్న భూములతో పాటు అన్ని రకాల వనరులు ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినుకొండ నియోజకవర్గంలోని బండ్లమోటు ప్రాంతం ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అనుకూలమని అధికారులు భావిస్తున్నారు. కళ తప్పిన బండ్లమోటుకు ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుతో పూర్వ వైభవం రానుందని, ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంటున్నారు. భారతదేశ చిత్రపటంలో బండ్లమోటుకు ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో రాజస్థాన్ తర్వాత సీసపు గనులున్న ప్రాంతం ఇదే. దీనిని గుర్తించి దేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థ అయిన హిందూస్థాన్ కంపెనీ ఇక్కడ అటవీ భూమిని లీజుకు తీసుకుని జింక్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. మండల కేంద్రమైన బొల్లాపల్లికి కూతవేటు దూరంలో ఉన్న బండ్లమోటులో 517 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసిన హిందూస్థాన్ జింక్ లిమిటెడ్‌లో 600 మంది ఉద్యోగులు పని చేసేవారు. వీరికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. సమీపంలోని మూగచింతలపాలెం గ్రామం వద్ద ఉన్న నాగార్జున సాగర్ ప్రధాన కాల్వ డీప్ కట్ నుంచి నేరుగా మంచినీటి పైపులైను ఏర్పాటు చేశారు. దీంతో సమృద్ధిగా నీటి సరఫరా జరిగేది. అన్ని హంగులతో కూడిన క్వార్టర్స్, అధికారులకు అతిథి గృహాలు, బ్యాంకులు ఇలా అన్ని సౌకర్యాలతో ఉన్న ఈ ప్రాంతాన్ని అప్పట్లో మినీ విశాఖపట్నంగా పిలిచేవారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉండడంతో ప్రభుత్వం ఇక్కడ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటుచేసింది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నష్టాల బారిన పడడంతో పదేళ్ల క్రితం మూసివేశారు. అటవీప్రాంతం అంతర్భాగంలో ఉన్న హెచ్జడ్ఎల్కు అటవీశాఖ నుంచి లీజు సమయం ఉన్నప్పటికీ పదేళ్లు ముందుగానే మూసివేశారు. ఈ సంస్థ వినియోగంలో ఉన్న సమయంలో దూరప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చేవారు. ఇక్కడ సీసం ముడిపదార్ధాన్ని వెలికితీసి దానిని శుద్ధి చేసి విశాఖపట్నంకు తరలించి, అక్కడ నుంచి విదేశాలకు ఎగుమతి చేయవలసి వచ్చేది. ఇక్కడ నుంచి రవాణా ఖర్చు తడిసి మోపెడై ఉత్పత్తి వ్యయం ఎక్కువవడంతో ధర గిట్టుబాటు కాక నష్టాలు రావడంతో ఫ్యాక్టరీని మూసివేశారు. ఫ్యాక్టరీ మూసివేసిన అనంతరం ఇక్కడ చడీచప్పుడు లేక నిర్మానుష్యగా మారిపోయింది. దీంతో పీపుల్స్‌వార్ నక్సలైట్లు అప్పట్లో బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌ను పేల్చివేశారు. ప్రస్తుతం నూతన రాష్ట్రం ఏర్పాటుకానున్న తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు కానీ, పరిశ్రమల ఏర్పాటుకు కానీ ఈ ప్రాంతం ఎంతో అనువుగా ఉంటుంది. ఇక్కడ అటవీ భూములతో పాటు రెవెన్యూ భూముల ధరలు కూడా తక్కువగానే ఉంటాయి. నీటి వనరులతో రవాణా సౌకర్యం, భూముల ధరలు తక్కువగా ఉండడం వలన గిరిజన విద్యాసంస్థలు, యూనివర్సిటీ, ఐఐటీ, పరిశోధన సంస్థలు, పోలీసు అకాడమీ, ఇతర పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇక్కడ ఏదో ఒక సంస్థగాని, పరిశ్రమ గాని ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వలసలను నివారించవచ్చు. ఇందుకు పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రేపటి నుంచి పోలీసుల భర్తీ ప్రక్రియ
