
– సాక్షి ప్రతినిధి, విజయనగరం
గుబురు మీసాలతో పులిలా కనిపించే ఆయనకు అమ్మపై ఎనలేనంత ప్రేమ ఉంది. ఆమెను తలచుకుంటే చాలు కన్నీటి పర్యంతమయ్యేంత అనురాగం ఉంది. ఎంతటి కష్టాన్నైనా ఎదిరించి పోరాడగల సత్తా ఉంది. చేపట్టిన పనుల్లో తన ముద్ర కనిపించాలనే తపన ఉంది. యాభై ఎనిమిదేళ్ల వయసులోనూ ఎవరికీ వెరవని తెగువ ఉంది. ఇప్పటికీ విజయనగరం నుంచి విశాఖపట్నం వరకూ 50 కిలోమీటర్లు అలవోకగా పరిగెత్తగల సత్తా ఉంది. పోలీసుశాఖలో అడుగుపెట్టేవారెందరినో తీర్చిదిద్దగల అసమాన ప్రతిభ ఉంది. ఆయనే విజయనగరం జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ (పీటీసీపీ) కె.రాజశిఖామణి. విభిన్న మలుపులు, ఎన్నో విశేషాలతో నిండిన ఆయన వ్యక్తి గత జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది ‘సాక్షి’. ఆ విశేషాలు మీ కోసం..
సాక్షి: మీ స్వస్తలం, చదువు గురించి?
పీటీసీపీ: గుంటూరు జిల్లా వట్టిచెరుకూరిపాడు మండలం లేమళ్లపాడు మా స్వగ్రామం. ఆ ఊళ్లో అప్పట్లో చదువుకున్నది ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మా నాన్న కాకుమాని కోటయ్య, మరొకరు మా చిన్నాయన ప్రసాద్. ఇద్దరూ బీఏ చదివారు. నాన్న రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసేవారు. పెళ్లి తర్వాత ఒంగోలుకు బదిలీ అయ్యారు. నేను, తమ్ముడు రాజశేఖర్ అక్కడే పుట్టాం. ఇద్దరం ఫుట్‌బాల్ బాగా ఆడేవాళ్లం. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ(ఏబీఎం) హైస్కూల్‌లో చదువుకున్నాం. ముఫ్పై ఎకరాల్లో ఉండే ఆ హైస్కూల్‌లో మూడు ఫుట్‌బాల్ కోర్టులు, బాస్కెట్ బాల్, బేస్‌బాల్ కోర్టులుండేవి. అందువల్ల వాటన్నిటిలోనూ ప్రావీణ్యం తెచ్చుకున్నాను. డిగ్రీ వరకూ ఫుట్‌బాల్ ఆడేవాడ్ని, తర్వాత అథ్లెటిక్స్ వైపు వెళ్లాను. తొలి ప్రయత్నంలోనే 1977లో ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్‌లో నాలుగు బంగారు పతకాలు సాధించి యూనివర్శిటీ చాంపియన్‌గా నిలిచాను.
సాక్షి: పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టడానికి కారణం?
