జాతి కుక్కలతో ఉగ్రవాదుల వేట!
బీజింగ్:ఇప్పటి వరకూ పోలీసులకు కొన్ని సందర్భాల్లోనే సాయపడే కుక్కలు ఇక నుంచి టెర్రరిస్టుల వేటకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే కొన్ని జాతి కుక్కలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ తరహా ప్రణాళికతో ఉగ్రవాదులకు అడ్డుకట్టవేయడానికి మన పొరుగుదేశం చైనా తాజాగా శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన 650 కుక్కలకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే పలు కుక్కలు పోలీస్ పెట్రోలింగ్ లో భాగస్వామ్యమయ్యాయని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
గత కొన్నాళ్లుగా చైనాలోని పలుచోట్ల ఉగ్రవాద దాడులు ఎక్కువ కావడం వల్లనే కుక్కలకు శిక్షణ ఇవ్వాల్సి వస్తోందన్నారు. బీజింగ్ లోని రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్ల లాంటి రద్దీ ప్రదేశాల్లో ఎక్కడైనా ఉగ్రవాదులు విధ్వంసానికి ప్రణాళిక రచించే సమయంలో తిప్పికొట్టేందుకు ఇదొక విధానమన్నారు. ఈ మధ్య కాలంలో చైనాలోని అత్యధిక జనాభా గల నగర, పట్టణ ప్రాంతాల్లోనూ, రవాణా స్థావరాల్లోనూ ఉగ్రవాద దాడులు తీవ్రమైన సంగతి తెలిసిందే.