సాక్షి ముంబైః మహారాష్ట్ర పోలీసుశాఖ సోమవారం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించనుంది. మొత్తం 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు పోలీసు శాఖ పేర్కొంది. ఇటీవలే జరిగిన సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకున్నారు. హోంశాఖ మంత్రి ఆర్.ఆర్ పాటిల్ అధ్యక్షతన సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలోనూ కొత్త నియామకాలపై చర్చ జరిగింది. అదనంగా ఖాళీలను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ మేరకు సోమవారం నుంచి భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తారు. పోలీసుశాఖలో ఐదేళ్లలో 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది 12,500 మంది పోలీసుల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. వీటికి అదనంగా మరో 7,500 మంది అంటే మొత్తం 20 వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. పోలీసు శాఖలో చేరాలనుకునే అనేక మంది యువకులకు ఇది మంచి అవకాశమని సీనియర్ అధికారి ఒకరు అన్నారు. తీర ప్రాంతాల భద్రత కల్పించేందుకు కొందరికి శిక్షణ ఇచ్చేందుకు పోలీసు ట్రైనింగ్ సెంటరును ప్రారంభించనున్నారు. దీనికోసం పాల్ఘర్లోని మూడు భవనాలను కేటాయించాలని ప్రతిపాదించారు. దాదాపు 50 ఎకరాల్లో ఈ ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సుమారు 2,500 మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.. ఇక ఠాణే వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 772 ఉద్యోగాలనూ భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రచారమాధ్యమాల్లో ప్రకటనలు ఇవ్వడం జరిగిందని నగర కమిషనర్ జ్ఞానేశ్వర్ ఫడతరే తెలిపారు. -
నిరుద్యోగ యువతకు పోలీస్ శిక్షణ
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : గిరిజన నిరుద్యోగ యువతకు మిలిటరీ, సీఆర్పీఎఫ్, పో లీస్ శాఖల ఉద్యోగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు పార్వతీపురంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఓఎస్డీ ప్రవీణ్ తెలిపారు. గుమ్మలక్ష్మీపురం మండ లం తాడికొండ గ్రామంలో మంగళవారం ఆ యన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రా మం నుంచి కనీసం ఐదుగురు యువకులు పోలీస్ శాఖలో పనిచేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కేంద్రం పనిచేస్తుందన్నారు. జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. సాలూరు, మక్కువ, కొటియ, కొమరాడ ప్రాంతంలో కొద్దిగా మావోయిస్టు ప్రాబల్యం ఉన్నా ఆంధ్రా-ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలింపు చ ర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాచిపెం ట, సాలూరు, కొటియా ప్రాంతాల్లో రెండు లైన్ల రహదారి నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. -
పోలీసులు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి
జడ్చర్ల, న్యూస్‌లైన్ : పోలీసులు బుధవారం జడ్చర్ల శివారులోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం (డీటీసీ)లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీటీసీలో ఇటీవల శిక్షణను పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సర్వీసులో చేరే ముందు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. పోలీసు శాఖలో విధుల్లో చేరిన వెంటనే కొత్త రక్తంతో నీతి, నిజాయితీలకు పెద్ద పీట వేస్తూ ప్రజలకు అత్యుత్తమ సేవలందించాలన్నారు. త్యాగానికి నిదర్శనమైన బక్రీద్ పర్వదినం రోజున రక్తదానం చేసి తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపడం గర్వంగా ఉందన్నారు. చిత్తశుద్ధితో ప్రజలకు సేవలందిస్తూ పోలీసుశాఖ ఖ్యాతిని పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ప్రదీప్‌రెడ్డి, రెడ్‌క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ నటరాజ్, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు రవిశంకర్, డీటీసీ ఆర్ఐ యోగేశ్వర్రావు, స్థానిక సీఐ వెంకటరమణ, ఎస్ఐ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.