పీటీసీపీ: అమ్మ నన్ను డాక్టర్‌గా చూడాలనుకునేవారు. కానీ వారికి చెప్పకుండానే పోలీస్ అయిపోయాను. చిన్నప్పుడు ఎన్‌టీఆర్, కృష్ణ సినిమాలు ఇంట్లో తెలియకుండా బాగా చూసేవాడిని. ఎక్కడైనా ఏదైనా జరిగితే వెంటనే వెళ్లి సాయం చేయడం అనేది ఆ సినిమాల ప్రభావమే. నాకు ఏడో తరగతి నుంచే పోలీస్ అవ్వాలనుండేది. స్కౌట్స్‌లో చేరాను. మొద ట్లో ఆర్మీలో చేరాలనుకునేవాణ్ని. దాని కోసం బీఎస్సీ నుంచి ఎకనామిక్స్‌లోకి మార్చమని ప్రిన్సిపల్‌ను అడిగాను, కుదరదంటే చదువు మానేస్తానన్నాను. అలా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీలో ఉండగా ఎన్‌సీసీ ద్వారా రిపబ్లిక్ డే పరేడ్స్‌లో పాల్గొన్నాను. మిల్కా సింగ్ స్టోరీ చదివి నేనూ అలా అయిపోవాలని ఆర్మీలో వంటవాడి పోస్టుకు దరఖాస్తు చేసేశాను. ఎంపికయ్యాను కానీ వద్దని అందరూ వారించడంతో చేరలేదు. తర్వాత పోలీస్ సెలక్షన్స్‌కు వెళ్లాను. 2.50 నిమిషాల్లో 800 మీటర్లు పరిగెత్తమంటే 2 నిమిషాల్లోనే పరుగెత్తి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాను. ఇంటర్వూ్యకు కూడా గెడ్డం, మీసాలతో వెళ్లాను. సెలక్టర్లు అడిగితే ఉద్యోగం వస్తే తీస్తానని సమాధానం చెప్పాను. నువ్ ఏం చేస్తావ్ అని అడిగితే ఏదైనా చేస్తానన్నాను. సర్టిఫికెట్లు కూడా చూడకుండా ఉద్యోగం ఇచ్చారు.
సాక్షి: ఇంటెలిజెన్స్ వైపు ఎందుకెళ్లారు?
పీటీసీపీ: పోలీస్ శిక్షణ కోసం 1981లో అనంతపురంలో అడుగుపెట్టాను. వెళ్లగానే గుండు చేసేశారు. అక్కడ శిక్షణ సరిపోయేది కాదు. అదనంగా మరో పదికిలోమీటర్లు పరిగెత్తేసేవాడిని, ఐదొందల పుషప్స్ తీసేసేవాడిని. తర్వాత తొలిపోస్టింగ్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వచ్చింది. అది నాకు నచ్చలేదు. ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి ఇంటెలిజెన్స్‌కు పంపించమని అడిగాను. సెలక్షన్ పెడితే ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా రెండవ స్థానం సాధించాను. ఉన్నతాధికారి రత్నారెడ్డి నన్ను ఎంపిక చేశారు. తర్వాత శిక్షణ కోసం ఎల్‌బీ స్టేడియానికి వెళితే అక్కడ కోచ్ నన్ను ‘పనికిరావు పో’ అన్నారు. రెండు నెలలు అతని కోచింగ్ చూసి నోట్స్ రాసుకుని, దానికి రెండింతలు చేసేశాను. తర్వాత కాకినాడ మూడవ బెటాలియన్‌కు శిక్షణ కోసం ఉత్తర్వులు వచ్చాయి. అక్కడికి వెళ్లాక జీతం అంతా తిండికే ఖర్చుచేసి, నాన్నకు ఫోన్ చేసి నెల నెలా రూ.1500 పంపమనేవాడ్ని. రోజుకు ఎనిమిది గంటలు ప్రాక్టీస్ చేసేవాడ్ని. 1982లో 1500 మీటర్లు 4 నిమిషాల్లో పరిగెత్తాను. ఇంత వరకూ ఈ రికార్డ్‌ను ఎవరూ క్రాస్ చేయలేదు.
సాక్షి: కమాండోగా ఎలా మారారు:
పీటీసీపీ: ఇంటెలిజెన్స్‌లో ఉండగా ఒకసారి హెవీ వెయిట్ ఎత్తడంతో ఎముకకు దెబ్బతగిలి రెండు నెలలు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. కోలుకున్నాక స్టాండర్డ్ ట్రైనింగ్ కోసం కమాండో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నాను. ఎన్‌ఎస్‌జీకి వెళ్లిపోయాను. తొలి బ్యాచ్‌లో అన్ని రాష్ట్రాల నుంచి 140 మంది ఉంటే వారిలో నేనే ఫస్ట్ వచ్చాను.
సాక్షి: పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు?
