నకిరేకల్ : ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో ఈనెల 4 నుంచి 12వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగే పోలీస్ శిక్షణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి నకిరేకల్ సీఐ విశ్వప్రసాద్ ఎంపికయ్యారు. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇన్వెస్టిగేషన్, రోడ్డు ప్రమాదాలు అనే అంశంపై వారం రోజుల పాటు ప్యారిస్‌లో జరిగే శిక్షణలో విశ్వప్రసాద్ పాల్గొననున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 10 మంది పోలీస్ అధికారులను ఈ శిక్షణకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి నకిరేకల్ సీఐ విశ్వ ప్రసాద్ ఒక్కరికి అవకాశం దక్కింది. శిక్షణకు ఎంపికైన విశ్వప్రసాద్ ప్యారిస్‌కు బయలుదేరారు. ఈ సందర్భంగా నకిరేకల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.