పీటీసీపీ: నా భార్య ప్రశాంతి గృహిణి. మా అబ్బాయి రాజ్‌భరత్ ఇంజినీర్. కుమార్తె అంకిత్‌రాజ్ బాడ్మింటన్ క్రీడాకారిణి. మా అమ్మాయి పేరుమీదనే అంకిత్ స్పోర్ట్స్ అకాడమీని ఐదేళ్ల క్రితం స్థాపించాం. ఎంతో మంది ఐపీఎస్‌లకు పరీక్షలు నిర్వహించిన అనుభవం నాది. ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నాను. ఉద్యోగ విరమణ తర్వాత సొంతూరుకు వెళ్లి అకాడమీ బాగోగులు చూసుకుంటాను.
సాక్షి: పీఎం, సీఎంల వద్ద పనిచేసిన అనుభవం?
పీటీసీపీ: 1985 నుంచి 1989 వరకూ ఎన్‌టి రామారావు వద్ద, అంతకుముందు చెన్నారెడ్డి వద్ద కొంతకాలం చేశాను. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయన రక్షణ బాధ్యత నాదే. నన్ను ఆయన పేరుపెట్టి పిలిచేవారు. మైసూరా రెడ్డి దగ్గర చాలా కాలం పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సహా ఏడుగురు ఐఏఎస్‌లను దారగడ్డలో మావోయిస్టులు కిడ్నాప్ చేసినప్పుడు వారితో చర్చలు జరపడానికి హైదరాబాద్ నుంచి ఆరుగురు కమాండోలతో పాటు నేను ఎలాంటి ఆయుధం లేకుండా వెళ్లాను. మావోయిస్టులకు వెళ్లి రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకుని వారితో చర్చలు జరిపాను. గతేడాది విజయనగరం పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీపై వచ్చాను. ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులకు తోడు నా శ్రమను జోడించి రూ.కోట్ల విలువైన పనులు చేయించాను. ఇప్పుడు నా దగ్గర 620 మంది శిక్షణ తీసుకుంటున్నారు.
సాక్షి: మీ అమ్మగారంటే మీకు చాలా ఇష్టం అని విన్నాను?
పీటీసీపీ: మా ఇంటికి బాస్ మా అమ్మే. ఆమె పేరు విమల. చాలా స్ట్రిక్ట్. నాన్నయినా, నేనయినా ఎవరైనా అమ్మ చెబితే ఎస్ బాస్ అనాల్సిందే. బీఎస్సీ నర్శింగ్ చదివిన ఆమె మా ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ తీసుకునేవారు. మేం ఎప్పుడూ ఆస్పత్రికి పోలేదు. ఏం వచ్చినా అమ్మచేతిలోనే తగ్గిపోయేది. సాయంత్రం 6 గంటలు దాటే సరికి ఇంటికి వచ్చేయాల్సిందే. ఏడు గంటలకే పడుకోవడం, తెల్లవారుజామున 4గంటలకే నిద్ర లేవడం ఆమెవల్లే అలవాటైంది. ఆహార అలవాట్లు, విశ్రాంతి తీసుకోవడం నా ఆరోగ్య రహస్యం. 68 ఏళ్ల వయసులో అమ్మ అనారోగ్యం పాలైనప్పుడు ఏడుపొచ్చేసింది. ఇప్పుడు కూడా తలచుకుంటుంటే...(ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ) చాలా బాధగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా నాకేదైనా అనారోగ్యంగా ఉన్నా, మనసు బాగోలేకపోయినా వెంటనే ఊరు నుంచి అమ్మను పిలిపించుకునేవాడిని. అమ్మంటే అంత ఇష్టం. అనారోగ్యమే అమ్మను మా నుంచి దూరం చేసింది. కానీ ఆమె జ్ఞాపకాలు నాతోనే ఎప్పుడూ ఉంటాయి. ఆఫీస్‌లో నా కళ్లెదురుగా ఉన్న మా అమ్మ ఫొటోను చూస్తున్నప్పుడల్లా ఆమె ఒడిలో ఉన్నట్టే అనిపిస్తుంటుంది. నా వరకూ చివరి రోజుల్లో అమ్మా, నాన్నలను కష్టపెట్టకుండా బాగా చూసుకున్నాను. నేనే కాదు ఎవరైనా అలానే చూసుకోవాలి. వారి తర్వాతే కదా ఏదైనా, ఎవరైనా.!
Comments
Please login to add a commentAdd a comment